Site icon vidhaatha

Rahul Disqualification | ప్రతిపక్షాలకు.. బ్రహ్మాస్త్రం ఇచ్చిన మోదీ

Rahul Disqualification । రాహుల్‌పై లోక్‌సభ సచివాలయం అత్యుత్సాహంతో ప్రయోగించిన అనర్హత వేటు అస్త్రం బీజేపీకి బూమరాంగ్‌ అవుతుందా? లేక రాహుల్‌, కాంగ్రెస్‌తోపాటు.. యావత్‌ బీజేపీ వ్యతిరేక ప్రతిపక్షాలకు బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చినట్టు అవుతుందా? ఇప్పడు రాజకీయ విశ్లేషకులు దీని చుట్టూనే చర్చలు నడిపిస్తున్నారు.

విధాత: పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు(Surat Court) తీర్పు వచ్చిన 24 గంటల్లోనే రాహుల్‌గాంధీ (Rahul Gandhi) పై లోక్‌సభ సెక్రటేరియట్‌ ప్రదర్శించిన అత్యుత్సాహం బీజేపీ(BJP)కి లేని తలనొప్పి తెచ్చిపెడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే రాహుల్‌గాంధీపై తీసుకున్న చర్య వెనుక రాజకీయ దురుద్దేశం స్పష్టంగా బయటపడిపోయింది. రాహుల్‌పై అనర్హత వేటు ద్వారా యావత్‌ ప్రతిపక్షాన్ని బీజేపీయే ఒక్కటి చేసిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. రాహుల్‌పై చర్యను అన్ని ప్రతిపక్షాలూ ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. ఇది కేవలం ప్రకటనకే పరిమితం కాబోవడం లేదని, రానున్న రోజుల్లో మహా ఐక్యత దిశగా కదిలే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

బీజేపీ కీలక అంశాలను కదిపిన రాహుల్‌

ఈ విషయంలో న్యాయపోరాటం చేస్తామని కాంగ్రెస్‌ చెబుతున్నా.. వీధి పోరాటాలకు సైతం ఆ పార్టీ తహతహలాడిపోతున్నది. 2014 తర్వాత కాంగ్రెస్‌ తీసుకున్న అతిపెద్ద కార్యక్రమం రాహుల్‌ నిర్వహించిన భారత్‌ జోడో యాత్ర(Bharath Jodo Yatra). ఆ యాత్ర నుంచి రాహుల్‌గాంధీ మోదీ ప్రభుత్వంపై విమర్శలను పదునెక్కించారు.

ప్రత్యేకించి మోదీ ప్రభుత్వం కప్పుకొన్న ‘జాతీయవాదం’, ‘అవినీతి రహిత ప్రభుత్వం’ అన్న ముసుగులను తొలగించేలా మాట్లాడుతున్నారు. ప్రతి ఉపన్యాసంలో లేదా సంభాషణల్లో మోదీ ప్రభుత్వం లద్దాఖ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని భారత సరిహద్దుల్లో చైనా దురాక్రమణ విషయంలో ఏం జరుగుతున్నదో తెలియని స్థితిలో ఉండటంపై విరుచుకుపడుతున్నారు. అదే సమయంలో అతి స్వల్ప వ్యవధిలో అదానీ గ్రూపు అనూహ్య ఎదుగుదలను ప్రశ్నిస్తున్నారు.

BJP.. నయా ఔరంగజేబ్‌!

హిండెన్‌బర్గ్‌ నివేదికతో కాంగ్రెస్‌కి నూత‌నోత్సాహం..

ఏ ఎన్నికలు వచ్చినా జాతీయవాదాన్ని రెచ్చగొట్టడం బీజేపీకి అలవాటే. అదే సమయంలో తాను అవినీతి రహితమని చెప్పుకొంటూ వస్తుంది.. కానీ.. ఈ రెండు అంశాలను రాహుల్‌గాంధీ ప్రస్తావించడం బీజేపీకి ఇబ్బందికరమైన అంశంగా మారింది. ఎందుకంటే ఈ రెండు అంశాలు బీజేపీకి అత్యంత సున్నితమైనవి.
మోదీతో ఉన్న సాన్నిహిత్యంతో అదానీ (Gautam Adani) వేల కోట్లకు పడగలెత్తాడనేది బహిరంగ రహస్యమే.

అదానీ గ్రూప్‌ ఫైనాన్షియల్‌ స్కాంను అమెరికాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ హిండెన్‌బర్గ్ నివేదిక బట్టబయలు చేసింది. దాంతో అదానీ-మోదీ సంబంధంపై అప్పటికే రాహుల్‌ చేస్తున్న విమర్శలకు బలం చేకూరినట్టయింది. రాహుల్‌ వ్యాఖ్యలకు విశ్వసనీయత కూడా పెరిగింది. ఒక విధంగా హిండెన్‌బర్గ్‌ నివేదిక వృద్ధ కాంగ్రెస్‌ పార్టీకి కొత్త విశ్వాసం ఇవ్వటమేకాకుండా.. 2014 సర్వత్రిక ఎన్నికల ప్రచారానికి ప్రధాన భూమికను కూడా ఏర్పటు చేసినట్టయింది.

నోట్ల రద్దు వైఫల్యం కావచ్చు.. జీఎస్టీ వ్యవస్థను సక్రమంగా అమలు చేయలేకపోవడం కావచ్చు.. ఆఖరుకు పెట్రోల్‌, గ్యాస్‌, ఇతర నిత్యావసరాల ధరల పెరుగుదల, నిరుద్యోగిత ఇలా ఏ విషయంలోనూ మోదీ సర్కారు ఇబ్బందికి గురైన సందర్భాలు లేవు. ఎన్ని వైఫల్యాలు ఉన్నా, నిరుద్యోగం పెరిగిపోతున్నా, ధరలు ఆకాశాన్నంటుతున్నా.. బీజేపీ ఉపయోగించే బలమైన హిందూత్వ కార్డుతో ప్రజలు ఆ పార్టీని గొప్ప పార్టీగానే పరిగణిస్తూ వస్తున్నారు. జాతీయవాదం, అవినీతికి వ్యతిరేకం అన్న ఆ పార్టీ వాదనలు ప్రజలను బుట్టలో పడేస్తూనే ఉన్నాయి.

ఈ క్రమంలోనే చైనా దురాక్రమణ, అదానీ ఆస్తులు బీజేపీ ఇప్పటిదాకా చెప్పుకొంటున్న జాతీయవాదం, అవినీతి రహితం అన్న నినాదాల గాలి తీసేశాయి. మోదీ గొప్ప రాజనీతిజ్ఞుడని, ప్రజాస్వామ్య దేశాలకు తల్లి లాంటి భారతదేశాన్ని పాలిస్తున్నాడని, ఆయన విశ్వ గురు అని గొప్పలకు పోతున్న సమయంలో ఈ పరిణామాలు బీజేపీకి మింగుడు పడలేదు. ఇవి రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా ప్రభావం చూపిస్తాయనే చర్చ కూడా జరిగింది.

Telangana BJP | మా దారి మేం చూసుకుంటాం.. BJP పెద్దలను కలిసిన ఈటల, రాజగోపాల్‌రెడ్డి

అప్పీలుకు స‌మ‌యం ఉన్నా.. అత్యుత్సాహం

అయితే.. బ్రిటన్‌లో రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ తమ దేశంలోని చట్టసభల్లో తమకు మాట్లాడే అవకాశం రాదని, తమ మైకులు బంద్‌ అయిపోతుంటాయని వ్యాఖ్యానించారు. వాటిని పట్టుకున్న బీజేపీ నాయకులు రాహుల్‌ను టార్గెట్‌ చేశారు. రాహుల్‌ క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. ప్రతిపక్ష నేతల్లో ఎవరినీ టార్గెట్‌ చేయనంతటి స్థాయిలో రాహుల్‌ను బీజేపీ నేతలు చుట్టుముట్టారు. రాహుల్‌ గాంధీ లోక్‌సభలో మాట్లాడేందుకు అవకాశం కూడా దక్కలేదు.

ఒకవైపు మోదీ-అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలన్న డిమాండ్‌తో పార్లమెంటులో వాయిదాల పర్వం నడిచింది. అప్పటిదాకా పప్పు అని బీజేపీ నేతల హేళనలు పొందిన రాహుల్‌గాంధీ.. మోదీకి దీటైన నాయకుడిగా గుర్తింపు పొందుతున్న తరుణంలోనే సూరత్‌ కోర్టు తీర్పు వచ్చింది. అయితే.. రాహుల్‌కు అప్పీలు చేసుకునే సమయం ఉన్నా.. లోక్‌సభ సచివాలయం అత్యుత్సాహం ప్రదర్శించి.. అతడిని అనర్హుడిగా ప్రకటించింది.

ఇదే.. కాంగ్రెస్‌కు మంచి త‌రుణం..

అయితే.. ఈ చర్య ద్వారా బీజేపీ తన గోతిని తానే తవ్వుకున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇది కాంగ్రెస్‌కు, వ్యక్తిగతంగా రాహుల్‌కు శుభపరిణామమేనన్న వాదనలూ వినిపించాయి. మరో ఏడాదికాలంలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీజేపీకి కీలకమైన ప్రత్యర్థిగా కాంగ్రెస్‌ను ముందుకు తీసుకువెళ్లేందుకు, పార్టీని పటిష్టం చేసుకునేందుకు కాషాయ నేతలే అవకాశం కల్పించారన్న చర్చ జరుగుతున్నది.

పైగా.. అనర్హత వేటు పడిన రాహుల్‌కు మమతాబెనర్జీ, అరవింద్‌ కేజ్రీవాల్‌, కే చంద్రశేఖర్‌రావు, వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇలా అనేక మంది మద్దతు లభించింది. వీరంతా కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి రాజకీయాలకు చిత్తవుతున్నవారే కావడం విశేషం.

అదే సమయంలో తన మొండితనాన్ని వీడి.. నాయకత్వం అంశం ముందుకు తేకుండా సహచర ప్రతిపక్షాలకు కాంగ్రెస్‌ మరింత దగ్గరవ్వాల్సిన అవసరం ఉందని పలువురు రాజకీయ నిపుణులు సూచిస్తున్నారు. కాంగ్రెస్‌కు ఇదే అందుకు మంచి తరుణమని చెబుతున్నారు. బీజేపీ తనంతట తాను ప్రతిపక్షాలు ఏకమయ్యేందుకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఇతర ప్రతిపక్షాలకు ఎంత బాధ్యత ఉన్నదో కాంగ్రెస్‌కు అంతకు మించి ఉన్నదని అంటున్నారు.

Exit mobile version