రాముడి పేరిట బీజేపీ రాజకీయం: దిగ్విజయ్ సింగ్

రాముడు అందరివాడని, అందరికీ ప్రియమైనవాడని, అందులో రాజకీయాలేమీ లేవని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు.

  • Publish Date - November 26, 2023 / 12:46 PM IST
  • విభజన రాజకీయాలకు మేం వ్యతిరేకం
  • కల్వకుంట్ల కుటుంబ అవినీతి..
  • తీవ్ర వ్యతిరేకతతో ఉన్న ప్రజలు
  • హైదరాబాద్‌ అభివృద్ధి వెనుక దివంగత వైఎస్‌ విజన్‌
  • ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్


విధాత, హైదరాబాద్‌ : రాముడు అందరివాడని, అందరికీ ప్రియమైనవాడని, అందులో రాజకీయాలేమీ లేవని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు, బీజేపీ ధ‌ర్మం పేరిట దేవుడిని రాజకీయాలకు వాడుకుంటున్నదని ఆరోపించారు. ఆదివారం గాంధీభవన్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ విభజన రాజకీయాలకు పూర్తిగా వ్యతిరేకమ‌ని తెలిపారు. భారత రాజ్యాంగంలో అన్ని వర్గాలకూ సమ న్యాయం జరిగేలా, వారి బతుకులు బాగుపడేలా అంబేద్కర్ హక్కులు కల్పిస్తే… ఇప్పుడు ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని బీజేపీ బలహీనపరుస్తున్నదని ఆరోపించారు.


హైదరాబాద్‌ అభివృద్ధి వెనుక వైఎస్‌ విజన్‌


దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విజ‌న్ వ‌ల్ల హైద‌రాబాద్ గ్లోబ‌ల్ ఐటీ హ‌బ్‌గా అభివృద్ధి చెందింద‌ని దిగ్విజ‌య్ సింగ్ అన్నారు. ఓఆర్‌ఆర్ ఆయన హయాంలోనే వచ్చిందన్నారు. తెలంగాణ‌లో 3 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు ఐటీ సెక్టార్ నుంచే వస్తున్నాయని తెలిపారు.


తెలంగాణ బాగు కోసమే రాష్ట్రం ఇచ్చిన సోనియా


తెలంగాణ బాగు కోసమే సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని దిగ్విజ‌య్‌సింగ్ తెలిపారు. ఇంకా విభజన హామీల్లో భాగంగా ఇచ్చిన ప్రాజెక్టులను తెలంగాణలో అమలు చేయాల్సి ఉందని, వాటిని అధికారంలోకే వస్తే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని వర్గాల బాగు కోసమే సోనియా గాంధీ ఆరు గ్యారెంటీలను ప్రకటించారని తెలిపారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు.


కల్వకుంట్ల అవినీతి పెరిగింది


రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోయిందని, కల్వకుంట్ల కుటుంబ అవినీతిపై ప్రజలు విసిగిపోయారని దిగ్విజయ్‌సింగ్‌ చెప్పారు. మధ్యప్రదేశ్‌లో తాము అధికారంలో ఉన్నప్పుడు అన్ని హామీలనూ అమలు చేశామ‌ని తెలిపారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటకల్లో ఇచ్చిన గ్యారెంటీలు, హామీలను అమలు చేశామ‌న్నారు.