Telangana Advisors System| క్యాబినెట్ పరిమాణంపై పరిమితులు.. దొడ్డిదోవన సలహాదారుల పేరిట పందేరం.. సేవ కోసమా? ప్రాపకం కోసమా?

మంత్రివర్గంలో సీటు కోసం తాపత్రయపడేవారుంటే.. వారిని శాంతపర్చేందుకు సలహాదారు పదవి కేటాయింపు! రాజకీయ అవసరాల కోసం మరొకరికి సలహాదారు పదవి! రిటైర్డ్‌ అధికారులకూ అదే పందేరం.. నిజానికి వీళ్లంతా ప్రజలకు సేవ చేసేందుకా? రాజకీయ పునరావాస కల్పనకా?

telangana-advisors-system-controversy

విధాత, హైదరాబాద్:

Telangana Advisors System| తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ సలహాదారుల మూలంగా కోట్ల రూపాయల ప్రజాధనం నీళ్ల ప్రాయంలా ఖర్చవుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో దాదాపు పదేళ్లపాటు పాలించిన కేసీఆర్.. ఇష్టానుసారంగా తొలిసారి పార్లమెంటరీ కార్యదర్శులను నియమించారు. ఈ నియామకాలను హైకోర్టు రద్ధు చేయడంతో.. మరో రూపంలో సలహాదారుల వ్యవస్థను తీసుకువచ్చారు. వీరందరికీ క్యాబినెట్‌ హోదా కల్పించి రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు. ఒక్కో సలహాదారుడి మూలంగా ప్రభుత్వానికి ప్రతినెలా సుమారు రూ.25 లక్షలు వ్యయం అవుతున్నదని అంచనా.

తెలంగాణ శాసన సభ్యుల మొత్తం సంఖ్య119. భారత రాజ్యాంగం ప్రకారం వీరిలో పదిహేను శాతం వరకూ.. అంటే.. 18 మందిని మంత్రులుగా నియమించుకునే అధికారం ఉంది. రాజకీయ అవసరాలు, సమీకరణాల నేపథ్యంలో మరింత మంది మంత్రి పదవుల కోసం పట్టుబడుతున్నారు. మంత్రుల సంఖ్య విషయంలో పరిమితి రీత్యా అటువంటివారిని సలహాదారులుగా నియమించుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్నది. వారికి మంత్రి స్థాయి హోదాలు, మందీమార్బలాన్ని సమకూర్చుతున్నారు. ఇలా ఇష్టానుసారం పెద్ద సంఖ్యలో సలహాదారులను నియమించుకోవడంపై చాలా కాలం నుంచి విమర్శలు ఉన్నాయి. గతంలో కాంగ్రెస్‌ ఎంపీగా ఉన్న గుత్తా సుఖేందర్‌ రెడ్డి, అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్‌ రెడ్డి.. హైకోర్టును ఆశ్రయించారు. సలహాదారులకు భారీ జీతభత్యాలు, ప్రత్యేక సిబ్బంది, కార్యాలయం సమకూర్చడం అధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని వాదించారు. సలహాదారుల వ్యవస్థను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్ గత నెలలో హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేశారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి కూడా మాజీ సీఎం కే చంద్రశేఖర్ రావు బాటలోనే నడుస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ నియామకాలు వెనకాల రాజకీయ ఉపాధి కోణం ఉందన్న విమర్శలు కొట్టిపారేయలేమంటున్నారు విశ్లేషకులు. ఎన్నికల్లో టిక్కెట్లు దక్కనివారికి, పార్టీ కోసం కష్టపడిన సానుభూతి పరులకు, మంత్రివర్గంలో చోటు లభించని వారికి.. సలహాదారు పదవులు ఇవ్వడం ఆనవాయితీగా మార్చుకున్నారని వారు చెబుతున్నారు.

రాష్ట్రం పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. స్వయానా ముఖ్యమంత్రే ఈ విషయాన్ని పదే పదే చెబుతూ వస్తున్నారు. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రతి నెలా వేల కోట్ల రూపాయలు బాండ్ల విక్రయం, బ్యాంకుల ద్వారా నిధులు సమీకరించుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో పొదుపు చర్యలు పాటించాల్సింది పోయి.. ప్రభుత్వ నిధులను రేవంత్‌ సర్కార్‌ దుబారా చేస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పార్లమెంటరీ సెక్రెటరీలు, సలహాదారుల వ్యవస్థలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తరువాత పాత సర్కార్ విధానాన్నే పాటిస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. వీరందరినీ ప్రజలకు సేవ చేసేందుకు నియమించుకున్నారా? లేక ప్రాపకం కోసమా? అనే చర్చ సచివాలయంలో జోరుగా వినిపిస్తున్నది.

ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కే కేశవరావు.. ప్రజా వ్యవహారాల సలహాదారుగా ఉన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, పీ సుదర్శన్ రెడ్డి సలహాదారులుగా వ్యవహరిస్తున్నారు. కే ప్రేమ్ సాగర్ రావు.. టీజీ పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ పదవిలో ఉన్నారు. డాక్టర్ జీ చిన్నారెడ్డి.. తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. వేం నరేందర్ రెడ్డి.. ప్రజా వ్యవహారాలు, మహ్మద్ అలీ షబ్బీర్.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం, హర్కర వేణుగోపాల్ రావు.. ప్రొటోకాల్, పబ్లిక్ రిలేషన్స్, ఏపీ రిటైర్డు ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్.. జల వనరులు, నీటి పారుదల, ఏపీ జితేందర్ రెడ్డి క్రీడా వ్యవహారాలు.., ఎంపీ మల్లు రవి ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా, కే.పెంటారెడ్డి ఎత్తిపోతల పథకాల సలహాదారులుగా పనిచేస్తున్నారు. ఇవి కాకుండా పలు కార్పొరేషన్ల చైర్మన్లకు కూడా మంత్రి హోదా కల్పించారు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 (1ఏ) ప్రకారం మంత్రివర్గంలో లేని వ్యక్తులకు మంత్రి హోదా ఇవ్వడం ఉల్లంఘనే అవుతుంది. శాసనసభలో సభ్యుల సంఖ్య ప్రకారం పదిహేను శాతం వరకు అనగా 18 మందిని మంత్రిమండలిలో తీసుకునే అవకాశం ఉంది. వీరిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం లేకపోవడంతో సలహాదారులుగా నియమించుకుని, మంత్రికి ఇచ్చే సౌకర్యాలు, ప్రొటోకాల్, జీత భత్యాలు ఇస్తుండడం గమనార్హం.

కేసీఆర్ రాగానే పార్లమెంటరీ సెక్రెటరీల వ్యవస్థకు శ్రీకారం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దెనెక్కింది. ఆ సమయంలో పార్లమెంట్ సెక్రెటరీల నియామకం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 23, 2015న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2014, డిసెంబర్ నెలలో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పార్లమెంటరీ సెక్రెటరీల నియామకం కోసం తీర్మానం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్.. సీఎం కార్యాలయం, జలగం వెంకట్రావు.. సీఎం కార్యాలయం, వీ శ్రీనివాస్ గౌడ్.. రెవెన్యూ, గ్యాదరి కిశోర్ కుమార్.. వైద్యం, ఆరోగ్యం, వొడితెల సతీష్ కుమార్.. విద్య, కోవా లక్ష్మి .. వ్యవసాయం విభాగాలకు పార్లమెంటరీ సెక్రెటరీలుగా నియమించారు. పార్లమెంటరీ సెక్రెటరీలకు క్యాబినెట్‌ ర్యాంక్‌ ఇవ్వడాన్ని ఎంపీ గుత్తా సుఖేంధర్ రెడ్డి, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి హైకోర్టులో సవాల్ చేయగా నియామకాలు చెల్లవంటూ ఆదేశాలు వచ్చాయి. ఆ తరువాత కేసీఆర్ ప్రభుత్వం రూట్ మార్చింది. వారి స్థానంలో సలహాదారుల వ్యవస్థను తీసుకువచ్చింది. వారందరికీ మంత్రి హోదా కల్పించి సకల సౌకర్యాలు కల్పించింది.

కేసీఆర్ హయాంలో ఇష్టానుసారంగా సలహాదారుల నియామకం

బీఆర్ఎస్ హయాంలో మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు రాజీవ్ శర్మ, ఎస్ కే జోషి, సోమేశ్ కుమార్ ప్రధాన సలహాదారులుగా వ్యవహరించారు. మాజీ డీజీపీ అనురాగ్ శర్మ.. పోలీసు డిపార్ట్ మెంట్ సలహాదారుగా, రిటైర్డు ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్.. మైనారిటీ సంక్షేమం సలహాదారుగా, రిటైర్డు ఐఈఎస్ అధికారి జీఆర్ రెడ్డి ఆర్థిక సలహాదారుగా, రిటైర్డు ఐఎఫ్ఎస్ అధికారి ఆర్ శోభ.. అటవీ వ్యవహారాల సలహాదారుగా, ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్.. వ్యవసాయ ప్రధాన సలహాదారుగా, సుద్దాల సుధాకర్ తేజ.. వాస్తు సలహాదారుగా, జీ.వివేక్ వెంకటస్వామి, టంకశాల అశోక్.. అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారులుగా), రాజేంద్ర ప్రసాద్ సింగ్.. విద్యుత్ సలహాదారుగా నియామకాలు పొందారు. ఈ నియామకాలను వ్యతిరేకిస్తూ 2015లో అప్పటి కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా పలువురికి సలహాదారుల రూపంలో కేబినెట్ ర్యాంకు పదవుల పందేరం చేసిందని తన పిటిషన్ లో ఫిర్యాదు చేశారు. పైన పేర్కొన్న వారే కాకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తొలినాళ్లలో మాజీ ఇంజినీర్ ఆర్.విద్యాసాగర్ రావు (నీటి పారుదల), ఏకే గోయల్ (ప్రణాళిక, విద్యుత్), ఏ.రామలక్ష్మణ్ (సంక్షేమం), బీవీ పాపారావు (ఇన్‌స్టిట్యూషనల్ డెవలప్ మెంట్), కేవీ రమణా చారి (మీడియా వ్యవహరాలు), ఎస్.వేణుగోపాల చారి, తేజావత్ రామచంద్రుడు, కేఎం సాహ్ని (ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధులు), పేర్వారం రాములు (తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్) పిడమర్తి రవి (తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్), సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు), ఏర్పుల బాలకిషన్ (తెలంగాణ సాంస్కృతిక‌ సారధి), అల్లం నారాయణ (తెలంగాణ మీడియా అకాడెమీ చైర్మన్) గా నియమించారు. వీరికి మంత్రి హోదా ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, సోమేష్ కుమార్ ఇలా పదవి నుంచి రిటైర్మెంట్ కావడం, ఆ మరుసటి రోజే కేసీఆర్ వారిని సలహాదారులుగా నియమించారు.

ఒక్కో సలహాదారుడిపై ప్రతి నెలా రూ.25 లక్షల ఖర్చు

రిటైర్డ్‌ అఖిల భారత సర్వీసు అధికారులు, రాజకీయ నాయకులను సలహాదారులుగా నియమించడం మూలంగా ప్రతి నెలా ఒక్కొక్కరిపై రూ.25 లక్షల వరకు ప్రభుత్వం వ్యయం చేస్తున్నట్లు ఆర్థిక శాఖ అధికారులు అంటున్నారు. వారికి వేతనాలతో పాటు అలవెన్సులు, వ్యక్తిగత సిబ్బంది, కార్యాలయం నిర్వహణ కోసం రూ.25 లక్షలు వెచ్చించాల్సి వస్తున్నది. అసలే రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో రాజకీయ పునరావాసాల కోసమో, ప్రాపకం కోసమో సలహాదారుల పేరిట ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం మోపడం సరికాదని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి.. 

Telangana High Court | పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై జబర్ధస్త్ తగదు : హైకోర్టు కీలక ఆదేశాలు
Allari Naresh | అల్లరి నరేష్ కుటుంబంలో తీవ్ర విషాదం.. ప్ర‌ముఖుల నివాళులు
Trump Threatens France : ఫ్రాన్స్‌పై ట్రంప్‌ కన్నెర్ర.. 200 శాతం టారిఫ్‌లు విధిస్తానంటూ బెదిరింపులు

Latest News