Telangana | అడుగంటిన జలాశయాలు

  • Publish Date - April 10, 2024 / 03:45 PM IST

  • డెడ్ స్టోరేజ్‌లో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు

  • నీరు లేక ఒట్టిపోయి కనిపిస్తున్న కృష్ణానది

  • సాగునీరు అందక ఎండుతున్న ఆయకట్టు పంటలు

  • పాలమూరు వరప్రదాయిని జూరాల ప్రాజెక్టు లో అడుగంటిన జలాలు

  • జూరాల పరిధిలో మూత పడిన ఎత్తిపోతల పథకాల ప్రాజెక్టు లు

  • తాగునీటి పథకాలకు అరకొర గా సరఫరా అవుతున్న నీరు

  • కర్ణాటక సర్కార్ దయతలిస్తేనే పాలమూరు జిల్లాకు తాగునీరు

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : నిత్యం నీటితో కళకళ లాడే కృష్ణా బేసిన్ నేడు నీరు లేక ఒట్టిపోయింది.గత వర్షాకాలం లో వర్షాలు సమృద్ధిగా కురవక పోవడమే ప్రస్తుతం కృష్ణా నది కి ఈ పరిస్థితి వచ్చింది. ఈ నది పై ఉన్న ప్రాజెక్టు లన్నీ డెడ్ స్టోరేజ్ లో ఉన్నాయి. సాగునీటి మాట పక్కన బెడితే కనీసం తాగునీరైనా దొరుకుతుందో లేదో అనే విధంగా ప్రస్తుత ప్రాజెక్టులు కనిపిస్తున్నాయి. ఈ కృష్ణా నది పై కర్ణాటక రాష్ట్రంలో అలమట్టి, నారాయణ పూర్ ప్రాజెక్టు లు, తెలంగాణ జూరాల, నాగార్జున సాగర్, ఆంధ్రప్రదేశ్‌లో శ్రీశైలం ప్రాజెక్టు లు సాగు, తాగు నీరు అందిస్తున్నాయి. కానీ ప్రస్తుతం ఈ ప్రాజెక్టుల్లో ఉన్న నీటి పరిస్థితి చూస్తే భయాందోళనకు గురించేస్తున్నాయి.

అలమట్టి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 130 టీఎంసీ లు కాగా ప్రస్తుతం కేవలం 40 టీఎంసీ లు మాత్రమే నిలువ ఉన్నాయని, నారాయణ పూర్ ప్రాజెక్టు మొత్తం నీటి మట్టం 37.50 టీఎంసీ లు కాగా నేడు 21 టీఎంసీలా నీరుంది. అలాగే మహబూబ్ నగర్ జిల్లా కు ముఖ్య నీటి వనరులైన జూరాల ప్రాజెక్టు లో 9.50 టీఎంసీలకు గాను ప్రస్తుతం 3 టీఎంసీల నీరు మాత్రమే నిలువ ఉంది.జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువ కింద లక్షా ఐదు ఎకరాల ఆయకట్టు ప్రాంతం ఉంది. ఈ రబీ సీసన్ లో జూరాల నుంచి పంటలకు సాగునీరు అందదనే ముందుగానే గమనించిన ప్రాజెక్టు అధికారులు పంటలకు క్రాప్ హాలిడే ప్రకటించారు. ఈ ప్రాజెక్టు పైనే ఆధారపడిన నెట్టెం పాడు లిఫ్ట్ కు నీరందక మూతపడింది.

పాలమూరు కు తాగునీరందించే రామన్ పాడు ప్రాజెక్టు కు కూడా జూరాల ప్రాజెక్టు నుంచే నీరు సరఫరా అవుతుంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు లో ఉన్న మూడు టీఎంసీ ల నీరు తాగునీటి అవసరాలకు సరిపోవని సంబంధిత అధికారులు అంటున్నారు.జూరాల ప్రాజెక్టు లో నిలువ ఉన్న నీరు రామన్ పాడు ప్రాజెక్టు కు సరఫరా చేసి అక్కడి నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కు తాగునీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడే జిల్లా లో తాగునీటి కొరత ఏర్పడిందని, ప్రస్తుతం నీటిని విడుదల చేస్తే వచ్చే మూడు నెలలు తాగునీరు అందని పరిస్థితి వస్తుందని ప్రాజెక్టు అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నడూ ఈ పరిస్థితి రాలేదని, ఎండలు మండుతుందడం తో తాగునీటి అవసరం బాగా పెరిగిందని అధికారులు పేర్కొంటున్నారు.

ఇది ఇలా ఉంటే శ్రీశైలం జలశయం నుంచి కొల్లాపూర్ నియోజకవర్గాని తాగునీరు అందుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు కూడా డెడ్ స్టోరేజీ కి వెళ్లడం తో ఈ ప్రాజెక్టు నుంచి తాగునీటి పథకాలకు సరఫరా అయ్యే నీటికి ఇబ్బందులు తప్పేటట్లు లేనట్లు తెలుస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 215 టీఎంసీ లు కాగా ప్రస్తుతం 34 టీఎంసీల నీరు నిలువ ఉంది.మరో అతి పెద్ద ప్రాజెక్టు నాగార్జున సాగర్ లో నీటి మట్టం పూర్తి గా పడిపోయింది. పూర్తి నీటిమట్టం 319 టీఎంసీ లు కాగా ప్రస్తుతం 165 టీఎంసీ లా నీరు నిలువ ఉందని ప్రాజెక్టు అధికారులు అంటున్నారు.

ప్రస్తుతం ప్రాజెక్టు ల్లో ఉన్న నీరు తాగునీటి అవసరాలకు సరిపోవనే సందేహాన్ని నీటి పారుదల అధికారులు ఆందోళన చెందుతున్నారు.కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో నీటి నిలువ ప్రమాదం ఘంటికలు మోగించడం తో కరువు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికీ ప్రాజెక్టు ల్లో నీటి నీ నమ్ముకుని పంటలు వేసుకున్న రైతులకు చివరి దశ లో నీరందక పంటలు ఎండి పోయాయి. మహబూబ్ నగర్ జిల్లా కు ఒకే ఒక సాగు నీటి ప్రాజెక్టు జూరాల కావడంతో, ఈ ప్రాజెక్టు ను నమ్ముకున్న రైతాంగానికి ఈ రబీ సీజన్ లో పంటలు ఎండి పోయి త్రీవ నష్టాన్ని చవిచూశారు.

వర్షాభావ పరిస్థితులు అనుకుంలించని, పంటలు వేసుకోవద్దని రబీ సీజన్ కు ముందు అధికారులు హెచ్చరించినా రైతులు పట్టించుకోలేదు. ప్రాజెక్టు ల్లో నీరు అడగంటడంతో భూగర్భ జాలాలు పూర్తిగా అడు గంటాయి.రైతులు బోరు బావుల ద్వారా పంటలను కాపాడుకోవాలని చూసినా ఫలితం దక్కడం లేదు. జిల్లా లో ఎక్కడ చూసిన భూగర్భ జలాలు అడుగంటడం తో బోరుబావుల్లో కూడా నీరు అడుగంటి పోవడం తో పంటలు ఎండి పోయాయి. సాగునీరు పరిస్థితి ఇలా ఉంటే ఇంకా మూడు నెలలు తాగు నీటి పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

కర్ణాటక దయతలిస్తేనే….

పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రం దయతలిస్తేనే ఉమ్మడి పాలమూరు ప్రజలు గొంతు తడుస్తుంది.జూరాల ప్రాజెక్టు ఎగువన కర్ణాటక రాష్ట్ర పరిధి లో ఉన్న నారాయణ పూర్ ప్రాజెక్టు నుంచి నీటి ని విడుదల చేస్తే జూరాల ప్రాజెక్టు కు నీరు చేరుతుంది. ఇప్పటికీ ఇక్కడి అధికారులు కర్ణాటక సాగునీటి అధికారులతో చర్చలు జరిపారు. నారాయణ పూర్ ప్రాజెక్టు లో ప్రస్తుతం 21 టీఎంసీ ల నీరు ఉండడంతో జూరాల ప్రాజెక్టు కు మూడు టీఎంసీ లా నీటిని విడుదల చేయాలని ఇది వరకే కర్ణాటక సర్కార్ ను ఇక్కడి సాగునీటి పారుదల అధికారులు లేఖ రాసినట్లు తెలిసింది. ఇప్పటి వరకు కర్ణాటక సర్కార్ నీటి విడుదల పై ఏ నిర్ణయం తీసుకోలేదని సమాచారం. నారాయణ పూర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేయకుంటే ఉమ్మడి పాలమూరు వాసులకు తాగునీటికి తంటాలు తప్పు సూచనలు కనిపించడం లేదు.

గోపాల్ దిన్నె జలాశయాన్ని సంద‌ర్శించిన మంత్రి జూపల్లి

కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఉన్న నీటి వ‌న‌రుల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఎక్సైజ్, ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నీటిపారుద‌ల‌ అధికారుల‌ను ఆదేశించారు. మంగళవారం వీప‌న‌గండ్ల మండ‌లం గోపాల్ దిన్నె జ‌లాశ‌యాన్ని జూప‌ల్లి సంద‌ర్శించారు. జ‌లాశయ నీటి వివ‌రాల‌ను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

చుక్క నీరు కూడా వృధా కాకుండా చర్యలు తీసుకోవాలని, వీప‌న‌గండ్ల‌, చిన్నంబావి, పాన్ గ‌ల్ మండ‌లాల్లోని సుమారు 40 గ్రామాల‌ ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు క్షేత్ర‌స్థాయిలో స‌మ‌న్వ‌యంతో ప‌ని చేసి వేస‌విలో తాగునీటి ఎద్ద‌డి త‌లెత్త‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని చెప్పారు.

Latest News