CM Revanth Reddy | రాములోరి కల్యాణానికి రేవంత్‌రెడ్డి దూరం.. ఇదీ కారణం!

భ‌ద్రాచ‌ల రామునికి క‌ళ్యాణ వేళ రాష్ట్ర ప్ర‌భుత్వం త‌రఫున ప‌ట్టు వ‌స్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అంద‌జేసి సేవించుకునే అరుదైన అదృష్టం ముఖ్య‌మంత్రి దంప‌తుల‌కు ద‌క్కుతుంది

  • Publish Date - April 16, 2024 / 05:31 PM IST

దూర‌ద‌ర్శన్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాల‌కూ అనుమ‌తి ఇవ్వ‌ని ఈసీ

హైద‌రాబాద్‌: భ‌ద్రాచ‌ల రామునికి క‌ళ్యాణ వేళ రాష్ట్ర ప్ర‌భుత్వం త‌రఫున ప‌ట్టు వ‌స్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అంద‌జేసి సేవించుకునే అరుదైన అదృష్టం ముఖ్య‌మంత్రి దంప‌తుల‌కు ద‌క్కుతుంది. అయితే ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి (ఎన్నిక‌ల కోడ్‌) కార‌ణంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి దంప‌తులు ఆ అవ‌కాశాన్ని కోల్పోయారు. గ‌తేడాది డిసెంబ‌రు 3న వెలువ‌డిన శాస‌న‌స‌భ ఫ‌లితాల్లో కాంగ్రెస్ ఘ‌న విజ‌యం సాధించ‌డంతో అదే నెల ఏడో తేదీన ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేశారు. ముఖ్య‌మంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మార్చి 11న భ‌ద్రాచ‌లం వ‌చ్చి శ్రీ‌సీతారామ‌చంద్ర స్వామి ద‌ర్శ‌నం చేసుకొని ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. రామ‌య్య కొలువైన భ‌ద్రాచ‌లం నుంచే పేద‌లంద‌రికీ గూడు క‌ల్పించే ఇందిర‌మ్మ ఇళ్లు ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టారు.

భ‌ద్రాచ‌లం ఆల‌య అభివృద్ధిపై ప్ర‌త్యేక స‌మీక్ష‌ను నాడు ముఖ్య‌మంత్రి స్వీక‌రించారు. ఆల‌య అభివృద్ధికి అవ‌స‌ర‌మైన అన్ని ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేయాల‌ని ముఖ్య‌మంత్రి అధికారుల‌ను ఆదేశించారు. అలాగే క‌ర‌క‌ట్ట ప‌నులు నాణ్య‌త‌తో పూర్తి చేయాల‌ని సూచించారు. అయిదు విలీన గ్రామాల అంశాల‌ను ప‌రిశీలిస్తామ‌ని హామీ ఇచ్చారు. సీతారామ‌లు క‌ళ్యాణానికి ముఖ్య‌మంత్రి వ‌స్తే మ‌రిన్ని అభివృద్ధి ప‌నుల‌కు మోక్షం క‌లుగుతుంద‌ని భ‌ద్రాచ‌లం వాసులు ఎంత‌గానో ఎదురుచూశారు. భ‌ద్రాచ‌లంలో రామ‌య్య క‌ళ్యాణానికి హాజ‌రుకావాల‌ని, ప‌ట్టు వ‌స్త్రాలు, ముత్యాల తలంబ్రాలు స‌మ‌ర్పించాల‌ని ముఖ్య‌మంత్రి దంప‌తులు ఎంత‌గానో ఆకాంక్షించారు.

కానీ ఎన్నిక‌ల కోడ్ రావ‌డంతో ఈసారికి ఆ అవ‌కాశం వారికి ద‌క్క‌లేదు. ద‌క్షిణ భార‌త అయోధ్య‌గా గుర్తింపుపొందిన భ‌ద్రాచ‌లంలో ప్ర‌తి ఏటా శ్రీ‌రామ‌న‌వ‌మి రోజున సీతారామ‌చంద్రులు క‌ళ్యాణం అత్యంత వైభ‌వంగా జ‌ర‌గుతుంది. సీతారామ‌చంద్రుల క‌ళ్యాణానికి ప‌ట్టువ‌స్త్రాలు, ముత్యాల త‌లంబ్రాలు రాజ‌ధాని నుంచి పంపే ఆచారం కుతుబ్‌షాహీ న‌వాబు తానీషా పాల‌న కాలం నుంచి వ‌స్తోంది. కుతుబ్ షాహీల అనంత‌రం, అస‌ఫ్ జాహీ (నైజాం) న‌వాబులు పాలించిన కాలంలోనూ, త‌ర్వాత ప్ర‌జాస్వామిక వ్య‌వ‌స్థ‌లో హైద‌రాబాద్ రాష్ట్రం ఏర్ప‌డిన‌ప్పుడు, త‌ర్వాత ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో, ప్ర‌త్యేక తెలంగాణ‌లోనూ ఈ ఆచారం కొన‌సాగింది.

ముఖ్య‌మంత్రి దంప‌తులు రాలేని ప‌క్షంలో దేవాదాయ శాఖ మంత్రులు రాజ‌ధాని హైద‌రాబాద్ నుంచి ప‌ట్టువ‌స్త్రాలు, ముత్యాల తలంబ్రాలు రామ‌య్య క‌ళ్యాణానికి భ‌ద్రాచ‌లం తీసుకెళ‌తారు. అలా తీసుకెళ్లిన ప‌ట్టు వ‌స్త్రాల‌ను క‌ళ్యాణ మూర్తుల‌కు ధ‌రింప‌జేసి ముత్యాల తలంబ్రాల‌ను క‌ళ్యాణ స‌మ‌యంలో వినియోగిస్తారు. ఎన్నిక‌ల కోడ్‌తో ముఖ్య‌మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దంప‌తులు ప‌ట్టు వ‌స్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అంద‌జేసే అవ‌కాశం లేదు. దూర ప్రాంతాల వారు, ఇత‌ర కార‌ణాల‌తో భ‌ద్రాచ‌లం రాలేని వారు రామ‌య్య క‌ళ్యాణం తిల‌కించేందుకు దూర‌ద‌ర్శ‌న్‌లో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాల‌కు అనుమ‌తించాల‌ని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు లేఖ రాశారు. కానీ ఆమె విజ్ఞ‌ప్తికి ఈసీ ఆమోదం తెల‌ప‌లేదు.

Latest News