Pregnant Murder | కులాంత‌ర వివాహం.. గ‌ర్భిణిని కొట్టి చంపిన తండ్రి

కులాంతర వివాహం చేసుకుందని కక్షతో ఆరు నెలల గర్భిణి అని కూడా చూడకుండా కన్నకూతురిని ఇనుప రాడ్లతో కొట్టి చంపాడు ఓ కిరాతక తండ్రి. కర్ణాటకలోని హుబ్బళ్లిలో జరిగిన దారుణమిది.

Pregnant woman murdered in Karnataka

Pregnant Murder | బెంగ‌ళూరు : కులాంత‌ర వివాహం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. బిడ్డ గ‌ర్భం దాల్చింద‌న్న క‌నిక‌రం లేకుండా ఆమెపై ఇనుప‌రాడ్ల‌తో దాడి చేపి ప్రాణాల‌ను బ‌లిగొన్నాడు తండ్రి. ఈ దారుణ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని హుబ్బ‌ళ్లిలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. హుబ్బ‌ళ్లికి చెందిన మాన్య పాటిల్(19) అనే యువ‌తి ఈ ఏడాది మే నెల‌లో తాను ప్రేమించిన యువ‌కుడిని పెళ్లాడింది. అత‌నిది వేరే కులం కాగా, ఇద్ద‌రిది ఒకే గ్రామం. కులాంత‌ర వివాహం చేసుకోవ‌డంతో.. మాన్య‌పై ఆమె తండ్రి ప‌గ పెంచుకున్నాడు. ఈ క్ర‌మంలో మాన్య త‌న భ‌ర్త‌తో పాటు హ‌వేరి జిల్లాలో నివ‌సించేది. అయితే డిసెంబ‌ర్ 8వ తేదీన భ‌ర్త‌తో క‌లిసి మాన్య త‌న సొంతూరికి తిరిగొచ్చింది. ప్రస్తుతం ఆమె ఆరు నెల‌ల గ‌ర్భిణి.

అత్త‌గారింట్లో ఉన్న మాన్య‌ను మ‌ట్టుబెట్టాల‌ని తండ్రి ప్ర‌కాశ్ ఫ‌క్కీర్‌గోడ నిర్ణ‌యించుకున్నాడు. ప‌థ‌కం ప్ర‌కారం.. ఆదివారం త‌న ఇద్ద‌రు బంధువుల‌తో క‌లిసి మాన్య భ‌ర్తకు చెందిన వ్య‌వ‌సాయ పొలంలోకి క‌త్తుల‌తో వెళ్లారు. అక్క‌డ్నుంచి మాన్య త‌ప్పించుకుని ఇంటికి చేరుకుంది. ఆదివారం సాయంత్రం 6.30 గంట‌ల‌కు మ‌రోసారి ప్ర‌కాశ్‌.. మాన్య‌పై దాడి చేసేందుకు వెళ్లాడు. ఇంట్లో నుంచి మాన్య‌ను బ‌య‌ట‌కు లాక్కొచ్చి ఇనుప‌రాడ్ల‌తో దాడి చేసి కొట్టి చంపాడు. బిడ్డ గ‌ర్భం దాల్చింద‌న్న క‌నిక‌రం లేకుండా క‌ర్క‌శ‌కంగా ప్రాణాలు తీశాడు. తండ్రి దాడి నుంచి మాన్య‌ను కాపాడేందుకు ప్ర‌య‌త్నించిన అత్త‌మామ‌లు రేణుక‌మ్మ‌, సుభాష్‌కు కూడా తీవ్ర గాయాల‌య్యాయి.

తీవ్ర గాయాల‌తో బాధ‌ప‌డుతున్న గ‌ర్భిణి మాన్య‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా, అప్ప‌టికే ప్రాణాలు కోల్పోయిన‌ట్లు డాక్ట‌ర్లు తేల్చారు. ఈ హ‌త్య‌కు సంబంధించి పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. నిందితుడు ప్ర‌కాశ్‌తో పాటు ఇద్ద‌రు బంధువుల‌ను పోలీసులు అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి :

Re Releases | రీ రిలీజ్‌ల‌లోను ఇద్ద‌రు స్టార్ హీరోల మ‌ధ్య బిగ్ ఫైట్.. న్యూ ఇయర్‌కు టాలీవుడ్ పండగ
Samantha | శారీలో సమంత స్టన్నింగ్ లుక్స్.. లైఫ్​ స్టైల్ మార్చేసిన సమంత

Latest News