విధాత: కొందరు స్నేహితులు ఎంత ప్రాణాంతకులో ఈ ఘటన తెలియజేస్తున్నది. రూ.2 లక్షల కోసం ఏకంగా దోస్తునే కిడ్నాప్ చేసి చంపేశాడు. ఈ దారుణ ఘటన ఢిల్లీలో వెలుగుచూసింది. తన బైక్ కిస్తీ, కుటుంబ అవసరాలకు రూ.2 లక్షలు అవసరమని భావించిన ఒకడు.. తన స్నేహితుడిని కిడ్నాప్‌చేసి అతని కుటుంబం నుంచి రూ. 2 లక్షలు దోపిడీ చేయాలని ప్లాన్‌చేశాడు.
పోలీసుల వివరాల ప్రకారం.. సచిన్ నితిన్ 2018 నుంచి స్నేహితులు. సచిన్ బైక్ కొన్నాడు. అతడికి రెండు నెలల కుమార్తె ఉన్నది. కుటుంబ అవసరాలు కూడా పెరిగాయి. బైక్ కిస్తీ, ఇంటి అవసరాలు తీర్చడం సచిన్‌కు కష్టంగా మారింది. నితిన్ కుటుంబానికి ఈశాన్య ఢిల్లీలో సొంత ఇల్లు ఉన్నది. అతడిని కిడ్నాప్ చేస్తే కుటుంబసభ్యులు సులభంగా రూ. 2 లక్షలు చెల్లిస్తారని సచిన్ భావించాడు.
కాగా.. 15 రోజుల క్రితం సచిన్ తన ప్లాన్ గురించి మరో స్నేహితుడు అరుణ్‌తో చర్చించాడు. ఈ నెల 19న సచిన్ నితిన్‌ను పార్టీ ఇస్తానని ఇంటికి ఆహ్వానించాడు. అరుణ్ అప్పటికే అక్కడ ఉన్నాడు. అనంతరం మద్యం కొనేందుకు ఘజియాబాద్‌కు వెళ్లి రైలు పట్టాల దగ్గర ముగ్గురూ మద్యం సేవించారు. ఢిల్లీకి తిరిగి వస్తుండగా అరుణ్, సచిన్‌లు నితిన్‌ను కత్తితో పొడిచి హత్య చేసి మృతదేహాన్నిపొదల్లో పడేశారు.
ఈ నెల 20 (మరుసటి రోజు)న నితిన్ సోదరికి సచిన్ ఫోన్ చేసి మీ అన్నను కిడ్నాప్ చేశామని, రూ. 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ విషయమై నితిన్ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులకు విషయం తెలిసిందని గ్రహించిన సచిన్, అరుణ్ ఢిల్లీ వదిలి పారిపోయారు.
ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసిన పోలీసులు.. రాజస్థాన్‌లోని గంగా నగర్‌లో సచిన్‌ను తాజాగా అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అరుణ్‌ను పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేశారు. నితిన్ మృతదేహాన్ని ఘజియాబాద్ పొదల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.