పోడు భూములపై జ‌డ్పీ సర్వసభ్య సమావేశంలో చర్చ

హాజరుకాని జిల్లా అటవీ శాఖాధికారి ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆగ్రహం పాఠశాలలలో సౌచాలయాల నిర్మాణానికి జ‌డ్పీ నిధులు: చైర్మన్ విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని ఎస్ ఈకి ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఆదేశాలు విధాత, మెదక్ ఉమ్మడి జిల్లా బ్యూరో: జిల్లాలో పోడు భూములకు సంబంధించి సర్వేలు చాలా చోట్ల పెండింగులో ఉన్నాయని, రెవిన్యూ, అటవీ శాఖల మధ్య వివాదంలో ఉన్న భూములను పరిష్కరించాలని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆయా శాఖాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో […]

  • Publish Date - December 17, 2022 / 01:50 AM IST
  • హాజరుకాని జిల్లా అటవీ శాఖాధికారి
  • ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆగ్రహం
  • పాఠశాలలలో సౌచాలయాల నిర్మాణానికి జ‌డ్పీ నిధులు: చైర్మన్
  • విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని ఎస్ ఈకి ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఆదేశాలు

విధాత, మెదక్ ఉమ్మడి జిల్లా బ్యూరో: జిల్లాలో పోడు భూములకు సంబంధించి సర్వేలు చాలా చోట్ల పెండింగులో ఉన్నాయని, రెవిన్యూ, అటవీ శాఖల మధ్య వివాదంలో ఉన్న భూములను పరిష్కరించాలని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆయా శాఖాధికారులను ఆదేశించారు.

కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో జిల్లా పరిషత్‌ చైర్ పర్సన్ హేమలతా శేఖర్ గౌడ్ అధ్యక్షతన శనివారం జరిగిన జిల్లా పరిషత్ సాధారణ సర్వ సభ్య సమావేశంలో వైద్య ఆరోగ్యం, మన ఊరు మనబడి, ఆసరా ఫించన్లు, విద్యుత్, రహదారులు భవనాలు, మిషన్ భగీరథ శాఖల ప్రగతిని సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లాపరిషత్ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్ మాట్లాడుతూ మన ఊరు-మనబడి కార్యక్రమం లో భాగంగా జిల్లాలోని ఆయాపాఠశాలలకు సౌచాలయాల నిర్మాణానికి జిల్లా పరిషత్ నుండి నిధులు ఇస్తామని ఆయా పాఠశాలల‌కు సంబంధించి ప్రతిపాదనలు పంపాలని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ ను కోరారు.

ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సభలో మాట్లాడుతూ తోక పాసు పుస్తకాలు ఉండి గత, 60, 70 సంవత్సరాల నుండి కాస్తులో ఉన్నప్పటికీ అటవీ శాఖా వారు తాము ఏర్పాటు చేసిన ట్రెంచ్ ను దాటి కాస్తులో ఉన్న భూమి అటవీ పరిధిలో కలుపుకుంటున్నారని, తద్వారా చాలా మంది రైతులు నష్టపోయే అవకాశముందని అన్నారు.

పోడు భూములకు సంబంధించి 62 గ్రామ పంచాయతీలే గాక చాలా అభ్యంతరాలు వచ్చాయని వాటిని పరిశీలించాలని అటవీ శాఖాధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా అటవీ శాఖ అధికారి సభకు హాజరు కాక పోవడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎఫ్ ఓ హాజరు కాకుండా ఎఫ్ అర్ ఓ సభకు రావడంపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు.

జిల్లాలో పంచాయతి రాజ్ రహదారుల బిటి రెన్యూవల్, వరదలతో దెబ్బ‌తిన్న రహ‌దారులు, కల్వర్టులు, బ్రిడ్జిల మరమ్మత్తులు, గిరిజన తండాలలో రోడ్లకు, ఆర్ అండ్ బి రోడ్లకు భారీగా నిధులు మంజూరు చేయడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ఇస్తున్న బల్క్ వాటర్ ను పెంచాలని అధికారులకు సూచించారు.

రూర్బన్ పథ‌కం క్రింద పాపన్నపేట మండలంలో చేపట్టిన పనులకు సంబంధించి వెంటనే డబ్బులు చెల్లించాలని అన్నారు. సదరం క్యాంపులో వికలాంగత్వం ఉన్నా ఫించను రావడం లేదని, కార్డు వచ్చి పింఛను రాని వారి జాబితా, కొత్త పింఛన్‌ల కోసం వచ్చిన దరఖాస్తుల జాబితా అందజేస్తే మంత్రి దృష్టికి తీసుకెళ్తానని డీఆర్డీఒకు సూచించారు.

విద్యుత్ శాఖను సమీక్షిస్తూ జిల్లాలో 33/11 కె.వి. విద్యుత్ ఉప కేంద్రాలు ఆరు నెలకొల్పామని, 6,526 వ్వాసాయ బావులకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని, మిగిలిన 1,149 కనెక్షన్లు త్వరలో ఇవ్వనున్నామని అన్నారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ క్రింద 9 పవర్ ట్రాన్స్ఫార్మర్లు, 309 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామని, ఇంకా అవసరమైతే వివరాలు అందజేస్తే మంజూరు చేయిస్తానని విద్యుత్ ఎస్ ఈ కి సూచించారు.

నరసాపూర్ నియోజక వర్గంలో దళితబందు పధకం క్రింద రెండు కోళ్లఫారం యూనిట్లకు విద్యుత్ సౌకర్యానికి లక్ష 93 వేల చొప్పున లబ్ధిదారులు డబ్బులు కట్టాల్సి ఉందని, కాగా ప్రత్యేక కేసుగా పరిగణించి మినహాయింపుకు అవకాశాలు చూడాల్సినదిగా నరసాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఎస్ ఈని కోరారు. మన ఊరు మనబడి క్రింద మొదటి దశలో 313 పాఠశాలలో చేపట్టిన పనులకు సంబంధించి ఏం.బి. రికార్డు అయిన వెంటనే డబ్బులు చెల్లిస్తున్నామని, నిధులకు కొరతలేదని స్పష్టం చేసాడు.

కొన్ని పాఠశాలలో అదనపు తరగతుల ఆవశ్యకత ఉండగా డైనింగ్ హాల్ కు మంజూరు వచ్చాయని, ఆ పాఠశాలలో ప్రాధాన్యతను బట్టి పనులు చేపట్టాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖను సమీక్షిస్తూ జిల్లాకు 57 పల్లె దవాఖానాలు, ఒక బస్తీ దవాఖాన మంజూరయ్యాయని, త్వరలో 34 రెగ్యులర్ డాక్టర్లతో పాటు స్టాఫ్ నర్స్ లు వస్తున్నారని అన్నారు.

వచ్చే జనవరి 18 నుండి రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని ఇందుకోసం 40 బృందాలను ఏర్పాటు చేసి తగు శిక్ష‌ణ‌ ఇవ్వడంతో పాటు, రీడింగ్ గ్లాస్ లు వెంటనే, ప్రిస్క్రిప్షన్ గ్లాసులు ఒక మాసంలోగా ఇచ్చుటకు ప్రణాళిక సిద్ధం చేశామని ఎమ్మెల్యే అన్నారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో గత మాసం రికార్డు స్థాయిలో 407 కాన్పులు చేశామని అందులో 62 శాతం సాధారణ కాన్పులేనని , ఈ సందర్భంగా వైద్యాధికారులను ప్రశంసించారు.

కొన్ని పి .హెచ్.సి. లలో 24×7 వైద్య సేవలు అందుబాటులో ఉండాలని సభ్యులు కోరగా వైద్య సిబ్బంది కొరతతో పాటు, నాల్గవ తరగతి సిబ్బంది కొరత ఉందని డాక్టర్ చందు నాయక్, డాక్టర్ చంద్రశేఖర్ తెలుపగా వైద్య సేవలు కొనసాగించండి ఖాళీల భర్తీ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఇంకా సమావేశంలో ఎంపీపీలు, జెడ్పిటిసిలు ఆయా మండలాల సమస్యలను సభ ముందు ఉంచారు.

కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు చంద్ర గౌడ్, జిల్లా పరిషత్‌ సి.ఈ.ఓ. వెంకట శైలేష్, ఆర్.డి.ఓ. సాయి రామ్, విడుత శాఖ ఎస్ ఈ జానకిరామ్, డిఆర్ డిఓ శ్రీనివాస్, మిషన్ భగీరథ అధికారి కమలాకర్, డీఈఓ రమేష్ కుమార్ తదితర జిల్లా అధికారులు, జెడ్.పి .టి.సి. లు, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
====
32 గ్రామపంచాయతీల నూతన భవనాల నిర్మాణం కోసం నిధుల మంజూరు: ఎమ్మెల్యే
మెదక్ నియోజకవర్గంలో 32 గ్రామ పంచాయతీలకు నూతన భవనాల నిర్మాణం నిమిత్తం నిధులు మంజూరయ్యాయని మెదక్ ఎమ్మేల్యే పద్మ దేవేందర్ రెడ్డి శనివారం తెలిపారు. హవేళిఘనాపూర్ మండలంలోని 7 గ్రామా పంచాయతీలు, మెదక్ మండలంలో 5, నిజాంపేట్ మండలంలో 5, పాపన్నపేట లో 2, రామాయంపేట మండలంలో 5, చిన్న శంకరంపేట్ మండలంలో 8 చొప్పున మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం క్రింద నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలకు పంచాయత్ రాజ్ అండ్ గ్రామీణాభివృధి శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిందని ఆమె తెలిపారు.

వివరాలు ఇలా.. . హవేళిఘనాపూర్ మండలంలోని ఔరంగాబాద్ తండా, గజిరెడ్డిపల్లి, గంగాపూర్, లింగసానిపల్లి తండా, స్కూల్ తండా, శమ్నాపూర్, రాజ్ పెట్ తండా, మెదక్ మండలంలోని బాలానగర్, గుట్టకిందపల్లి, జానకంపల్లి, మల్కాపూర్ తండా, సాంగై గుడి తండా, నిజాంపేట్ మండలంలోని జడచేరు తండా, నగరం, నందగోకుల, నార్లాపూర్, రాంపూర్ గ్రామా పంచాయతీలున్నాయని ఆమె తెలిపారు.

అదేవిధంగా పాపన్నపేట మండలంలో అన్నారం, కొండపాక, రామాయంపేట మండలంలో కిషన్ తండా, పర్వతాపూర్, శివాయిపల్లి, సుతార్ పల్లి, వెంక టాపూర్-బి, చిన్న శంకరంపేట్ మండలంలో తుర్కల మాందాపూర్ తండా, భగీర్తిపల్లి, చెన్నయిపల్లి , గవ్వలపల్లి, ఖాజాపూర్ తండా, రుద్రారం, సంగాయిపల్లి, సూరారం గ్రామ పంచాయతీలున్నాయని పద్మ దేవేందర్ రెడ్డి తెలిపారు.

కాగా ఇందులో కొత్త ఏర్పడిన గ్రామా పంచాయతీలతో పాటు కొన్ని పాత గ్రామ పంచాతీలున్నాయని, నూతన భవనాల నిర్మాణాలతో గ్రామాలలో వెతలు తీరనున్నాయని ఆమె తెలిపారు.

నూతన గ్రామా పంచాయతీ భవన నిర్మాణాలు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖామంత్రి హరీష్ రావు, పంచాయత్ రాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.-