Mysore Silk Sarees | చీరల కోసం ఉదయం 4 గంటల నుంచే షోరూమ్‌ ముందు బారులు తీరిన మహిళలు.. ఎందుకంత డిమాండ్..?

రూ.2.5 లక్షల ధర ఉన్న మైసూరు సిల్క్ చీరల కోసం మహిళలు తెల్లవారకముందే క్యూ కట్టారు. KSIC షోరూమ్‌ల వద్ద కనిపించిన రద్దీ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Mysore Silk Sarees

మహిళలకు చీరలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వస్త్రధారణలో చీర (Saree) స్థానం ఎప్పటికీ పై మెట్టే. ప్రపంచానికి చీర అందం పరిచయం చేసిన ఘనత మన దేశానికే దక్కుతుంది. అందంగా కనిపించేందుకు రకరకాల దుస్తులు ధరిస్తుంటాం. ఎన్ని రకాల దుస్తులు ధరించినా.. చీర ఇచ్చే అందం మరేవీ ఇవ్వలేవు. ఈవెంట్‌ ఏదైనా భారతీయ మహిళలు చీర కట్టులో మెరవాల్సిందే. పెళ్లిళ్లు, శుభకార్యాలు వచ్చాయంటే చాలు.. వేలల్లో, లక్షల్లో ఖర్చు పెట్టి పట్టుచీరలు
కొంటుంటారు. ధర్మవరం పట్టు, గద్వాల్‌ పట్టు, మంగళగిరి పట్టు అంటూ.. ప్రత్యేక సందర్భానికి తగ్గట్టు అందుబాటులో ఉన్న చీరలు కొనుగోలు చేస్తుంటారు.

మార్కెట్‌లోకి కొత్త రకం చీర వచ్చిందంటే చాలు క్షణాల్లో అక్కడ వాలిపోయి కొనేస్తారు. అయితే, చీరల కోసం తెల్లవారకముందే దుకాణాల ముందు క్యూ కట్టిన ఘటనలు ఎప్పుడైనా చూశారా..? అయితే, ఈ వార్త మీ కోసమే. మైసూర్‌ సిల్క్‌ శారీస్‌ (Mysore Silk Sarees)కు ఉన్న క్రేజ్‌ వేరు. తాజాగా మైసూర్‌ పట్టు చీరల కోసం మహిళలు ఉదయం 4 గంటల నుంచే దుకాణం ముందు క్యూ కట్టారు. కర్ణాటక సిల్క్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ షోరూమ్‌ (Karnataka Silk Industries Corporation) ముందు బారులు తీరారు. షాప్‌ ఓపెన్‌ చేయకముందే దుకాణం ముందు కిలోమీటర్ల మేర క్యూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

చీర ధర రూ.2.5 లక్షలు

సదరు చీరల ధర గరిష్టంగా రూ.23 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు ఉంది. అయినప్పటికీ మహిళలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఆ చీరలను సొంతం చేసుకునేందుకు గంటల తరబడి క్యూలో నిలబడ్డారు. ప్రైవేట్ మార్కెట్లో నకిలీ పట్టు విక్రయాలు జరుగుతుండటంతో.. జీఐ ట్యాగ్ ఉన్న స్వచ్ఛమైన ఈ మైసూర్ సిల్క్
చీరలు కొనేందుకు ఎగబడుతున్నారు. నైపుణ్యం కలిగిన నేత కార్మికుల కొరత కారణంగా సిల్క్ చీరలు ఉత్పత్తి చేయడం తగ్గిపోయి.. షోరూమ్‌ల వద్ద తీవ్ర కొరత ఏర్పడిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు మహిళకు ఒక్క చీర మాత్రమే ఇస్తామని ప్రకటించడంతో మహిళలకు షోరూమ్‌ వద్దకు పరుగులు తీశారు. దీంతో అక్కడ భారీ క్యూ దర్శనమిచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. ఆ వీడియోలు చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు.

మైసూరు సిల్క్ చీరల కొరతకు కారణాలు..

నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని వ్యాపారులు చెబుతున్నారు. కొత్త వారికి బేసిక్ ట్రైనింగ్ ఇవ్వడానికే కనీసం 6 నుంచి 7 నెలల సమయం పడుతోంది. దీంతోపాటు చీర నాణ్యత ఏ మాత్రం తగ్గకుండా ఉండటం కోసం కేఎస్ఐసీ కేవలం తన సొంత యూనిట్లలో మాత్రమే ఈ మైసూరు సిల్క్ చీరలను ఉత్పత్తి చేస్తోంది. 2025లో ఈ చీరల ఉత్పత్తిని పెంచినప్పటికీ.. డిమాండ్‌తో పోలిస్తే అది చాలా తక్కువగా ఉంది. దీంతో మునుపెన్నడూ లేని విధంగా ఈ చీరలకు ఒక్కసారిగా
డిమాండ్ పెరిగింది.

 

ఇవి కూడా చదవండి :

Telangana Advisors System| క్యాబినెట్ పరిమాణంపై పరిమితులు.. దొడ్డిదోవన సలహాదారుల పేరిట పందేరం.. సేవ కోసమా? ప్రాపకం కోసమా?
Telangana High Court | పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై జబర్ధస్త్ తగదు : హైకోర్టు కీలక ఆదేశాలు

Latest News