Twins | ప్రతి స్త్రీ మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవించాలని కోరుకుంటోంది. అందుకోసం పెళ్లైన తర్వాత పిల్లలను కనేందుకు ప్లానింగ్ చేసుకుంటారు. కొందరేమో కొన్ని వారాల్లోనే గర్భం దాల్చుతారు. ఇంకొందరేమో నెలలు, సంవత్సరాలు గడిచినా గర్భం దాల్చరు. ఇందుకు కారణం జీవనశైలి, ఆహారపు అలవాట్లు, హార్మోన్ల అసమతుల్యత అని చెప్పొచ్చు. ఇలాంటి వారు ఐవీఎఫ్ లాంటి పద్ధతులను ఎంచుకొని, పిల్లలను కనేందుకు ప్రయత్నిస్తారు. ఆ మాదిరిగానే ఓ 58 ఏండ్ల మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని బికనీర్‌కు చెందిన షేర్ బహదూర్(58)కు కొన్నేండ్ల క్రితం పెళ్లైంది. కానీ ఆమెకు సంతానం కలగలేదు. వృద్దాప్యం వస్తున్నప్పటికీ, ఆమెకు పిల్లలను కనాలనే కోరిక మాత్రం అలానే ఉండిపోయింది. ఐవీఎఫ్ ద్వారా పిల్లలను కనొచ్చు అని షేర్‌కు తెలిసింది. దీంతో బికనీర్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిని సంప్రదించింది. డాక్టర్ షెఫాలీ షేరా ఆధ్వర్యంలో షేర్ బహదూర్‌కు ఐవీఎఫ్ ట్రీట్‌మెంట్ జరిగింది.
షేర్ బహదూర్‌తో పాటు ఆమె భర్తలో సంతానోత్పత్తికి కావాల్సిన హార్మోన్లను పెంపొందించారు. ఆ తర్వాత ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా పిల్లలను కనేందుకు చికిత్స చేశారు. షేర్ గర్భం ధరించేందుకు రెండేండ్ల సమయం పట్టింది. ఆ తర్వాత గర్భం ధరించింది. తొమ్మిది నెలల తర్వాత షేర్ పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో ఒకరు మగ, మరొకరు ఆడ. ఒకే కాన్పులో ఒక మగ పిల్లాడు, ఆడబిడ్డ జన్మించడంతో.. షేర్ కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. తన మాత్వత్వపు కోరికను నెరవేర్చిన డాక్టర్ షెఫాలీకి షేర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.