Urea Crisis In Telangana : రైతులకు పోలీస్ స్టేషన్ లో యూరియా టోకెన్ల పంపిణీ!

కామారెడ్డిలో యూరియా కొరత కారణంగా రైతులకు పోలీస్ స్టేషన్ ఆవరణలో టోకెన్లు ఇచ్చి పంపిణీ చేయడం పెద్ద కలకలానికి దారితీసింది.

విధాత : తెలంగాణ వ్యాప్తంగా రైతులు యూరియా కోసం తిప్పలు పడుతున్నారు. రోజంతా క్యూలైన్లలో నిలుచుని రైతులు యూరియా కోసం నిరీక్షిస్తున్న దృశ్యాలు కొన్ని రోజులుగా తెలంగాణలో నిత్య కృత్యమయ్యాయి. యూరియాల కోసం క్యూలైన్లు, రాస్తారోకోలు సాధారణమైపోయాయి. కేంద్రం నుంచి రాష్ట్రానికి డిమాండ్ కు సరిపడా యూరియా సరఫరా కాకపోవడంతో రైతులు యూరియా కొరత సమస్యను ఎదుర్కొంటున్నారు.

తాజాగా కామారెడ్డి బీబీపేట్ మండల కేంద్రంలోని సహకారం సంఘం సొసైటీకి కేవలం 600 బస్తాల యూరియా రావడంతో ఎవరికి పంపిణీ చేయాలో అర్థంకాక సొసైటీ సిబ్బంది చేతులెత్తేశారు. సొసైటీకి యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతులు భారీగా తరలిరావడంతో రైతులను కట్టడి చేయలేక పోయారు. ఈ సందర్భంగా రైతులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు రైతులను నియంత్రించేందుకు యూరియా టొకెన్ల పంపిణీని పోలీస్ స్టేషన్ లో చేపట్టాలని నిర్ణయించి రైతులను అక్కడికే రావాలని ఆదేశించారు. దీంతో రైతులంతా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు.

పోలీస్ స్టేషన్ ఆవరణలో క్యూలైన్ల వారిగా రైతులను కూర్చోబెట్టిన పోలీసులు వారికి టొకెన్లు పంపిణీ చేశారు. టోకెన్లు తీసుకుని రైతులు సొసైటీ వద్ధకు వెళ్లి యూరియా బస్తాలు తీసుకున్నారు. అలా కొంతమందికే యూరియా బస్తాలు దొరుకగా..సరిపడా స్టాక్ లేని కారణంగా మిగతా రైతులకు యూరియా దొరకలేదు. దీంతో యూరియా బస్తాలు లభించని రైతులు గంటల తరబడి క్యూలెన్లనో పడిన మా నిరీక్షణ వృధా అయిపోయిందంటూ అసహనానికి గురై ప్రభుత్వంపై, పోలీసులపై, అధికారులపై మండిపడ్డారు.