CPM | రెడ్ ఆర్మీ అలర్ట్..! కారు సీట్లలో ఎర్ర దస్తీలు !!

ఆ సీట్లలో స్పెషల్ ఫోకస్.. 5 సీట్లు ఇచ్చినా చాలు..? CPM | విధాత: రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్, వామపక్షాల పొత్తు కథ తుది అంకానికి చేరనప్పటికీ క్షేత్రస్థాయిలో తాము కోరుకుంటున్న అసెంబ్లీ స్థానాల్లో మాత్రం సీపీఐ, సీపీఎంలు స్పెషల్ ఫోకస్ పెట్టి తమ పార్టీ కార్యకలాపాలను ఉధృతం  చేస్తున్నాయి. ఈ క్రమంలో సీపీఎం ఇప్పటికే జనచైతన్య యాత్రలతో ఒక దఫా తమకు బలమున్న నియోజకవర్గాలను చుట్టేయగా, ప్రస్తుతం ఇంటింటికి సీపీఐ పేరుతో సీపీఐ కూడా తమ […]

  • Publish Date - May 2, 2023 / 10:40 AM IST

  • ఆ సీట్లలో స్పెషల్ ఫోకస్..
  • 5 సీట్లు ఇచ్చినా చాలు..?

CPM | విధాత: రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్, వామపక్షాల పొత్తు కథ తుది అంకానికి చేరనప్పటికీ క్షేత్రస్థాయిలో తాము కోరుకుంటున్న అసెంబ్లీ స్థానాల్లో మాత్రం సీపీఐ, సీపీఎంలు స్పెషల్ ఫోకస్ పెట్టి తమ పార్టీ కార్యకలాపాలను ఉధృతం చేస్తున్నాయి.

ఈ క్రమంలో సీపీఎం ఇప్పటికే జనచైతన్య యాత్రలతో ఒక దఫా తమకు బలమున్న నియోజకవర్గాలను చుట్టేయగా, ప్రస్తుతం ఇంటింటికి సీపీఐ పేరుతో సీపీఐ కూడా తమ ప్రాబల్య నియోజకవర్గాల్లో పాదయాత్రలతో సందడి చేస్తున్నది.

ఏప్రిల్ 14న ఇందిరా పార్క్ వద్ద మొదలైన ఇంటింటికి సీపీఐ పాదయాత్రలు మే 14వ తేదీ వరకు కొనసాగనున్నాయి. మేడే ఉత్సవాలను సైతం తాము ఎంచుకున్న నియోజకవర్గాలలో ఎక్కువగా ఫోకస్ పెట్టి భారీ ర్యాలీలు, సభలను ఘనంగా నిర్వహించడం ద్వారా మిత్రపక్ష బీఆర్ఎస్ పార్టీపై క్రమంగా సీట్ల పంపకం ప్రతిపాదనల దిశగా వామపక్షాలు ఒత్తిడి పెంచుతున్నాయి.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీపీఎం సీట్లు ఆశిస్తున్న మిర్యాలగూడ, నల్గొండలో మేడే ఉత్సవ ర్యాలీలు అట్టహాసంగా నిర్వహించారు. సీపీఐ మునుగోడు, దేవరకొండలో మేడే ర్యాలీల నిర్వాహణ తో పాటు ఇంకోవైపు ఇంటింటికి సీపీఐ పాదయాత్రలను జోరుగా కొనసాగిస్తుంది.

ఐదు సీట్లు ఇచ్చినను చాలు..?

బిజెపి వ్యతిరేక సిద్ధాంతంతో , ప్రజల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల నెలకొన్న వ్యతిరేకతను, క్యాడర్ అభిప్రాయాలను సైతం పక్కనపెట్టి ఎలాగైనా తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న లక్ష్యంతో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు బీఆర్ఎస్ తో పొత్తు రాజకీయ వ్యూహాలకు దిగాయి.

తెలంగాణలో తమకు కనీసం 40 అసెంబ్లీ స్థానాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసే శక్తి ఉందని భావిస్తున్న సీపీఐ, సీపీఎంలు పొత్తులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ తమకు గౌరవప్రద స్థానాలు కేటాయించాలని ఆశిస్తున్నాయి.

రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉన్న బీఆర్ఎస్ కు ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత నేపథ్యంలో మెజారిటీ మార్క్ సీట్ల సాధనకు వామపక్షాల పొత్తు అనివార్యంగా కనిపిస్తున్నది. ఇందుకు మునుగోడు ఉప ఎన్నిక బాటలు వేసింది.

అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికలలో వామపక్షాలతో పొత్తుకు సిద్ధపడితే సీట్ల కేటాయింపులలో భాగంగా బీఆర్ఎస్ కు తమ సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాలను కోల్పోవాల్సి ఉండడంతో ఆ పార్టీ నుండి పొత్తుకు ముందడుగు పడటం లేదు.

సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే పొత్తులపై వామపక్షాలు పగటి కలలు కంటున్నాయని, మళ్లీ ఎన్నికల్లో తామే పోటీ చేస్తామంటూ ఇప్పటికే ప్రకటించారు. అయితే తమకు సదరు ఎమ్మెల్యేల అభిప్రాయంతో అవసరం లేదని, బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ కు, తమకు మధ్య పొత్తు.. సీట్ల పై అవగాహన ఉందంటూ సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావులు స్పష్టం చేశారు.

ఇదే సమయంలో ఎన్నికల నాటికి సీట్ల సర్దుబాటు సవ్యంగా సాగకపోతే స్నేహపూర్వక పోటీ అన్న ప్రతిపాదన కూడా గులాబీ పార్టీ నుండి వినిపిస్తుంది. ఇంకోవైపు వామపక్షాలకు ఒకటి రెండు అసెంబ్లీ స్థానాలు ఇచ్చి, చెరో రెండు ఎమ్మెల్సీలు, చెరొక రాజ్యసభ సీట్లతో పొత్తును సర్దుబాటు చేస్తారన్న చర్చ సైతం బీఆర్ఎస్ నుండి ప్రచారమవుతుంది.

అయితే ఎమ్మెల్సీ పదవులు, రాజ్యసభ సీట్లు, స్నేహపూర్వక పోటీల ప్రతిపాదనలను సీపీఎం, సీపీఐ రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా ఖండించడం గమనార్హం. వామపక్షాలు పొత్తులో భాగంగా బీఆర్ఎస్ నుండి చెరో ఎనిమిది నుండి తొమ్మిది స్థానాల కోసం పట్టుబట్టాలని నిర్ణయించుకున్నాయి.

చివరకు చెరో ఐదు సీట్ల వరకైనా దక్కవచ్చని అంచనా వేస్తున్నాయి. వామపక్షాలు కోరిన సీట్లను ఇస్తే అంత మేరకు బీఆర్ఎస్ తమ సిట్టింగ్ సీట్లను కోల్పోవాల్సి వస్తుంది. దీంతో సీట్ల కేటాయింపు వ్యవహారమే ఇప్పుడు బీఆర్ఎస్ కు, వామపక్షాలకు మధ్య చిక్కులు రేపుతుంది.

కనీసం తలో ఐదు సీట్లు అయినా ఇస్తేనే బీఆర్ఎస్ తో పొత్తుకు ముందుకెళ్లాలని లేనట్లయితే ఉభయ కమ్యూనిస్టులు కలిసి, ఎంపిక చేసుకున్న స్థానాల్లో పరస్పర మద్దతుతో కలిసి పోటీ చేయాలన్న ఆలోచన కూడా చేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కారు పార్టీ సీట్లలో సీపీఎం పాలేరు, భద్రాచలం, మిర్యాలగూడ, ఇబ్రహీంపట్నం, మధిర సీట్లలో రెడ్ ఖర్చీఫ్ వేసింది.

సీపీఐ కొత్తగూడెం, హుస్నాబాద్, వైరా, మునుగోడు సీట్లను ఆశిస్తుంది. ఇందులో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాలేరులో, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మిర్యాలగూడలో పోటీకి సిద్ధమయ్యారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నుండి, మాజీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హుస్నాబాద్ నుండి పోటీ చేయనున్నారు.

ఆసక్తి రేపిన కేసీఆర్ ఒంటరి పోరు వ్యాఖ్యలు

మరోవైపు సోమవారం తెలంగాణ భవన్ లో మహారాష్ట్ర నేతల బీఆర్ఎస్ చేరికల సందర్భంగా మహారాష్ట్రలో బీఆర్ఎస్ ఒంటరిగానే అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తుందంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో వామపక్షాల పొత్తుల ఆశలను నీరుగార్చే విధంగా ఉన్నాయి.

ఆలు లేదు చూలు లేదన్నట్లుగా మహారాష్ట్రలో ఇప్పుడిప్పుడే మొదలైన కారు పార్టీ ప్రయాణంతోనే ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఒంటరి పోరు చేస్తామంటూ గంభీర ప్రకటనలు చేస్తుంటే.. సిట్టింగ్ సీట్లను వామపక్షాలకు వదిలేసి తెలంగాణలో పొత్తుకు సిద్ధపడతారా అన్న సందేహాలు బలోపేతం అవుతున్నాయి. ఎన్నికల నాటిదాకా పొత్తుల ప్రహసనాన్ని సాగదీసి నామినేషన్ల పర్వంలో వామపక్షాలను కారు దించేస్తారన్న సందేహాలు క్యాడర్ ను పీడిస్తున్నాయి.

కాగా మహారాష్ట్ర లో పసికూన వంటి బీఆర్ఎస్ ఒంటరి పోరాటానికి సై అంటుంటే స్వాతంత్రం పూర్వం నుండి తెలంగాణలో రాజకీయాల్లో ఉన్న తాము ఒంటరి పోరు ఎందుకు చేయకూడదన్న వాదన వామపక్షాల కేడర్ నుండి వినిపిస్తుంది.

ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ తో సీట్ల లెక్కలు తేలితే బాగుండని, ఆ పార్టీతో కుదరకపోతే కాంగ్రెస్ తో అయినా జతకట్ట వచ్చన్న అభిప్రాయం కూడా వినిపిస్తుంది. కాంగ్రెస్ ఈ దఫా ఎన్నికలకు కొన్ని నెలలకు ముందే సగం సీట్లలోనైనా ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించేందుకు ఆ పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తుంది.

అదే జరిగితే బీఆర్ఎస్ తో పొత్తు కుదరని పక్షంలో కాంగ్రెస్ తో పొత్తుకు కూడా దారులు మూసుకుపోయే పరిస్థితి తప్పదు. ఈ నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నికలతో మొదలైన బీఆర్ఎస్, వామపక్షాల పొత్తు కథ ఎన్నికల తరుణంలో సీట్ల పంపకం దశ నాటికి ఎటువంటి మలుపులు తీసుకోనుందో మునుముందు తేలనుంది.

Latest News