విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: నాగార్జున సాగర్ లోని బుద్ధ వనంలో శనివారం దమ్మ దీక్ష దినోత్సవాన్ని బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మహా బోధి సొసైటీ సంఘ పాల బంతి ఆధ్వర్యంలో బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి సమర్పించారు. అనంతరం మహాస్థూపం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అక్టోబర్ 14న 5 లక్షల మందితో డాక్టర్ అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించిన రోజుని బౌద్ధులు దమ్మ దీక్ష దినోత్సవంగా జరుపుకుంటారని తెలిపారు.
ముఖ్యఅతిథిగా హాజరైన నాగపూర్కి చెందిన నాగార్జున ఇన్స్టిట్యూట్ అధ్యక్షులు లోకమిత్ర మాట్లాడుతూ సమాజంలోని రుగ్మతలను రూపుమాపడంలో బుద్ధుని బోధనలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. డాక్టర్ అంబేద్కర్ కూడా బుద్ధుని మార్గాన్ని అనుసరించి ఐదు లక్షల మందితో బౌద్ధాన్ని స్వీకరించి సమాజంలో ఇప్పటికీ కొనసాగుతున్న అసమానతలను తొలగించి సమ సమాజాన్ని స్థాపించడానికి కృషి చేశారన్నారు. తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఆచార్య లింబాద్రి మాట్లాడుతూ బుద్ధుని బోధనలు, అంబేద్కర్ రచనలు యువతరానికి మార్గదర్శకాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బుద్ధ వనం ఓఎస్ డీ సుధాన్ రెడ్డి, బౌద్ధ విషయ నిపుణులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, బుద్ధవనం డిజైన్ ఇన్చార్జ్ శ్యాంసుందర్, శ్రీధర్, నల్గొండకు చెందిన గోన రెడ్డి, బెల్లి యాదయ్య పాల్గొన్నారు.