Site icon vidhaatha

క‌రీంగ‌నగ‌ర్‌లో కేబుల్ బ్రిడ్జిపై బీట‌లు

విధాత‌, హైద‌రాబాద్‌: మేడిగ‌డ్డ బ‌రాజ్ వంతెన కుంగిపోయిన విష‌యంలో దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్న అధికార బీఆరెస్‌కు క‌రీంన‌గ‌ర్ కేబుల్ బ్రిడ్జ్ రూపంలో మ‌రో క‌ష్టం ఎదురైంది. రాష్ట్ర ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించి, ఘ‌న‌త‌గా చాటుకున్న క‌రీంన‌గ‌ర్ తీగ‌ల వంతెన రోడ్డు బీట‌లు వారిన దృశ్యాలు సామాజిక మాధ్య‌మాల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఈ వంతెన‌పై వాహ‌నాలు వెళ్లాలంటేనే భ‌య‌ప‌డే ప‌రిస్థితి ఏర్ప‌డింది. రూ. 224 కోట్ల‌తో క‌రీంన‌గ‌ర్ ప‌ట్ట‌ణంలో మానేరు న‌దిపై నిర్మించిన తీగ‌ల వంతెన ప్రారంభించిన నాలుగు నెల‌ల్లోనే నిర్మాణ లోపాలు బ‌య‌ట ప‌డ‌డంతో ప్ర‌భుత్వ ప్ర‌తిష్ఠ మ‌స‌క బారుతున్న‌ద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.


ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా గోదావ‌రిపై నిర్మించిన కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌లోని మేడిగ‌డ్డ బ‌రాజ్‌ కుంగిన విష‌యం తెలిసిందే. ఇది జ‌రిగి నాలుగు రోజులైన కాక‌ముందే కేబుల్ బ్రిడ్జి డొల్ల‌త‌నం బ‌య‌ట ప‌డింది. ఈ కేబుల్ బ్రిడ్జీని ఫోటోలు తీసి సామాజిక మాద్య‌మాల్లో పోస్ట్ చేయ‌డంతో వైర‌ల్ అయింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. బీఆరెస్ ప్ర‌భుత్వం క‌మీష‌న్ల కోసం కాంట్రాక్ట‌ర్ల‌తో కుమ్మ‌క్క‌యి, నాసిర‌కంగా నిర్మించార‌ని, ఇది ప్ర‌జ‌ల‌కు ప్ర‌మాద‌క‌రంగా మారింద‌ని కాంగ్రెస్ నేత‌లు ఆరోపించారు.

క‌రీంన‌గ‌ర్ ప‌ట్ట‌ణంలో మానేరు న‌దిపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణం చేయ‌డం ద్వారా ఇక్క‌డ ప‌ర్యాట‌క రంగాన్ని అభివృద్ది చేయాల‌ని ప్ర‌భుత్వం భావించింది. ఈ మేర‌కు 2017లో రూ..181 కోట్ల అంచ‌నాల‌తో ప‌నులు చేప‌ట్టింది. దాదాపు ఐదేళ్ల పాటు ఈ బ్రిడ్జిని నిర్మించారు. రాష్ట్రంలో దుర్గం చెరువుపై ఒక‌టి, క‌రీంన‌గ‌ర్‌లో మానేరుపై రెండ‌వ వంతెన నిర్మించారు. రూ.181 కోట్ల‌తో చేప‌ట్టిన బ్రిడ్జి నిర్మాణం పూర్త‌య్యే నాటికి అంచ‌నా వ్య‌యం 224 కోట్ల‌కు చేరుకుంది. ఈ వంతెన‌ను ఈ ఏడాది జూన్‌లో మంత్రి కేటీఆర్ అట్ట‌హాసంగా ప్రారంభించారు. ఆ త‌రువాత నెల రోజుల‌కే నిర్మాణ లోప‌డం బ‌య‌ట ప‌డింది. సైడ్‌వాల్‌కు ప‌గుళ్లు వ‌చ్చాయి. వంతెన‌పై తారు లేచి పోయింది.


దీంతో అప్ప‌టిక‌ప్పుడు లోపాలు బ‌య‌ట‌కు క‌నిపించ‌కుండా తాత్కాలిక మ‌ర‌మ్మ‌త్తులు చేప‌ట్టారు. తాజాగా బ్రిడ్జి బీట‌లు వారింది. తారు లేచి పోయి గుంత‌లు ప‌డింది. మ‌రో చోట బ్రిడ్జి పై నుంచి చూస్తే అక్క‌డ‌క్క‌డా కుంగిన‌ట్లు క‌నిపిస్తోంది. ఈ బ్రిడ్జి ప్ర‌స్తుతం పాత కాలం నాటి బ్రిడ్జి మ‌ర‌మ్మ‌త్తుల‌కు నోచుకోకుండా ఉందా అన్న తీరుగా క‌నిపించ‌డం గ‌మ‌నార్హం. దీంతో క‌రీంన‌గ‌ర్ ప‌ట్ట‌ణ వాసులు, ఈ ర‌హ‌దారిపై రాక‌పోక‌లు సాగించే ప్ర‌యాణికులు ప్ర‌భుత్వ తీరుపై తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.

Exit mobile version