Eatala
- చేరికల కమిటీ చైర్మన్‌గా ఆయనకు స్వేచ్ఛ ఇవ్వడం లేదా?
విధాత బ్యూరో, కరీంనగర్: ‘గులాబీ జెండాకు మేమే ఓనర్లం’ అంటూ రాష్ట్ర మంత్రిగా ఉన్న ఈటల(Eatala Rajendar) రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఆనాటి టీఆర్ఎస్‌లోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. తాజాగా ముఖ్యమంత్రిని కేంద్రంగా చేసుకొని రాష్ట్ర కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని సృష్టిస్తున్నాయి.
ఈ రెండు సందర్భాలను పరిశీలిస్తున్న ఆయన అభిమానులు ఎల్లప్పుడూ సౌమ్యంగా ఉండే ఈటల ఇంత కటువుగా ఎలా మాట్లాడారనే విషయంలో తమకు తోచిన భాష్యం చెప్పుకుంటున్నారు. గులాబీ జెండాకు ఓనర్లం.. అన్న వ్యాఖ్యలు అధికార పార్టీలో ఆయన నిష్క్రమణకు దారిచూపితే, ప్రస్తుత వ్యాఖ్యలు కొనసాగుతున్న పార్టీలో ఇమడలేని ఆయన నిస్సహాయతను ప్రతిఫలిస్తున్నాయనే అభిప్రాయానికి ఊతమిస్తున్నాయి.
ఆరునెలల తరువాత ఇప్పుడెందుకు?
ఉప ఎన్నిక సందర్భంలోనే కాదు, ఎన్నికలు పూర్తయిన ఆరు నెలల తరువాత కూడా ‘మునుగోడు’ రాష్ట్ర రాజకీయాలలో ప్రకంపనలకు కారణమవుతూ వస్తోంది. ఉప ఎన్నిక సందర్భంగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు కాంగ్రెస్ పార్టీకి 25 కోట్లు ఇచ్చారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడి హోదాలో ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఆ ప్రకంపనల తీవ్రతను మరింత పెంచాయి.
బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధానికి ఈ వ్యాఖ్యలు ఆజ్యం పోశాయి. ఈటల వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెనువెంటనే స్పందించారు. ఆయన నేరుగా భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లి ‘నేను కేసీఆర్ నుండి ఎలాంటి డబ్బు తీసుకోలేదు. తీసుకొని ఉంటే నేను, నా కుటుంబం సర్వనాశనం అయిపోతాం’ అని అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్పారు.
రాష్ట్రంలో కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న తన నిజాయితీని ఈటల శంకించడం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీలో తగిన ప్రాధాన్యం లేకనే ఈటల ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఈటల వ్యాఖ్యలను ఆ పార్టీ నేతలు ఏపీ జితేందర్ రెడ్డి, డీకే అరుణ, మర్రి శశిధర్ రెడ్డి సమర్థించగా, మరో నేత విజయశాంతి.. ఈటల, రేవంత్.. తమ దాడిని ఒకరిపై ఒకరు కాకుండా ప్రభుత్వంపై చేయాలని సూచించారు.
ఈటల నుండి ఆరోపణలు ఎదుర్కొన్న రేవంత్ రెడ్డికి ఎన్ ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ బాసటగా నిలవగా, యూత్ కాంగ్రెస్ ఈటల దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చింది. మునుగోడు ఉప ఎన్నికలకు కారణం అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ పై తనదైన శైలిలో మరోసారి విరుచుకుపడ్డారు.
ఈటల ఇప్పుడెందుకీ వ్యాఖ్యలు చేశారు?
బీజేపీలో ఈటలకు తగిన ప్రాధాన్యం లేదనే చర్చ జరుగుతున్నది. అమిత్ షా దృష్టిలో పడేందుకే ఆయన ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రేవంత్ చెప్పిన దాంట్లో వాస్తవం లేకపోలేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బీఆర్ఎస్ తో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈటల ఆ పార్టీలో క్రియాశీలక నేతగా వ్యవహరించారు. దాదాపు నెంబర్ 2 పాత్ర పోషించారు.
పార్టీని వదిలి వెళ్లాల్సిన సమయంలో ఆయన కాంగ్రెస్‌లో చేరుతారని అనేకమంది భావించినా, వారి ఊహలను తల్లకిందులు చేస్తూ ఈటల బీజేపీ వైపు మొగ్గు చూపారు. అయితే ఈ నిర్ణయం ఆయన అనుచర గణానికి పెద్దగా రుచించలేదు. హుజురాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి తెలుగుదేశం నేత దివంగత ముద్ధసాని దామోదర్ రెడ్డి తర్వాత ఆ స్థాయిలో పట్టు సంపాదించిన ఈటల.. తన నియోజకవర్గంలో తిరుగులేని నేతగా ఎదిగారు.
ఈటల గడ్డ.. హుజూరాబాద్
హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో అధికార పార్టీ సర్వశక్తులు ఒడ్డి పోరాడినా, ఈటల ప్రజాభిమానం ముందు అధికార పార్టీ ఎత్తుగడలు ఏవి ఫలించలేదు. బీసీ వర్గానికి చెందిన వ్యక్తిగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రజాదరణ కలిగిన నేతగా ఈటలను గుర్తించిన బీజేపీ కేంద్ర నాయకత్వం ఆయనకు జాతీయ కార్యవర్గ సభ్యుని హోదా కల్పించడంతోపాటు, రాష్ట్రంలో పార్టీ చేరికల కమిటీ చైర్మన్ గా నియమించి పెద్ద పీట వేసింది. అయితే అసలు చిక్కులు ఆయనకు ఇక్కడే ప్రారంభమయ్యాయి.
ఈటల ప్రయత్నాలకు మద్దతు లేదా?
అధికార పార్టీతో పాటు, ఇతర పార్టీల నుండి బీజేపీ వైపు చూస్తున్న నేతలను చేరికల దిశగా ప్రోత్సహించడానికి ఈటల చేస్తున్న ప్రయత్నాలకు రాష్ట్ర బీజేపీ నేతల నుండి ప్రోత్సాహం కరువైనట్టు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో కీలక నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో మరో కీలక నేత జూపల్లి కృష్ణారావులను బీజేపీలో తీసుకువచ్చేందుకు ఈటల ప్రయత్నాలు చేశారని, అయితే.. రాష్ట్ర బీజేపీ నాయకత్వం కారణంగానే ప్రయత్నాలు ఫలించలేదనే చర్చ నడుస్తున్నది. దీంతో చేరికల కమిటీ చైర్మన్ గా తన పాత్ర నామ మాత్రంగా మిగిలి పోయిందన్న ఆవేదన ఈటల మనసును తొలిచేస్తున్నదనే ప్రచారం జరుగుతున్నది.
బండికి, ఈటలకు మధ్య వైరం?
ఇక హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో నిధుల ఖర్చుకు సంబంధించి పార్టీలోని మరో నేత వివేక్ వెంకటస్వామి, ఈటల మధ్య పొరపొచ్చాలు వచ్చాయని సామాజిక మాధ్యమాలు హోరెత్తాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు, ఈటల రాజేందర్ కు మధ్య సత్సంబంధాలు కరువైనట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈటల మళ్లీ పార్టీ మారే అవకాశం ఉందని వదంతులు వినిపించాయి. అయితే వాటిని ఆయన కొట్టి పారేశారు.
బీజేపీలో పాత, కొత్త తరం నేతల మధ్య పొత్తు పోసగడం లేదని, ఇదే పార్టీ అభివృద్ధికి ఆటంకంగా నిలిచిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈటల ఇటీవల కాలంలో అసహనానికి గురవుతున్నారని, అభద్రతా భావంతో ఉంటున్నారని బహిరంగంగానే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని చెబుతున్న బీజేపీలో నేతల మధ్య ఉన్న అంతర్గత వ్యవహారాలు, ఆధిపత్య ధోరణులు పార్టీకి చేసే మేలు కన్నా కీడే అధికమని విశ్లేషకుల అభిప్రాయం.