దేశంలో సామాజిక, ఆర్థిక సమస్యలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం పరిష్కరించజాలదట! అందులోనూ నిరుద్యోగం వంటి సమస్య అయితే మరీ కష్టమట! ఈ మాట ఎవరో సాదాసీదా అడ్రస్‌లేని మనిషి చెప్పడం కాదు.. కేంద్ర ప్రభుత్వానికి చీఫ్ ఎకనమిక్ అడ్వయిజర్ పదవిలో ఉన్న వీ అనంత నాగేశ్వరన్ సెలవిచ్చిన మాట ఇది! మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో అనంత నాగేశ్వరన్ మాట్లాడుతూ.. నిరుద్యోగం వంటి సామాజిక, ఆర్థిక సమస్యలన ప్రభుత్వం పరిష్కరిస్తుందని అనుకోవడం సరికాదని ఆయన తేల్చి చెప్పారు. ‘ఇండియా ఎంప్లాయిమెంట్ రిపోర్ట్ 2024: యూత్ ఎంప్లాయిమెంట్, ఎడ్యుకేషన్, స్కిల్స్’ పేరిట ఒక నివేదిక విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ నివేదికను అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో), ది ఇన్‌స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్‌మెంట్ సంయుక్తంగా రూపొందించాయి. అసలు నిరుద్యోగం విషయంలో ప్రభుత్వం ఏం చేయగలదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రపంచంలో ఉద్యోగులను నియమించుకునే అవసరం కమర్షియల్ రంగానికే ఉన్నదని వ్యాఖ్యానించారు. అదే సమయంలో స్కిల్ ఇండియా మిషన్ వంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని చెప్పుకొచ్చారు. 1970లలో వచ్చిన వ్యంగ్య చిత్రం మహ్మద్ బిన్ తుగ్లక్ సినిమాలో డైలాగ్‌ను ఆయన ఉదహరించారు. ‘చూడండి.. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉన్నదని నేను ప్రతి వేదికపైనా చెబుతూ వస్తాను. నిరుద్యోగ సమస్యకు నేను చేయగలిగింది ఇంతే. ఎందుకంటే నిరుద్యోగ సమస్యను నేను పరిష్కరించలేను’ అని ఆ సినిమాలో చెబుతారని పేర్కొన్నారు. ఇదే నాగేశ్వరన్ విడుదల చేసిన నివేదిక.. దేశంలో అసంఘటిత రంగంలో పెరిగిపోతున్న నిరుద్యోగిత గురించి, వేతనాలు, సంపాదనలు గణనీయంగా పడిపోతున్న విషయాన్ని ప్రస్తావించింది.
దేశంలో నిరుద్యోగిత సమస్యను గుర్తించి, పరిష్కరించడానికి బదులు ఉపాధి, ఉద్యోగాల కల్పన గురించి మోదీ ప్రభుత్వం ఎంతగా అవాస్తవాలు ప్రచారం చేసిందో ఈ నివేదికను చూస్తే అర్థమవుతున్నదని ఆర్థిక వేత్త సంతోష్ మెహ్రోత్రా అన్నారు.
నిరుద్యోగిత విషయంలో చేతులెత్తేసిన నాగేశ్వరన్.. ఉద్యోగాల గురించి మోదీ ప్రభుత్వాకి యువత మొత్తుకుంటున్న విషయాన్ని విస్మరించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
2014 ఎన్నికల్లో తమను గెలిపిస్తే యువతకు ఏటా కోటి ఉద్యోగాలు కల్పిస్తామని ప్రధాన మంత్రి అభ్యర్థి హోదాలో మోదీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.