విధాత: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తరువాత పలువురు సినీ ప్రముఖులు ఆయనకు మద్దతుగా వ్యాఖ్యలు చేయగా ఇప్పుడు ఆ లిస్ట్ లో నటుడు చలపతిరావు కొడుకు, దర్శకుడు రవిబాబు వచ్చి చేరారు. గతంలో అశ్వనీదత్, రాఘవేంద్రరావు వంటివారు బాబు అరెస్టుకు వ్యతిరేకంగా గళం విప్పారు. ఇక పెద్ద హీరోలు ఎవరూ స్పందించలేదు. ఈ తరుణంలో రవిబాబు ఒక వీడియో పోస్ట్ చేశారు.
ఈ వీడియోలో రవిబాబు మాట్లాడుతూ… “జీవితంలో ఏదీ శాస్వతం కాదండీ.. సినిమా వాళ్ల గ్లామర్ కానీ, రాజకీయ నాయకుడి పవర్ కానీ ఏదీ శాస్వతం కాదు.. అలాగే చంద్రబాబుకి వచ్చిన కష్టాలు కూడా శాస్వతం కాదు అంటూనే ఎన్టీయార్. రామారావు, చంద్రబాబు కుటుంబాలు తమకు సన్నిహితులు,, ఆప్తులు అన్నారు. ఇంకా.. చంద్రబాబు ఒకపనిచేసే ముందు, ఒక నిర్ణయం తీసుకునేముందు వంద కోణాల్లో ఆలోచిస్తారని, అందరినీ సంప్రదించి, ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా నిర్ణయం తీసుకుంటారని కితాబిచ్చారు.
చంద్రబాబుకి భూమిమీద ఇవాళే ఆఖరి రోజు అని తెలిసినా కూడా తరువాతి 50 సంవత్సరాల గురించి ప్రణాళికలు రచిస్తారని, ఆయన అవినీతిపరుడు కాదని అన్నారు. అలాంటి మనిషిని సరైన ఆధారం లేకుండా జైల్లో పెట్టి ఎందుకు వేధిస్తున్నారో తనకు అర్ధం కావడం లేదనీ, రాజకీయాల్లో ఎత్తులు పైఎత్తులూ అత్యంత సహజం అని చెప్పిన రవిబాబు.. 73ఏళ్ల వయసున్న వ్యక్తిని జైల్లో పెట్టి హింసించడం అది ఏ ఎత్తో పైఎత్తో అయితే మాత్రం అది చాలా దారుణం అని అన్నారు.
ఇంకా.. “అశాశ్వతమైన పవర్ ఉన్నవాళ్లకి హంబుల్ రిక్వస్ట్.. ఏ పవర్ వాడి చంద్రబాబుని జైల్లో పెట్టారో, దయచేసి అదే పవర్ ని ఉపయోగించి ఆయన్ని వదిలేయండి. మీరు చిటికెస్తే అది జరిగిపోతుందని అందరికీ తెలుసు అని, ఆయన్ను బయట ఉంచి ఇష్టమొచ్చినట్లు విచారణ చేసుకోండి. చంద్రబాబు అయితే దేశాన్ని వదిలి కచ్చితంగా పారిపోరు. ఈ దేశం మిమ్మల్ని ఎలా గుర్తుంచుకోవాలనుకుంటున్నారు” కక్షతో రగిలిపోయే కసాయివాళ్ల లాగానా.. లేక, జాలి మనసు ఉన్న మంచి నాయకుడిలాగానా?”.. దయచేసి చంద్రబాబు నాయుడిని వదిలిపెట్టాలని, అందుకు తనతోపాటు చాలామంది కృతజ్ఞతగా ఉంటారని అన్నారు.