క్రమ క్రమంగా కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత స్థితిని చూసే వారు కొందరైతే.. అడ్డదారుల్లో డబ్బు, గౌరవం సంపాదిద్దామని ప్రయత్నించేవారు మరికొందరు. ఈ రెండో కోవ (Cheater) లోకే వస్తాడు అండర్ 19 మాజీ క్రికెటర్ మృణాంక్ సింగ్. ఖరీదైన హోటళ్లో స్టేలు, భోజనాలు, బిజినెస్ క్లాస్ టికెట్లు, ఇన్ స్టాలో మోడల్ ఫొటోలతో ఎంతో ఫేమస్ వ్యక్తిలా కనిపించే ఇతడు పచ్చి మోసగాడ (Cricketer to Conman) ని పోలీసులు పేర్కొన్నారు. లగ్జరీ లైఫ్ స్టైల్ పట్ల చిన్నప్పటి నుంచే ఆకర్షితుడైన మృణాంక్.. అందుకోసం అనేక అడ్డదారులు తొక్కాడని వారు తెలిపారు.
ముంబయి ఇండియన్స్‌లో కొన్ని రోజులు ఆడానని చెప్పుకుంటూ అమ్మాయిలను, అంతర్జాతీయ బ్రాండ్లను, స్పోర్ట్స్ బ్రాండ్లను, ఫైవ్ స్టార్ హోటళ్లను ఎన్ని రకాలుగా మోసం చేయాలో అన్ని రకాలుగానూ మోసం చేశాడు. ఒకవేళ పట్టుబడితే ఏం చేయాలనేదానిపైనా అతడికున్న ప్లాన్ బి చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. వారు తెలిపన ప్రకారం.. హర్యాణాకు చెందిన 25 ఏళ్ల మృణాంక్ సింగ్.. అండర్ 19 స్థాయి వరకు ఎదిగాడు. అనంతరం ఇక ఈ మార్గంలో తాను ఎదగలేనని వక్రమార్గం పట్టి డబ్బు సంపాదిద్దామని నిర్ణయించుకున్నాడు.
ముంబయి ఇండియన్స్‌కు 2014 నుంచి 2018 వరకు ఆడానని చెప్పుకోవడం ప్రారంభించాడు. తనను చాలా పాపులర్ అని.. పలుకుబడి ఉన్నవాడిననీ దర్పం ప్రదర్శించేవాడు. ఆ మాటలకు అనుగుణంగానే తన ఇన్‌స్టా పేజీని బిల్డ్ చేసుకున్నాడు. మోడల్స్ తీసిన ఫొటోలు, డిజైనర్ డ్రెస్‌లతో ఫొటోలు పెట్టేవాడు. దీంతో ఎవరికీ పెద్ద అనుమానం వచ్చేది కాదు. ఇలానే వివిధ అంతర్జాతీయ బ్రాండ్లకు ఇన్‌స్టాలో ప్రచారం చేస్తూ డబ్బులు సంపాదించేవాడు. ఫైవ్ స్టార్ హోటళ్లకు వెళ్లి బిల్లులు పలానా కంపెనీ చెల్లిస్తుందంటూ వెళ్లిపోయాడు.
ఆ తర్వాత ఫోన్ స్విచాఫ్ చేసేవాడు. 2022లో దిల్లీలోని తాజ్ ప్యాలస్ హోటల్‌లో వారం రోజులు బస చేసి మృణాంక్.. తనకు అయిన రూ.5.53 లక్షల బిల్లును అడిడాస్ కంపెనీ చెల్లిస్తుందని సిబ్బందికి చెప్పి వెళ్లిపోయాడు. వారు నమ్మి అతడిని వెళ్లనిచ్చారు. వెళుతూ అతడు రూ.20 లక్షలు లావాదేవీలు జరిగనట్లు ఒక బ్యాంకు బుక్‌నువారికి చూపించి నమ్మించాడు. అయితే అడిడాస్ నుంచి వారికి చెల్లింపులు జరగకపోవడంతో మృణాంక్‌కు ఫోన్ చేద్దామని చూస్తే స్విచాఫ్ వచ్చింది.
దీనిపై హోటల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన వెనుక పోలీసులు పడుతున్నారని ఉప్పందుకున్న ఈ మోసగాడు రెండో ప్లాన్‌ను కూడా సిద్ధం చేసుకున్నాడు. దాంతో పాటే తన ఇన్‌స్టా అకౌంట్‌లో వివిధ ప్రాంతాలను సందర్శిస్తున్నట్లు తప్పుదోవ పోస్టులు పట్టించే ప్రయత్నం చేశాడు. ఆఖరికి శాశ్వతంగా దుబాయ్ వెళ్లిపోయినట్లు కూడా కొన్ని పోస్టులు పెట్టాడు. దీంతో పోలీసులు అతడిపై లుకవుట్ నోటీసులు జారీ చేశారు.
కట్ చేస్తే ఈ నెల 25 న హాంకాంగ్ పారిపోవడానికి ప్రయత్నించగా.. దిల్లీ ఎయిర్‌పోర్ట్ సిబ్బంది అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు కూడా అతడు ఏమాత్రం తొణకకుండా తన ప్లాన్ బీని అమలు చేయడానికి ప్రయత్నించాడు. తాను కర్ణాటక క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అలోక్ కుమార్‌నని చెప్పాడు. తన తండ్రి అశోక్ కుమార్ సింగ్ 80ల్లో భారత క్రికెట్ జట్టుకు ఆడారని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఇతడి గురించి అప్పటికే సమాచారం సేకరించిన అధికారులు అవేమీ పట్టించుకోకుండా అదుపులోకి తీసుకున్నారు. ఈ మోసాల పరంపరలో ఇతడి బారిన భారత అంతర్జాతీయ క్రికెటర్ రిషభ్ పంత్ (Rishabh Pant)కూడా పడటం గమనార్హం.
2020-21లో రూ.1.63 కోట్లను పంత్ ఇతడి వల్ల నష్టపోయాడని పోలీసులు తెలిపారు. అది ఎలా అనేది బయటపెట్టలేదు. దర్యాప్తులో భాగంగా అతడి ఫోన్‌ను స్కాన్ చేసిన అధికారులు నివ్వెరపోయారు. పదుల సంఖ్యలో అమ్మాయిలతో నగ్నంగా ఫొటోలు, డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు, వాటిని తీసుకుంటున్నట్లు ఉన్న ఫొటోలు, వీడియోలను గుర్తించారు. నిందితుడు దిల్లీ యూనివర్సిటీ నుంచి డిగ్రీ తీసుకున్నాడని, ఓపీజేఎస్ యూనివర్సిటీ నుంచి ఎంబీయే చేశాడని పోలీసులు పేర్కొన్నారు. అరెస్టుపై అతడి కుటుంబానికి సమాచారం ఇవ్వగా.. తమ కుమారుణ్ని ఎప్పుడో పట్టించుకోవడం మానేశామని.. అతడిపై తమకు ఎలాంటి నియంత్రణా లేదని వారు చెప్పినట్లు వెల్లడించారు.