విధాత, హైదరాబాద్:
BJP internal dissent| పార్టీలో ఇమడలేక, బయటకు రాలేక పలువురు ముఖ్యనేతలు సతమతమవుతున్నారన్న అభిప్రాయాలు బీజేపీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. ఇతర పార్టీల నుంచి వెళ్లి బీజేపీలో చేరిన నేతలకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదన్న వాదనలు ముందు నుంచీ ఉన్నాయి. ఇతర రాష్ట్రాలలో వేరే పార్టీల నుంచి చేరిన వారికి సముచిత ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా ముఖ్యమంత్రి పీఠాలపై కూర్చోబెట్టిన ఉదంతాలు ఉన్నాయి. తెలంగాణలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన ముఖ్య నాయకులను కూడా ద్వితీయ శ్రేణి నాయకత్వంగా పరిగణిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర పార్టీల నుంచి వచ్చి బీజేపీలో చేరినవారిలో కొందరు బీజేపీకి రాం రాం చెప్పడం వెనుక ఇదే కారణమన్న వాదన వినిపిస్తున్నది. మరికొందరు కూడా ఇదే దారిలో ఉన్నారని, కేంద్రంలో జరిగే పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నారని బీజేపీ శ్రేణుల్లో చర్చలు సాగుతున్నాయి. మున్ముందు కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు సంకేతాలు గట్టిగా ఉంటే బీజేపీలోనే కొనసాగుతారని, ఏ మాత్రం తేడా అనిపించినా ఎన్నికలకు ముందు వేరే పార్టీల్లోకి జంప్ చేసే అవకాశాలు ఉన్నాయని ఆ చర్చల సారాంశం.
తాజాగా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్.. బీజేపీని వీడి తిరిగి బీఆర్ఎస్‌లో చేరారు. ఇంతకు ముందు వర్థన్నపేట నుంచి 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత 2018 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2023 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. మారిన పరిస్థితులు, రాజకీయ సమీకరణల నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకత్వం ఆయనకు వరంగల్ ఎంపీ టికెట్ నిరాకరించి, మాజీ మంత్రి కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు టికెట్ ఇచ్చింది. దీంతో అలిగిన రమేశ్.. 2024 మార్చిలో కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి సమయంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ వెంటనే వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, కావ్య చేతిలో ఓటమి పాలయ్యారు. మరోవైపు బీజేపీ కార్యక్రమాలకు హాజరు కావడమే కాకుండా, ముఖ్య నాయకులతో సఖ్యతగా ఉంటున్నా సరైన గుర్తింపు లభించలేదని ఆయన వర్గీయులు చెబుతున్నారు. బయట నుంచి వచ్చారనే ముద్ర వేసి జిల్లాలో మొక్కుబడిగా కార్యక్రమాలకు ఆహ్వానించారని గుర్తు చేస్తున్నారు. సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో విసుగు చెందిన రమేశ్.. జనవరి 26వ తేదీన బీజేపీకి రాం రాం చెప్పారు. బీఆర్ఎస్ నాయకత్వం నుంచి ఆహ్వానం రావడంతో ఆలోచించకుండా తిరిగి మాజీ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో పార్టీలో చేరారు. బీజేపీలో చేరినా ఏనాడు కూడా మాజీ సీఎం కేసీఆర్, ముఖ్య నాయకులను పల్తెత్తు విమర్శలు చేయలేదని, గౌరవంగా వ్యవహరించారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కితాబునిచ్చారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలకు ముందు బీజేపీలో కీలకంగా వ్యవహరించిన శ్రీగణేష్ అకస్మాత్తుగా పార్టీని వీడారు. ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరి ఉప ఎన్నికలో అభ్యర్థిగా నిలబడి.. గెలుపొందారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు పలువురు నాయకులు తప్పని పరిస్థితుల్లో బీజేపీని వీడారు. మాజీ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి.. బీజేపీని వీడక తప్పలేదు. కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడుతున్నా చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్ర వహించడంతో విసుగు చెందిన విజయశాంతి పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఆమె ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. 2021 సంవత్సరంలో మాజీ మంత్రి, సీనియర్ దళిత నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు కూడా రాజీనామా సమర్పించి బీఆర్ఎస్ కండువా కప్పుకొన్న విషయం తెలిసిందే. ఆర్మూరు పార్టీ ఇన్‌చార్జ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి తీవ్ర నిరాశతో 2023లో పార్టీకి రాజీనామా సమర్పించారు. రాష్ట్ర నాయకుల గ్రూపు రాజకీయాలతో విసుగు చెందిన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ గతేడాది జూన్ నెలలో బీజేపీ కి గుడ్ బై చెప్పారు. ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా సమర్పించగా ఆమోదం తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్.రామచందర్ రావు నియామకం తనను షాక్ కు గురిచేసిందని, నిరాశకు గురి చేసిందన తన రాజీనామా లేఖలో ప్రస్తావించారు. అయితే తాను హిందుత్వ భావజాలానికి కట్టుబడి ఉన్నానని, హిందూ సమాజంతో నిలబడతానని కూడా ఆయన స్పష్టం చేశారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి పలువురి వలసలు కొనసాగాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి మునుగోడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆర్టీసీ కార్మిక సంఘం నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన అశ్వత్థామ రెడ్డికి వనపర్తి టికెట్ కేటాయించినప్పటికీ ఆయన పోటీ నుంచి వైదొలిగిన విషయం విదితమే. ఆ తరువాత పార్టీకి రాజీనామా చేశారు కూడా. ఇదే సమయంలో కరీంనగర్ జిల్లాలో కటకం మృత్యుంజయం బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. అంతకు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఇలా ఎందరో నాయకులు పార్టీని వీడుతున్నా కనీసం అడ్డుకునేందుకు రాష్ట్ర నాయకత్వం కాని, కేంద్రం నాయకత్వం కాని పట్టించుకున్న దాఖలాలు లేవు. కనీసం అసంతృప్త నేతలను బుజ్జగించే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఇలా చెప్పుకొంటూ పోతే చాంతాడంత మంది బీజేపీ కి గుడ్ బై చెప్పే కాంగ్రెస్, బీఆర్ఎస్ లో చేరుతున్నారు.
2029 లేదా ముందస్తుగా కేంద్రంలో జమిలీ ఎన్నికలు జరిగితే బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై పలువురు నాయకులు ఎవరికి వారుగా అంచనాలు వేసుకుంటున్నారు. గత రెండు పర్యాయాలు ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ.. మొన్నటి ఎన్నికల్లో సాధారణ మెజార్టీ కూడా సాధించలేక పోయింది. టీడీపీ, జేడీయూ కీలక మద్దతుతో పరువు నిలబెట్టుకుంది. ఈ నేపథ్యంలో నాలుగోసారి అధికార పీఠం కైవసం చేసుకుంటుందా? పరాజయం పాలవుతుందా? అనే దానిపై కూడికలు, తీసివేతలు వేసుకునే పనిలో అసంతృప్త నేతలు ఉన్నారనే చర్చలు వినిపిస్తున్నాయి. చాలా మంది నాయకులు మౌనంగా, గుంభనంగా ఉంటున్నారు. ఎక్కడ కూడా తమ అసంతృప్తిని వెళ్లగక్కడం లేదు, ఢిల్లీ పెద్దల వద్ద ప్రస్తావించడం లేదు. ఒక వేళ కేంద్రంలో అధికారం వస్తుందంటే కొనసాగుతారని, లేదంటే పార్టీకి గుడ్ బై చెప్పి సొంత గూటికి వెళ్లడం లేదా మరో పార్టీని చూసుకోవడం జరుగుతుందని ఒక సీనియర్ నాయకుడు తెలిపారు. ఇప్పటికైనా ఢిల్లీ పెద్దలు రాష్ట్ర పార్టీ లో అంతర్గత లుకలుకలు, ఆధిపత్య పోరుపై కన్నేయాలని కొందరు నాయకులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
MAG7 Job Cuts | ఆ కంపెనీల టెకీలకు ఏఐ సెగ.. లక్షల్లో లేఆఫ్స్?
Baggage Rules 2026 | విదేశాల నుంచి ఎంత బంగారం తెచ్చుకోవచ్చు? కొత్త బ్యాగేజ్ రూల్స్
Income vs Expenses | నీది నాది ఒకటే కథ!!! నెలాఖరుకల్లా ఖాతాలు ఖాళీ.. సీక్రెట్ ఇదే!
