Site icon vidhaatha

Tea, Cofee: రోజులో.. ఎన్ని టీ, కాఫీలు తాగ‌వ‌చ్చో తెలుసా?

తలనొప్పి ఎప్పుడైనా రావచ్చు. కొన్నిసార్లు అకస్మాత్తుగా వచ్చే తీవ్రమైన తలనొప్పి భరించడం కష్టంగా మారుతుంది. ఇలాంటి సమయంలో కొందరు మందులు వేసుకుంటే, మరికొందరు ఒక కప్పు టీ లేదా కాఫీతో ఈ అసౌకర్యాన్ని తగ్గించుకోవాలని చూస్తారు. అయితే, ఈ అలవాటు నిజంగా తలనొప్పిని తగ్గిస్తుందా? ఈ నమ్మకంలో ఎంత నిజం ఉంది? టీ లేదా కాఫీ మొదటి సిప్ తాగినప్పుడు రిలాక్స్ అనిపిస్తుందా? వైద్య నిపుణులు ఈ విషయంలో ఏమి చెబుతున్నారో తెలుసుకుందాం.

టీ లేదా కాఫీ తలనొప్పిని తగ్గిస్తాయా?

తలనొప్పి వచ్చినప్పుడు టీ లేదా కాఫీ తాగితే అందులోని కెఫిన్ రక్త నాళాలను సంకోచింపజేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల తాత్కాలికంగా నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే, దీర్ఘకాలంగా ఈ అలవాటు కొనసాగిస్తే తలనొప్పి మరింత తీవ్రమవుతుందని వారు హెచ్చరిస్తున్నారు. కెఫిన్ తక్షణ ఉపశమనం ఇచ్చినా, అది శరీరంపై ప్రతికూల ప్రభావాలను కూడా చూపిస్తుంది.

కెఫిన్ వల్ల డీహైడ్రేషన్ ప్రమాదం

తలనొప్పి తరచూ డీహైడ్రేషన్ వల్ల వస్తుంది. ఒత్తిడి, ఆందోళన, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా దీనికి కారణమవుతాయి. టీ లేదా కాఫీ తాగడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి, పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. కెఫిన్ డీహైడ్రేషన్‌ను ప్రేరేపిస్తుంది. మీకు తాత్కాలికంగా శక్తి, ఉపశమనం అనిపించినా, తలనొప్పి మళ్లీ మళ్లీ రావడం ప్రారంభమవుతుంది.

తలనొప్పి తగ్గించే చిట్కాలు

తలనొప్పిని నివారించేందుకు టీ లేదా కాఫీని ఆశ్రయించే బదులు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంపై దృష్టి పెట్టండి. నీరు పుష్కలంగా తాగడం లేదా హైడ్రేషన్‌ను పెంచే ఆహారాలను తీసుకోవడం మేలు చేస్తుంది. టీ, కాఫీలకు ప్రత్యామ్నాయంగా అల్లం టీ, గ్రీన్ టీ, లేదా తాజా జ్యూస్‌లను ఎంచుకోండి. అలాగే, ఒక చిన్న డార్క్ చాక్లెట్ ముక్క తినడం కూడా తలనొప్పి లక్షణాల నుంచి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. నొప్పి తీవ్రంగా అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

రోజుకు ఎంత టీ లేదా కాఫీ తాగొచ్చు?

నిపుణులు చెప్పిన వివరాల ప్రకారం.. పెద్దలు రోజుకు 400 మిల్లీగ్రాముల కెఫిన్ (సుమారు 4 కప్పుల కాఫీ లేదా 8 కప్పుల టీ) తాగడం సురక్షితం. అయితే, తరచూ తలనొప్పి ఎదుర్కొంటూ, దాని నుంచి ఉపశమనం కోసం టీ లేదా కాఫీ వైపు మొగ్గు చూపుతున్నట్లైతే కెఫిన్ మోతాదును తగ్గించడం ఉత్తమం. కెఫిన్ తాత్కాలిక ఉపశమనం ఇచ్చినా, దానిపై ఎక్కువగా ఆధారపడటం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. తలనొప్పిని సమర్థవంతంగా నియంత్రించడానికి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే ఎల్లప్పుడూ శ్రేయస్కరం.

Exit mobile version