Deve Gowda | బీజేపీతో పొత్తు ఉండదు: మాజీ ప్రధాని దేవెగౌడ

Deve Gowda | లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్రంగానే పోటీ జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ బెంగళూరు: 2024 సార్వత్రిక ఎన్నికల్లో జేడీఎస్‌ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత, మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవెగౌడ స్పష్టం చేశారు. తాము బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మంగళవారం బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘జేడీఎస్‌ ఎన్నటికీ మునిగిపోదు. పార్లమెంటు ఎన్నికలను మేం స్వతంత్రంగా ఎదుర్కొంటాం. ఏ పార్టీ […]

  • Publish Date - July 25, 2023 / 01:31 PM IST

Deve Gowda |

  • లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్రంగానే పోటీ
  • జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ

బెంగళూరు: 2024 సార్వత్రిక ఎన్నికల్లో జేడీఎస్‌ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత, మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవెగౌడ స్పష్టం చేశారు. తాము బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

మంగళవారం బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘జేడీఎస్‌ ఎన్నటికీ మునిగిపోదు. పార్లమెంటు ఎన్నికలను మేం స్వతంత్రంగా ఎదుర్కొంటాం. ఏ పార్టీ నుంచి ఎలాంటి సహాయమూ తీసుకోం. ఈ విషయంలో నేను చాలా స్పష్టంగా ఉన్నాను. ఎవ్వరితోనూ జట్టుకట్టే ప్రసక్తే లేదు. ఎన్నికల యుద్ధంలో మేం మా శక్తితోనే పాల్గొంటాం’ అని చెప్పారు.

కుమారస్వామి ప్రకటనతో అనుమానాలు

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము బీజేపీతో కలిసి పనిచేస్తామని దేవెగౌడ కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి గతవారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో జేడీఎస్.. ఎన్డీయేలో భాగస్వామి అవుతుందని ఊహాగానాలు మొదలయ్యాయి.

ఇదిలా ఉంటే.. సోమవారం మీడియాతో మాట్లాడిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌.. బీజేపీ, జేడీఎస్‌ కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలని ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ‘బీజేపీ, జేడీఎస్‌ నాయకులు ఒక ఒప్పందానికి వచ్చే పనిలో ఉన్నారు.

బెంగళూరులోనో, ఢిల్లీలోనో వారు సమావేశంకావటం లేదు.. సింగపూర్‌కు టికెట్లు బుక్‌ చేసుకున్నారు. మా శత్రువులు మిత్రులయ్యారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్రలో భాగంగా ఎవరెవరు సింగపూర్‌ వెళ్లారో పూర్తి వివరాలు నా వద్ద ఉన్నాయి’ అని ఆయన చెప్పారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైతో సమావేశం అనంతరం మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సింగపూర్‌ బయల్దేరి వెళ్లారు. ఆయన ఎందుకు వెళ్లారన్న విషయంలో పార్టీ వర్గాల నుంచి స్పష్టత లేదు.

Latest News