జూబ్లీహిల్స్ అభ్యర్థిపై కసరత్తు పూర్తి.. ముగ్గురి పేర్లతో బీజేపీ షార్ట్ లిస్ట్‌ ..ఢిల్లీకి రామచందర్ రావు

త్రిమెన్ కమిటీ సిఫారసు చేసిన పేర్లలో ఎల్.దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, డాక్టర్ పద్మ పేర్లను షార్ట్ లిస్ట్ చేసి బీజేపీ జాతీయ నాయకత్వానికి పంపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు శనివారం ఢిల్లీకి వెళ్లి జాతీయ నాయకత్వంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై చర్చిస్తారు

  • By: Tech |    telangana |    Published on : Oct 10, 2025 11:10 PM IST
జూబ్లీహిల్స్ అభ్యర్థిపై కసరత్తు పూర్తి.. ముగ్గురి పేర్లతో బీజేపీ షార్ట్ లిస్ట్‌ ..ఢిల్లీకి రామచందర్ రావు

హైదరాబాద్, అక్టోబర్ 10 (విధాత ప్రతినిధి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బరిలోకి దింపే అభ్యర్థి ఎంపిక కసరత్తును బీజేపీ రాష్ట్ర నాయకత్వం పూర్తి చేసింది. ముగ్గురి పేర్లను షార్ట్ లిస్ట్ చేసింది. ఈ జాబితాలో ఎల్.దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, డాక్టర్ పద్మ పేర్లు ఉన్నాయని తెలుస్తోంది. ఈ పేర్లను బీజేపీ జాతీయ నాయకత్వానికి పంపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు ఇతర అంశాలపై పార్టీ అధిష్టానంతో చర్చించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు శనివారం న్యూఢిల్లీ వెళ్లనున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బరిలోకి దింపే అభ్యర్థి విషయమై పార్టీ ఎన్నికల కమిటీ గురువారం సమావేశమైంది. ఈ సమావేశంలో త్రిమెన్ కమిటీ సిఫారసు చేసిన నలుగురి పేర్లపై చర్చించారు. ఈ సమావేశానికి కొనసాగింపుగా శుక్రవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మరోవైపు ఎవరిని బరిలోకి దింపితే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయనే దానిపై చర్చించారు. ప్రస్తుతం ప్రత్యర్థి పార్టీల నుంచి బరిలో ఉన్న అభ్యర్థులను ధీటుగా ఎదుర్కోవాలంటే ఎవరిని రంగంలోకి దింపాలనే దానిపై ఈ సమావేశంలో చర్చించారు. త్రిమెన్ కమిటీ సిఫారసు చేసిన పేర్లలో ఎల్.దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, డాక్టర్ పద్మ పేర్లను షార్ట్ లిస్ట్ చేసి బీజేపీ జాతీయ నాయకత్వానికి పంపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు శనివారం ఢిల్లీకి వెళ్లి జాతీయ నాయకత్వంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై చర్చిస్తారు. కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఉంది. దీంతో ఈ అసెంబ్లీ ఉప ఎన్నికను బీజేపీ సీరియస్ గా తీసుకుంది. ఈ స్థానాన్ని దక్కించుకోవాలని ఆ పార్టీ ప్రణాళికలు సిద్దం చేస్తోంది.