విధాత: చైనాలో తీవ్రమైన మందుల కొరత ఏర్పడింది. సాధారణ ఔషధాలు కూడా దొరకక జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐబూప్రొఫెన్, కోల్డ్ మెడిసిన్స్, కొవిడ్-19 టెస్టింగ్ కిట్లకు షార్టేజీ ఏర్పడింది. జనం సాధారణ హోమ్ రెమెడీస్ ఉత్పత్తులకు కూడా కొరతను ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ ఆన్‌లైన్లో కూడా అందుబాటులో లేక పోవటంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఈ మధ్యన చైనాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం అనేక నగరాల్లో లాక్ డౌన్ ప్రకటించింది. జనాన్ని బలవంతంగా క్వారైంటైన్‌లో ఉంచేందుకు జనావాసాలకు బయటి నుంచి తాళాలు వేశారు.
దీంతో ఓ ఇంట్లో ప్రమాదం జరిగి అనేక మంది చనిపోవటంతో జనంలో ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. లాక్‌డౌన్ ఎత్తివేయాలని నిరసన ప్రదర్శనలు చేశారు. దాంతో ప్రభుత్వం నిబంధనలు సడలించింది. లాక్‌డౌన్ ఎత్తివేసింది.
ఈ నేపథ్యంలో చైనాలో కరోనా కేసులు పెరుగుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. మరో వైపు రాబోయే రోజుల్లో తిరిగి లాక్‌డౌన్ తప్పదనే పుకార్లతో కరోనా నివారణకు ఉపయోగించే మందులకు గిరాకీ కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఒక్క సారిగా కరోనా నివారణ ఔషధాల కొనుగోళ్లు, నిలువ చేసుకోవటం పెరగటంతో మందుల కొరత ఏర్పడిందని అధికారులు అంటున్నారు.