Site icon vidhaatha

Dharmapuri | ధర్మపురి వెళుతుండగా.. అడ్లూరి లక్ష్మణ్ గృహనిర్బంధం

విధాత బ్యూరో, కరీంనగర్: తలాపునే గోదారి.. అయినా నిత్యం నీటికి కటకటే.. వారంలో నాలుగు రోజులు మిషన్ భగీరథ నీరు నిలిచిపోతుండడంతో, ధర్మపురి (Dharmapuri.) నియోజకవర్గ కేంద్ర ప్రజలు తాగునీటికి పరితపించిపోతున్నారు.

ధర్మపురిలో గత కొద్ది కాలంగా మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా సరిగా లేక వారానికి మూడు నాలుగు రోజులు నీటి సరఫరా లేకపోవడంతో తాగునీటికి పరితపించిపోతున్నారు. ప్రజల తాగునీటి కష్టాలకు నిరసనగా జగిత్యాల డిసిసి అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో ధర్మపురిలో నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కరీంనగర్ లోని తన నివాసం నుంచి బయలుదేరుతున్న లక్ష్మణ్ కుమార్ ను ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో డాన్సులు కాదు.. ముందు ప్రజల తాగునీటి సమస్య పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ నేతలకు ఎలాగూ ప్రజల గోస పట్టదని, ప్రజల ఆందోళనలో పాలుపంచుకోవాలని చూస్తున్న తమను పోలీసుల సహకారంతో నిలువరిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగం పౌరులకు కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛను ఈ ప్రభుత్వం హరించి వేస్తున్నదని ఆయన విమర్శించారు. వీటన్నిటికీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.

Exit mobile version