వరంగల్: నాలుగేళ్ల నర్సంపేట ప్రగతి పై ‘ద‌శాదిశ’ చర్చ

ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నాలుగేళ్ల పాల‌న‌పై స‌మీక్ష‌ సిటిజన్స్ ఫోరం కార్యక్రమం విధాత, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: అది ఉద్యమమైనా… విపక్షమైనా… ఎమ్మెల్యే అయినా… ఆయనది ఓ ప్రత్యేకమైన స్టైల్. అది నిరసనైనా పొగడ్తయినా ఆయనకో శైలి ఉంటుంది. అనుచరులు, పార్టీ కేడరే కాకుండా ప్రత్యర్థులు కూడా ఈ విషయాన్ని చెబుతుంటారు. ఈ విషయాన్ని పెద్ది సుదర్శన్ రెడ్డి పదేపదే నిరూపించుకుంటారు. మొదటిసారి ఓటమి పాలైనా రెండవ దఫా ప్రస్తుతం నర్సంపేట ఎమ్మెల్యేగా […]

  • Publish Date - December 17, 2022 / 06:27 AM IST
  • ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నాలుగేళ్ల పాల‌న‌పై స‌మీక్ష‌
  • సిటిజన్స్ ఫోరం కార్యక్రమం

విధాత, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: అది ఉద్యమమైనా… విపక్షమైనా… ఎమ్మెల్యే అయినా… ఆయనది ఓ ప్రత్యేకమైన స్టైల్. అది నిరసనైనా పొగడ్తయినా ఆయనకో శైలి ఉంటుంది. అనుచరులు, పార్టీ కేడరే కాకుండా ప్రత్యర్థులు కూడా ఈ విషయాన్ని చెబుతుంటారు. ఈ విషయాన్ని పెద్ది సుదర్శన్ రెడ్డి పదేపదే నిరూపించుకుంటారు. మొదటిసారి ఓటమి పాలైనా రెండవ దఫా ప్రస్తుతం నర్సంపేట ఎమ్మెల్యేగా తనదైన ప్రత్యేక శైలిని కొనసాగించడమే కాకుండా అభివృద్ధిపై ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇందులో ఒక్క ములుగు నియోజకవర్గం తప్ప మిగతా అన్ని నియోజకవర్గాల్లో అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ పెద్దగా తమ నాలుగేళ్ల ఎమ్మెల్యే పాలనపై సమీక్షించిన సందర్భాలు కనిపించకపోవడం ఇక్కడ కోస మెరుపు. పెద్ది దశ దిశా పేరుతో చేపట్టిన చర్చ కార్యక్రమం రాజకీయ ప్రత్యర్థుల్లోనే కాకుండా సొంత పార్టీలోనూ చర్చనీయాంశంగా మారింది.

నాలుగేళ్ల‌ అభివృద్ధి పై చర్చ

తొలిసారి నర్సంపేట నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న పెద్ది సుదర్శన్ రెడ్డి మాత్రం తన నాలుగేళ్ల ఎమ్మెల్యే పనితీరు ప్రస్తానాన్ని, నియోజకవర్గంలో చేపట్టిన ప్రగతిని సమీక్షించేందుకు కొత్త పుంతలు తొక్కారు. దీనికి వివిధ వర్గాల నుంచి తన పనితీరు, నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రశ్నించేందుకు అవకాశాన్ని కల్పించడం విశేషం.

అయితే సిటిజన్స్ ఫోరం పేరుతో నిర్వహించిన దశ దిశ చర్చ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఏర్పాటు చేశారని విమర్శలు వ్యక్తమవుతున్నప్పటికీ నాలుగేళ్ల కాలంలో తాను చేపట్టిన అభివృద్ధిని ఈ రూపంలోనైనా ప్రజల ముందు చర్చకు పెట్టడం మంచి సాంప్రదాయమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

అంతా వేడుకల్లో..

తెలంగాణ రాష్ట్ర సమితి భారత్ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించిన అత్యుత్సాహంలో గులాబీ శ్రేణులూ, నాయకులు నిమగ్నమై ఉండగా రెండవ దఫా తమ నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకున్న విషయం దాదాపు మరుగున పడింది. కొత్త పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఢిల్లీ స్థాయి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండగా, ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని, ముఖ్యంగా అధికార పార్టీని ఈ ప్రత్యేక సందర్భాల్లో ప్రశ్నించాల్సి ఉండగా, ఇదేమి పట్టనట్టు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. దీంతో అధికార పార్టీ ఆడింది ఆట పాడింది పాట అనే తీరుగా చలామనైతున్నారనే విమర్శలు వ్యక్తమైతున్నాయి.

దశాదిశ ప్రత్యేక కార్యక్రమం

దశా దిశా కార్యక్రమం పేరుతో నర్సంపేట సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించడం విశేషం. ఈ సమావేశంలో విద్యా, ఉద్యోగ, రాజకీయ సంబంధ, వివిధ వృత్తులు, వ్యాపారంలో ప్రాతినిథ్యం వహించే ప్రతినిధులు స్థానిక సమస్యలపై లేవనెత్తిన ప్రశ్నలకు ఎమ్మెల్యే ఓపికతో వివరించారు.

నర్సంపేట నియోజకవర్గ ప్రగతి పై తనకున్న తక్షణ, దీర్ఘకాలిక లక్ష్యాలను వివరించారు. ఈ సందర్భంగా నాలుగేళ్లలో విద్య, వైద్యం, వ్యవసాయం, రోడ్లు, సంక్షేమం, మంచినీరు, ఇతర ప్రాథమిక వసతుల పై చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రానున్న రోజులలో చేపట్టబోయే ప్రణాళికలను కూడా తెలిపారు. ఈ సందర్భంగా సిటిజన్స్ ఫోరం ప్రతినిధులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పడమే కాకుండా అనేక అనుమానాలను నివృత్తి చేశారు.

ప్రగతి బాటలో నర్సంపేట

ఓపెన్ డయాస్ ద్వారా అడిగిన ప్రతీ ప్రశ్నకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సమాధానం చెబుతూ నర్సంపేట నియోజకవర్గం ప్రగతిపథంలో పయనిస్తుందన్నారు. రూ.5 కోట్ల నిధులతో ఏసీ టౌన్ హల్ నిర్మాణం, నర్సంపేట సిటీలో 12కిలోమీటర్ల మేరకు డివైడర్స్, సెంట్రల్ లైటింగ్ నిర్మాణం, రూ.13 కోట్ల నిధులతో పట్టణంలో రోడ్ల నిర్మాణం, నర్సంపేట పట్టణంలో 1100 మందికి డబల్ బెడ్ రూమ్ ల నిర్మాణం కొరకు సొంత జాగ ఉన్న వారిని గర్తించే చర్యలు చేపట్టామన్నారు.

పట్టణంలో గతంలో కేవలం 8లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంకులే ఉండేవి. వాటిని 36 లక్షల లీటర్ల సామర్థ్యానికి పెంచుతూ నూతన వాటర్ ట్యాంకుల నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. ఇంకా నియోజకవర్గంలో 36 చెక్ డ్యాంలు నిర్మాణం ద్వారా గ్రౌండ్ వాటర్ లెవల్స్ పెరిగాయ‌న్నారు. 14 సర్ప్ లెస్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కొరకు అదనంగా 14 పవర్ సబ్ స్టేషన్ లను నియోజకవర్గ వ్యాప్తంగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

నియోజకవర్గంలో 70 కోట్ల రూపాయలతో అన్ని తండాలకు బి.టి రోడ్ల నిర్మాణం, 200 చెరువులను గోదావరి నీళ్లతో నింపుతున్నామన్నారు. కొత్తగా 7 గురుకుల పాఠశాలలతో పాటు ఒక గిరిజన సైనిక్ స్కూల్ ఏర్పాటు మరియు అప్ గ్రెడేషన్ చేసినట్లు వివ‌రించారు. అలాగే 250 పడకల ఆసుపత్రి, 59 హెల్త్ సబ్ సెంటర్స్, 60 రకాల ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించే డయాలసిస్ సెంటర్ ఏర్పాటుతో హెల్త్ హబ్ గా నర్సంపేట మారిందన్నారు.

మిషన్ భగీరథ, మిషన్ కాకతీయతోపాటు, అధిక సామర్థ్యం గల ధాన్యం నిల్వ కొరకు గోదాముల నిర్మాణం జరుగుతుందన్నారు. పట్టణంలోని ప్రతి ఇంటికీ దశలవారిగా గ్యాస్ పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. పాకాల రంగయ్య చెరువు ప్రాజెక్టు ద్వారా చివరి ఆయకట్టు రైతుకు ఉపయోగపడే విధంగా వ్యవసాయం మరింత వృద్ధిలోకి రానుందని చెప్పారు.

ఓటమి నుంచి గెలుపు దిశగా

తెలంగాణ ఉద్యమకారుడిగా టీఆర్ఎస్ నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగా ప్రాతినిథ్యం వహించిన పెద్ది సుదర్శన్ రెడ్డి ఉద్యమంలోనే కాకుండా ఆ తర్వాత ప్రజాసంబంధాలను కొనసాగించడంలోనూ తన ప్రత్యేకతను కనపరిచారు. అయితే 2014 తొలి ఎన్నికల్లో ఇదే నర్సంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పటికీ ఓటమి చవిచూశారు. ఓటమితో కుంగిపోయిన పెద్దిని గుర్తించి పౌరసరఫరాల రాష్ట్ర చైర్మన్‌గా నియమించి ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవించారు.

ప్రతిపక్ష స్థానంలో ఉన్నా తొలిసారి కూడా నియోజకవర్గానికి పరిమితమై పెద్ది ప్రజలతో నిత్యం సంబంధాలు కొనసాగించారు. 2018 లో జరిగిన ఎన్నికల్లో తిరిగి టికెట్ దక్కించుకోవడమే కాకుండా అదే నర్సంపేట నియోజకవర్గం నుంచి గెలుపు సాధించి తన పట్టును నిలుపుకున్నారు.

గెలిచినప్పటి నుంచి నియోజకవర్గానికి పరిమితమవుతూ గతంలో కొనసాగిన అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగంగా చేపడుతూ నూతన కార్యక్రమాను చేప‌డుతున్నారు. ఉమ్మడి జిల్లాలో తనకున్న పలుకుబడి ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రుల వద్ద ఉన్న పలుకుబడిని వినియోగించుకొని నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

షర్మిల విమర్శల పై నిరసన

ఈ నేపథ్యంలోని వైఎస్సార్‌టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల నర్సంపేట నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ పెద్ది సుదర్శన్ రెడ్డిని అవినీతిపరునిగా విమర్శించడంతో స్థానిక ప్రజల్లో నిరసన వ్యక్తం కావడమే కాకుండా గులాబీ వర్గాలు తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. ఆమె రాష్ట్రమంతా పర్యటిస్తూ ఘాటుగా విమర్శించారు. ఎక్కడ లేని విధంగా ఇక్కడ మాత్రం నిరసన‌ మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఇక్కడ సైతం పెద్ది ప్రత్యేకత వ్యక్తమైందంటున్నారు.

ఈ దశాదిశ కార్యక్రమాన్ని నర్సంపేట సిటిజన్స్ ఫోరం కన్వీనర్ పెండెం భాస్కర్, చీఫ్ అడ్వైజర్ కొడెం శ్రీధర్, మెంబర్స్ డాక్టర్ నవత, అడ్వకేట్ రాము నాయక్, రహీముద్దీన్, డాక్టర్ మోహన్ రావు, మోతే సమ్మిరెడ్డి, ఇంద్రసేనా రెడ్డి తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు.

అనంతరం నాలుగు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని నర్సంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సందర్భంగా ఈ యొక్క దశా-దిశ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు గౌరవ ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు.