Site icon vidhaatha

Delta Airlines | బ్రా ధరించనందుకు ప్రయాణికురాలికి అవమానం.. డెల్టా ఎయిర్‌లైన్స్‌ విమానంలో ఘటన..!

Delta Airlines : డెల్టా ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ మహిళా ప్రయాణికురాలికి అవమానం జరిగింది. బ్రా ధరించలేదన్న కారణంతో ప్రయాణికురాలిపట్ల డెల్టా ఎయిర్‌లైన్స్ సిబ్బంది అమర్యాదగా నడుచుకున్నారు. ఆమెను విమానం నుంచి కిందకు దించేశారు. పక్కకు తీసుకెళ్లి టీషర్ట్‌పై బలవంతంగా జాకెట్‌ ధరింప జేశారు. విమానం సాల్ట్ లేక్ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ అవమానకర ఘటనపై సదరు మహిళా ప్రయాణికురాలు ఆగ్రహం వ్యక్తంచేశారు.


ఈ ఏడాది జనవరిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది జనవరిలో లీసా ఆర్క్‌బోల్డ్‌ అనే 38 ఏళ్ల మహిళ బ్యాగీ జీన్స్, వదులుగా ఉన్న వైట్‌ టీషర్ట్‌ ధరించి సాల్ట్ లేక్ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్తున్న డెల్టా ఎయిర్‌లైన్స్‌ విమానం ఎక్కారు. అయితే బ్రా ధరించని కారణంగా ఆమెను విమానం నుంచి కిందకు దించి పక్కకు తీసుకెళ్లారు. టీషర్ట్‌పై బలవంతంగా జాకెట్ వేయించారు. ఈ ఘటన తనకు చాలా అవమానకరంగా అనిపించిందని ఆర్క్‌బోల్డ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.


డెల్టా ఎయిర్‌లైన్స్ సిబ్బంది తనపట్ల వివక్ష పూరితంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడీ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. టీషర్ట్‌ నుంచి తన శరీరం బయటికి కనిపించకపోయినా ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది అతి చేశారని విమర్శించారు. తాజాగా లాస్‌ ఏంజెలెస్‌లో బాధితురాలు ఈ వివరాలను వెల్లడించారు. వృత్తిరీత్యా డీజే అయిన ఆర్క్‌బోల్డ్‌.. సాటి మహిళను అని కూడా చూడకుండా తనను డెల్టా ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది అవమానించారని తెలిపారు. టీ షర్ట్‌పై జాకెట్ ధరిస్తేనే ప్రయాణానికి అనుమతించారని తెలిపారు.


కాగా, ఈ వివక్షాపూరిత ఘటనపై మాట్లాడేందుకు కంపెనీ ప్రెసిడెంట్‌తో సమావేశం ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూ ఆర్క్‌ బోల్డ్ తరపున డెల్టా ఎయిర్‌లైన్స్‌కు లేఖ రాసినట్టు ఆమె తరఫు న్యాయవాది గ్లోరియా ఆల్ఫ్రెడ్ చెప్పారు. పురుషులు టీ షర్టులపై జాకెట్‌ ధరించనప్పుడు, మహిళలు ఎందుకు ధరించాలని ఆల్ఫ్రెడ్ ప్రశ్నించారు. భద్రతాపరమైన ముప్పు ఉంటే తప్ప ప్రయాణికులను విమానం నుంచి దించకూడదని అమెరికా చట్టాలు చెబుతున్నాయని, మహిళ రొమ్ములు యుద్ధంలో ఉపయోగించే ఆయుధాలు కావని, వాటిని కలిగి ఉండడం మహిళల తప్పకాదని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ ఘటనపై విమర్శలు తీవ్రం కావడంతో డెల్టా ఎయిర్‌లైన్స్‌ క్షమాపణలు ఆర్క్‌బోల్డ్‌కు క్షమాపణలు చెప్పింది. 

Exit mobile version