Site icon vidhaatha

Dhruv Agarwala | రెండేళ్లలో ఏకంగా 71 కిలోల వెయిట్‌ లాస్‌.. అద్భుతం చేసిన రియా ఇండియా సీఈవో..!

Dhruv Agarwala : సమాజంలో చాలా మంది స్థూలకాయంతో ఇబ్బంది పడుతుంటారు. బరువు తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు విపరీతంగా వ్యాయామాలు చేసి బరువు తగ్గించుకోవాలని చూస్తుంటే.. మరికొందరు తిండి మానేసి మరీ సన్నబడే ప్రయత్నం చేస్తుంటారు. కానీ వారిలో చాలా మంది కొన్నాళ్ల తర్వాత ప్రయత్నం బోరుకొట్టి వదిలేస్తుంటారు. అలాంటి వారికి ప్రముఖ స్థిరాస్తి సంస్థ అయిన హౌసింగ్‌.కామ్‌ ( Housing.com) సీఈఓ ధ్రువ్‌ అగర్వాల స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఎందుకంటే రెండేళ్ల క్రితం వరకు భారీకాయంతో ఉన్న ఆయన.. ఇప్పుడు సన్నబడ్డారు. ఈ రెండేళ్లలో ఏకంగా 71 కిలోల బరువు తగ్గారు.


వివరాల్లోకి వెళ్తే.. వ్యాపారరీత్యా సింగపూర్‌లో నివాసముంటున్న ధ్రువ్‌ అగర్వాల 2021లో ఓ పనిమీద భారత్‌కు వచ్చారు. ఆ సమయంలోనే ఆయనకు ఛాతీలో నొప్పిగా అనిపించింది. గుండెపోటు అనుకొని వెంటనే ఆసుపత్రికి వెళ్లారు. ఇక చనిపోతాననే అనుకున్నారట. కానీ అసిడిటీ వల్ల వచ్చిన నొప్పి అని నిర్ధారణ అయ్యాక ఊపిరి పీల్చుకున్నారట. ఆ సంఘటనే తనను మేల్కొల్పిందని ఇటీవల ‘సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. ఆరోగ్యాన్ని నియంత్రణలో ఉంచుకోవడం ఎంత ముఖ్యమో అప్పుడే తెలిసొచ్చిందని తన వెయిట్‌ లాస్‌ జర్నీ గురించి వివరించారు.


కోల్‌కతాలో పుట్టి పెరిగిన ధ్రువ్‌ ఆటల్లో చురుగ్గా ఉండేవారు. కెరీర్‌లో స్థిరపడే క్రమంలో అనారోగ్యకర అలవాట్లతో బరువు పెరిగారు. వారంలో మూడు ‘స్ట్రెంత్‌ ట్రెయినింగ్‌’ సెషన్‌లతో బరువు తగ్గే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. కొంత కాలం తర్వాత వాకింగ్‌, హైకింగ్‌ ప్రారంభించారు. టెన్నిస్‌ స్టార్‌ రోజర్‌ ఫెదరర్‌ ఫిట్‌నెస్‌ను స్ఫూర్తిగా తీసుకొని కృషి చేసినట్లు ధ్రువ్‌ వెల్లడించారు. బరువు తగ్గే క్రమంలో అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. మోటివేషన్‌ కోల్పోయారు. కానీ, బరువు తగ్గడంవల్ల ఉండే ప్రయోజనాలను తలచుకొని తిరిగి రీఛార్జ్‌ అయ్యేవారు. సవాల్‌గా స్వీకరించి ఆహార నియమాల్లో మార్పులు చేసుకున్నారు. ముందు పరిమాణాన్ని తగ్గించారు. తర్వాత క్రమంగా పౌష్టికాహారంపై దృష్టి సారించారు. రోజుకు 1,700 కెలోరీలకే పరిమితమయ్యారు.


ప్రాసెస్డ్‌ ఫుడ్‌, వేపుళ్ల స్థానంలో అధిక ప్రోటీన్‌ ఉండే ఆహారం, చిరుతిళ్లను స్వీకరించారు. కార్బోహైడ్రేట్లను తగ్గించారు. దాదాపు 18 నెలల పాటు ఆల్కహాల్‌ను పూర్తిగా దూరం పెట్టారు. వ్యాయామం, ఆహార నియమాలతోపాటు ధ్రువ్‌ ఉక్కు సంకల్పం కూడా జతవ్వటంతో ఫలితాలొచ్చాయి. ఆ స్ఫూర్తితో మరింత ఫిట్‌నెస్‌ కోసం రన్నింగ్‌, స్విమ్మింగ్‌ మొదలుపెట్టారు. తన సతీమణి ఉపాసన సహకారంతో ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటూ అనుకున్న ఫలితాన్ని సాధించానని ధ్రువ్‌ తెలిపారు. దాంతో 2021 లో 151.7 కిలోలున్న ధ్రువ్‌.. 2023 ఫిబ్రవరి నాటికి 80.6 కిలోలకు తగ్గారు. అధిక బరువుతో ఉన్నప్పుడు తనలో ప్రీడయాబెటిక్‌ లక్షణాలు ఉండేవని ధ్రువ్‌ తెలిపారు. అధిక కొలెస్ట్రాల్‌, బీపీవల్ల దాదాపు నాలుగేళ్లపాటు ఔషధాలు వాడినట్లు ఆయన చెప్పారు. పైగా ‘స్లీప్‌ ఆప్నియా’తోనూ బాధపడినట్లు వెల్లడించారు. కానీ, ఇప్పుడు ఆ సమస్యలేవీ లేవని ధీమాగా చెప్పారు.


ఎవరీ ధ్రువ్‌ అగర్వాల..?


హౌసింగ్‌.కామ్‌, మకాన్‌.కామ్‌, ప్రాప్‌టైగర్‌.కామ్‌ లాంటి డిజిటల్‌ స్థిరాస్తి వేదికలను నిర్వహిస్తున్న రియా ఇండియాకు సీఈవో ధ్రువ్‌ అగర్వాల. ఇల్లు కొనేవారికి భారత్‌లో ఈ సంస్థ సమగ్ర సేవలను అందిస్తున్నది. టెక్‌ ఆధారిత స్థిరాస్తి వ్యాపారాల్లో తనదైన ముద్రవేసిన ధ్రువ్‌.. విద్య, మైనింగ్‌, ఫిన్‌టెక్‌ రంగంలోనూ పలు సంస్థలను ప్రారంభించారు. దేశంలో ఇళ్లు కొనే ప్రక్రియను సులభతరం చేసే లక్ష్యంతో 2011లో ప్రాప్‌టైగర్‌.కామ్‌ను స్థాపించారు. అనంతరం హౌసింగ్‌.కామ్‌, మకాన్‌.కామ్‌ను సొంతం చేసుకున్నారు. అంతకుముందు జనరల్‌ ఎలక్ట్రిక్‌ ఇన్‌ఫ్రా బిజినెస్‌ ఇండియా సీఈఓగా ధ్రువ్‌ పనిచేశారు. ‘ఐట్రస్ట్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌’తో తన సొంత వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించారు. తర్వాత దాన్ని కార్వీ కొనుగోలు చేసింది. నార్త్‌వెస్టర్న్‌ యూనివర్సిటీ నుంచి మెటీరియల్‌ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్న ధ్రువ్‌.. స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ పూర్తిచేశారు. హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ నుంచి ఎంబీఏ పట్టా తీసుకున్నారు.

Exit mobile version