విధాత: తెలంగాణలో రైతుబంధు సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని కేంద్ర ఎన్నికల సంఘం ఉపసంహరించుకున్నది. ఈ మేరకు సోమవారం ఆదేశాలు జారీచేసింది. అధికార బీఆర్ఎస్ పార్టీ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా రెండు రోజుల వ్యవధిలోనే ఇచ్చిన అనుమతిని ఈసీ ఉపసంహరించుకోవడం చర్చనీయాంశమైంది.
ఈ నెల 28లోపు రైతుబంధు పంపిణీకి ఈసీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల ప్రచార సభల్లో రైతుబంధు గురించి ప్రస్తావించవద్దని, ప్రభుత్వం లబ్ధిపొందేలా వ్యాఖ్యలు చేయవద్దని ఈసీ నిబంధన విధించింది. కానీ, ప్రచార సభలో మంత్రి హరీశ్‌రావు రైతుబంధుపై వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 28న రైతుల ఖాతాల్లో రైతుబంధు సాయం జమ అవుతుందని, ఫోన్లకు మెస్సేజ్ టింగుటింగు మంటూ వస్తుందని చెప్పారు.
ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. పరిశీలించిన ఈసీ.. ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ సాయం పంపిణీ అనుమతిని నిరాకరిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. హరీష్ చేసిన వ్యాఖ్యల వల్లే ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్డర్ కాపీలో ఈసీ పేర్కొన్నది.
తెలంగాణలో యాసంగి సీజన్ వ్యవసాయ పెట్టుబడి కింద రైతు బంధు సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి శుక్రవారం రాత్రి ఈసీ అనుమతి ఇచ్చింది. ఈ నెల 28వ తేదీలోగా సాయం పంపిణీ చేయాలని సూచించింది. ఈసీ ఆదేశాలకు అనుగుణంగా రైతుబంధు చెల్లింపులు పూర్తిచేయాలని నిర్దేశించింది. ఈసీ నిబంధనలను బీఆర్ఎస్ ఉల్లంఘించడంతో పంపిణీకి బ్రేక్ పడింది.