మ‌హిళ కళ్ల‌ల్లో 60 స‌జీవ కీట‌కాలు.. తొల‌గించిన వైద్యులు

క‌ళ్లు.. అత్యంత సున్నిత‌మైన‌వి. ధూళి, దుమ్ము ప‌డితే క‌ళ్లు ఎర్ర‌గా మారుతాయి. కొన్ని సంద‌ర్భాల్లో ఇన్‌ఫెక్ష‌న్లు సంభ‌విస్తాయి.

  • Publish Date - December 9, 2023 / 11:24 AM IST

చైనా : క‌ళ్లు.. అత్యంత సున్నిత‌మైన‌వి. ధూళి, దుమ్ము ప‌డితే క‌ళ్లు ఎర్ర‌గా మారుతాయి. కొన్ని సంద‌ర్భాల్లో ఇన్‌ఫెక్ష‌న్లు సంభ‌విస్తాయి. అయితే ఓ మ‌హిళ కళ్ల‌ల్లో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా 60 స‌జీవ కీట‌కాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఇది విన‌డానికి, చ‌ద‌వ‌డానికి కొంత వింత‌గా అనిపించిన‌ప్ప‌టికీ.. ఇది వాస్త‌వం. చైనాలో ఈ ఘ‌ట‌న వెలుగు చూసింది.


చైనాలోని కున్‌మింగ్‌కు చెందిన ఓ మ‌హిళ‌కు ఇటీవ‌లే క‌ళ్ల‌ల్లో దుర‌ద వ‌చ్చింది. దీంతో డాక్ట‌ర్ వ‌ద్ద‌కు ఆమె వెళ్లింది. ఆమె క‌ళ్ల‌ను ప‌రిశీలించిన వైద్యులు.. క‌నురెప్ప‌లు, క‌నుగుడ్ల మ‌ధ్య కీట‌కాలు సంచ‌రిస్తున్న‌ట్లు గుర్తించారు. దీంతో ఆమెకు కంటి వైద్యులు వెంట‌నే స‌ర్జ‌రీ నిర్వ‌హించారు.


కళ్ల‌ల్లో తిరుగుతున్న 60 స‌జీవ కీట‌కాల‌ను విజ‌య‌వంతంగా తొల‌గించారు. కుడి క‌న్ను నుంచి 40కి పైగా, ఎడ‌మ క‌న్ను నుంచి 10కి పైగా కీట‌కాల‌ను తొల‌గించిన‌ట్లు వైద్యులు పేర్కొన్నారు. ప్ర‌స్తుతం బాధితురాలి ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు తెలిపారు.


కీటకాలు కళ్లలోకి ఎలా చేరుతాయంటే


నివేదిక ప్రకారం ఆ కీటకాలు సాధారణంగా ఈగ ద్వారా వ్యాపిస్తాయి. అయితే ఆ మహిళ తన పెంపుడు జంతువులైన పిల్లులు, కుక్కలతో ఆడుకునేటప్పుడు వాటి శరీరం మీద ఉన్న లార్వా నుండి ఈ కీటకాలు తన కంటిలోకి చేరే అవ‌కాశం ఉంది. జంతువులతో ఆడుకున్న తర్వాత అదే చేతులతో తన కళ్లను రుద్దుకోవడం వల్లే తనకు ఈ సమస్య వచ్చిందని ఆ మహిళ వైద్యులకు చెప్పింది.