Unseasonal Rains | అకాల వర్షాలతో అపార నష్టం.. చేతికొచ్చిన పంటలు నాశనం

వరుస వర్షాలతో రైతన్న ఆగమాగం వరంగల్ జిల్లా రైతుల గోస గోస వాన పాలైన వరిపంట నీటమునిగిన కల్లాల్లో ధాన్యం ఈదురు గాలుల బీభత్సం పండ్లతోటల పైన ఆశలు ఔట్ ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: చేతికొచ్చిన పంటలు నోటికి రాకుండా పోతున్నాయి. వరుసగా కురుస్తున్న అకాల వర్షాలు (Unseasonal Rains) ఈదురుగాలు వరంగల్ జిల్లా రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. పంట చేతికి వచ్చే దశలో రైతన్న ఇంట విషాదం నింపుతోంది. దెబ్బ […]

  • Publish Date - May 1, 2023 / 08:00 AM IST

  • వరుస వర్షాలతో రైతన్న ఆగమాగం
  • వరంగల్ జిల్లా రైతుల గోస గోస
  • వాన పాలైన వరిపంట
  • నీటమునిగిన కల్లాల్లో ధాన్యం
  • ఈదురు గాలుల బీభత్సం
  • పండ్లతోటల పైన ఆశలు ఔట్
  • ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: చేతికొచ్చిన పంటలు నోటికి రాకుండా పోతున్నాయి. వరుసగా కురుస్తున్న అకాల వర్షాలు (Unseasonal Rains) ఈదురుగాలు వరంగల్ జిల్లా రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. పంట చేతికి వచ్చే దశలో రైతన్న ఇంట విషాదం నింపుతోంది.

దెబ్బ మీద దెబ్బ, వరుస దెబ్బలతో రైతాంగం అతలాకుతలమైతుంది. చిన్న, సన్నకారు రైతులు గుండె పగిలి గొల్లుమంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రైతులు ఏడాది కాలంలో వరుసగా అకాల వ‌ర్షంతో పంట‌లు న‌ష్టం పోవాల్సి వ‌చ్చింద‌ని క‌న్నీరు మున్నీర‌వుతున్నారు. ధాన్యం, మొక్కజొన్న, పంటలు, మామిడి తోటలు, పండ్లతోటలు, కూరగాయ తోటలు రాళ్లవానకు నేలకొరిగాయ‌ని, చెడగొట్టువాన రైతులను తీవ్రమైన కష్టాల పాలు చేసిందని వాపోయారు.

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోని పరకాల, దామెర, మరిపెడ, తొర్రూరు, మానుకోట, సంగెం, గీసుగొండ, ఆత్మకూరు, ధర్మసాగర్‌ మండలాలలో వర్షప్రభావం తీవ్రంగా ఉంది. ఆదివారం రాత్రి కురిసిన‌ ఈదురు గాలులు, వాన ఈ ప్రాంతంలో బీభ‌త్సం సృష్టించింది.అనేక గ్రామాల్లో చెట్లు నేల‌వాలాయి. వేలాది ఎక‌రాల్లోని వ‌రి, మామిడి పంట‌లు నాశ‌న‌మయ్యాయి.

రైతులు రోడ్ల‌పై ఆర‌బోసిన ధాన్యం వ‌ర‌ద‌కు కొట్టుకుపోయింది. పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కళ్ళల్లో కొనుగోలుకు తెచ్చిన ధాన్యం కొనేవారు లేకపోవడంతో ఆకస్మికంగా వచ్చిన వర్షానికి తడిసి ముద్దయి పోయింది. రేపటి నుంచి ధాన్యం ఆరబెట్టుకునేందుకు రైతులు నానా అగచాట్లు పడాల్సి వస్తోంది.

మంత్రి, అధికారుల హడావుడి

కొనుగోలు కోసం కేంద్రాలు ప్రారంభిస్తున్నమని మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు హడావుడి చేయడం తప్ప ఆశించిన స్థాయిలో కొనుగోలు సాగడం లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా కొనుగోలు కేంద్రాల్లో, మార్కెట్ యార్డులకు తెచ్చిన ధాన్యం తడిసి నాశనం అవుతుంది.

ప్రతిపక్ష పార్టీల నాయకులు జిల్లాలో పర్యటిస్తూ రైతుల గోడును వింటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నప్పటికీ, ఆశించిన స్థాయిలో కొనుగోలు సాగడం లేదు. ఇప్పటికైనా రైతాంగం జీవితంతో ఆడుకోకుండా ధాన్యం సకాలంలో కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

Latest News