El Nino |
ఈ ఏడాది ఎల్ నిన్యో పరిస్థితులు నెలకొంటున్నాయన్న అంచనాలు ఉన్నాయి. దేశంలో వర్షపాతం తగ్గిపోవడానికి, కరువు కాటకాలకు కారణమయ్యే ఈ వాతావరణ నమూనా ఏమిటి? అసలు ఎల్ నిన్యో అంటే ఏమిటి? లా నిన్యా అంటే ఏమిటి? వీటి అర్థాలేంటి?
వాషింగ్టన్: ఎల్ నిన్యో.. లా నిన్యా.. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఈ రెండు వాతావరణ నమూనాలు.. మొత్తం ప్రపంచ వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేస్తాయి. ఒక భాగంలో సముద్ర జలాలు వేడెక్కడం లేదా సగటు కంటే చల్లగా మారడం అనే ప్రక్రియలనే ఎల్ నిన్యో, లా నిన్యా అని పిలుస్తారు. వీటిని స్పానిష్ భాష నుంచి తీసుకున్నారు.
పసిఫిక్ మహాసముద్రంలో సాధారణ పరిస్థితుల్లో భూమధ్య రేఖ మీదుగా ట్రేడ్ విండ్స్ పశ్చిమ దిశగా వీస్తాయి. తద్వారా దక్షిణ అమెరికా నుంచి సముద్ర ఉపరితల వెచ్చటి జలాలను ఆసియా వైపు తీసుకుపోతాయి. దీంతో కింది నుంచి చల్లటి జలాలు పైకి వస్తాయి. ఈ ప్రక్రియను అప్‌వెల్లింగ్ అంటారు. అంటే పైకి ఉప్పొంగటం.
పరస్పర విరుద్ధ శీతోష్ణ స్థితి నమూనాలు
ఎల్ నిన్యో, లా నిన్యా అనేవి పరస్పర విరుద్ధమైన శీతోష్ణస్థితి నమూనాలు. ఇవి సాధారణ పరిస్థితులకు భంగం కలిగిస్తాయి. శాస్త్రవేత్తలు ఈ ఘటనాక్రమాన్ని ఎల్ నిన్యో-దక్షిణపు డోలాయమాన ఆవృత్తం (ఈఎన్‌ఎస్‌వో)గా పిలుస్తారు. ఎల్ నిన్యో, లా నిన్యా.. ఈ రెండూ వాతావరణం, కార్చిచ్చులు, పర్యావరణం, ఆర్థికవ్యవస్థల ప్రపంచ స్థాయిలో ప్రభావాలు చూపుతాయి.
అయితే.. రెండిలో ఏదైనా సాధారణంగా 9 నుంచి 12 నెలలపాటు కొనసాగుతాయి. కొన్ని సందర్భాల్లో ఏండ్ల తరబడి కొనసాగే అవకాశాలూ ఉంటాయి. ఇవి సాధారణంగా సగటున రెండు నుంచి ఏడేండ్లకు ఒకసారి వస్తాయి. అదే సమయంలో క్రమం తప్పకుండే ఒకే షెడ్యూల్‌తో రావు. సాధారణంగా లా నిన్యా కంటే ఎల్ నిన్యో పరిస్థితులు తరచూ ఏర్పడుతుంటాయి.
ఎల్ నిన్యోలో ఏం జరుగుతుంది?
ఎల్ నిన్యో పరిస్థితులు ఏర్పడినప్పుడు ట్రేడ్ విండ్స్ బలహీన పడతాయి. వెచ్చటి జలాలు అమెరికా పశ్చిమతీరం దిశగా తూర్పువైపు నెట్టబడతాయి. ఎల్ నిన్యో అంటే స్పానిష్ భాషలో ‘చిన్న పిల్లాడు’ అని అర్థం. 1600 సంవత్సరాల్లో పసిఫిక్ మహాసముద్ర జలాలు అసాధారణంగా వేడెక్కుతున్న సమయాలను దక్షిణ అమెరికాకు చెందిన జాలర్లు గుర్తించారు. ఎల్ నిన్యో పరిస్థితులు సాధారణంగా డిసెంబర్‌లో గరిష్ఠస్థాయిలో కనిపిస్తాయి కాబట్టి వారు దీనిని ఎల్ నిన్యో డీ నవిదాద్ అని పిలిచారు. అంటే ‘క్రిస్మస్ బాలుడు’ అని అర్థం.
వాతావరణంపై పెను ప్రభావం
వాతావరణాన్ని ఎల్ నిన్యో తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. పసిఫిక్ గాలుల ప్రవాహాన్ని ఈ వేడి జలాలు దక్షిణం వైపు.. అంటే దాని తటస్థ స్థానానికి తీసుకుపోతాయి. ఈ మార్పుతో అమెరికా ఉత్తర ప్రాంతాలు, కెనడా పొడిబారిపోయి, సాధారణం కంటే వేడిగా మారుతాయి. మరోవైపు అమెరికా గల్ఫ్ కోస్ట్, నైరుతి ప్రాంతాల్లో ఇదే కాలంలో సాధారణం కంటే తడిగా మారుతుంది. వరదలు పెరుగుతాయి.
సముద్ర జీవజాలానికీ ఎఫెక్ట్
పసిఫిక్ తీరంలో సముద్రజీవజాలంపైనా బలమైన ప్రభావాన్ని ఎల్ నిన్యో చూపుతుంది.
సాధారణ పరిస్థితుల్లో అప్‌వెల్లింగ్ ద్వారా లోతుల్లో ఉన్న జలాలు పైకి ఉబుకుతాయి. ఈ జలాలు చల్లగా ఉంటాయి. సముద్రజీవజాలానికి అవసరమయే పోషకాలను కలిగి ఉంటాయి. ఎల్ నిన్యో కాలంలో అప్‌వెల్లింగ్ ప్రక్రియ బలహీనపడటమో లేదా మొత్తానికి ఆగిపోవడమో అవుతుంది.
లోతైన జలాలు పైకి వచ్చినప్పుడు వచ్చే పోషకాలు లేకపోవడం వల్ల పైటోప్లాంక్టన్ లేదా వృక్షప్లవకాలు కొద్దిగా ఉంటాయి. వీటిని తినడం వల్ల చేపలు ప్రభావితమవుతాయి. అంతేకాదు.. అలాంటి చేపలను తిన్న ప్రతిదాన్నీ ప్రభావితం చేస్తాయి. కొన్ని అరుదైన జాతుల సముద్ర జీవులు లోతున ఉన్న చల్లటి జలాల్లోకి వెళ్లిపోతాయి.
లా నిన్యాలో జరిగేది ఇదీ..
లా నిన్యా అంటే స్పానిష్‌లో ‘చిన్న పిల్ల’ అని అర్థం. దీనిని కొన్నిసార్లు ఎల్ వియిజో (ముసలివాడు) అని కూడా అంటారు. ఎల్ నిన్యో అంటే ‘చిన్న పిల్లాడు’ అనుకుంటే.. ఎల్ వియిజో అంటే దానికి వ్యతిరేకార్థమన్నమాట. ఎల్ నిన్యోకు పూర్తి వ్యతిరేక ప్రభావాలు లా నిన్యా వల్ల కలుగుతాయి. లా నిన్యా సమయంలో వాణిజ్య గాలులు సాధారణం కంటే బలంగా వెచ్చటి జలాలను ఆసియా వైపు నెడుతాయి.
అమెరికా పశ్చిమతీరం నుంచి అప్‌వెల్లింగ్ లేదా ఉబికిరావడం వల్ల చల్లటి, సముద్ర జీవజాలానికి అవసరమయ్యే పోషకాలు ఉన్న జలాలను ఉపరితలానికి చేరుకుంటాయి. పసిఫిక్ మహాసముద్రంలోని ఈ చల్లటి జలాలు గాలి ప్రవాహాన్ని ఉత్తర దిశగా నెట్టుతాయి. ఈ పరిణామాలతో అమెరికా దక్షిణాదిలో కరువులకు దారి తీస్తుంది.
పసిఫిక్ వాయవ్యం, కెనడాలో భారీ వర్షాలకు, వదరలకు కారణమవుతుంది. లా నిన్యా ఏడాదిలో శీతాకాల ఉష్ణోగ్రతలు దక్షిణాదిలో సాధారణం కంటే వేడిగా, ఉత్తరాదిలో సాధారణం కంటే చల్లగా ఉంటాయి. లా నిన్యా వల్ల అతి తీవ్ర హరికేన్ల సీజన్ ఉంటుంది.
లా నిన్యా సీజన్‌లో పసిఫిక్ మహాసముద్ర తీరం వెంబడి జలాలు సాధారణం కంటే చల్లగా ఉంటాయి. సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో పోషకాలు పైకి వస్తాయి. ఇటువంటి వాతావరణం సముద్రజీవలానికి అనువుగా ఉంటుంది. చల్లటి జలాల్లోనే నివసించే కొన్ని జాతుల చేపలను తీరానికి చేరువగా వచ్చేలా చేస్తుంది.