Haryana Driver Wins ₹10 Crore Punjab Lohri–Makar Sankranti Bumper Lottery; Celebrations Erupt in Sirsa Village
విధాత వైరల్ డెస్క్ | హైదరాబాద్:
₹10 Crore Lottery win | హర్యాణాలోని సిర్సా జిల్లాలో డ్రైవర్‌గా, రోజువారీ కూలీగా జీవనం సాగిస్తున్న పృథ్వీ సింగ్ అనే వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయాడు. పంజాబ్ స్టేట్ డియర్ లాటరీ నిర్వహించిన లోహ్రీ–మకర్ సంక్రాంతి బంపర్ 2026 డ్రాలో రూ.10 కోట్ల ప్రథమ బహుమతి పృథ్వీని వరించింది. రూ.500 పెట్టి కొన్న టికెట్నే బంపర్ ప్రైజ్ పృథ్వీ కుటుంబంలో, గ్రామంలో ఉత్సాహం వెల్లివిరిసింది.
రూ.500 టికెట్ బంపర్ బహుమతి — పృథ్వీ కుటుంబంలో హర్షం
ముహమ్మద్‌పురియా గ్రామానికి చెందిన 35 ఏళ్ల పృథ్వీ సింగ్ డ్రైవర్‌గా, కూలీగా పని చేస్తాడు. భార్య సుమన్ దగ్గర్లోని పాఠశాలలో ప్యూన్‌గా పనిచేస్తుంది. ఆర్థిక సమస్యల్లో ఉన్న ఈ కుటుంబం, కొన్ని రోజుల క్రితం కిలియన్‌వాలి మండిలో లాటరీ విక్రేత మదన్ లాల్ వద్ద పృథ్వీసింగ్ 500, 200, 100 రూపాయల విలువగల మూడు టికెట్లు కొనుగోలు చేసారు. వాటిలో రూ.500ల టికెట్‌కే ఈ బంపర్ బహుమతి దక్కింది.
విజేత టికెట్ నంబర్: 327706
విషయం తెలిసిన వెంటనే గ్రామస్థులు, బంధువులు పృథ్వీ ఇంటికి చేరుకుని కరెన్సీ నోట్లతో చేసిన దండలతో అతన్ని సత్కరించారు. పృథ్వీ ఆ డబ్బుతో తన కుటుంబానికి మంచి భవిష్యత్తును అందజేయాలని, పిల్లల జీవితాలను కూడా బాగా సెటిల్ చేయాలనే కోరిక వెలిబుచ్చాడు. అలాగే చిన్న వ్యాపారం ప్రారంభించాలని ప్రకటించాడు. ఆరేళ్ల కుమారుడు దక్ష్ థార్ ఎస్యూవీ కొనాలనే ఆకాంక్ష తెలిపాడు.
రెండో ప్రయత్నంలోనే ఘనవిజయం : రూ.7 కోట్లు చేతికి
పృథ్వీసింగ్ లాటరీ టికెట్ కొనుగోలు చేయడం ఇది రెండోసారి మాత్రమే. గత ప్రయత్నంలో విజయం దక్కని తనకు రెండోసారే బహుమతి దక్కడంతో ఆ కుటుంబ ఆనందానికి అంతులేకుండా పోయింది. ఇదంతా దైవకృప అనీ, తాము ఇది ఊహించలేదని పృథ్వీ భార్య సుమన్ తెలిపింది. లాటరీ విక్రేత మదన్ లాల్ స్వయంగా ఫోన్ చేసి పృథ్వీకి సమాచారం ఇచ్చాడు. తన కెరీర్‌లో కూడా ఇదే అత్యంత పెద్ద బహుమతి అని చెప్పారు.బహుమతిని పొందడానికి పృథ్వీ..తన ఆధార్, పాన్‌కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్, అసలు లాటరీ టికెట్తో చండీగఢ్ లాటరీ కార్యాలయానికి హాజరుకానున్నాడు. కాగా, 30% పన్ను తగ్గించిన తర్వాత రూ.7 కోట్లు నేరుగా పృథ్వీ బ్యాంక్ ఖాతాలో జమ కానున్నాయి.
పృథ్వీ గ్రామ సర్పంచ్, గ్రామస్థులు ఈ అద్భుత విజయాన్ని పెద్ద పండుగలా జరుపుకుంటున్నారు. పృథ్వీ సింగ్ లాటరీ గెలుపు సిర్సా ప్రాంతంలో చర్చనీయాంశమైంది. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అతని జీవితం ఒక్క రోజులో మారిపోయింది. ఈ బహుమతిని కుటుంబ భవిష్యత్తు కోసం వినియోగిస్తానని పృథ్వీ ప్రకటించాడు. కాగా, గ్రామస్థులు, బంధువులు వచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
