MLA Rajasingh | బీజేపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా

పార్టీ సింబల్ మీద గెలిచాను. ఇప్పుడు బీజేపీకి చెందిన ఎమ్మెల్యే కానందున నా సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్ కు ఈ లేఖను పంపించాలి. మీకో దండం.. మీ పార్టీ కో దండం.. లేఖలో రాజాసింగ్‌

  • By: TAAZ    news    Jun 30, 2025 5:46 PM IST
MLA Rajasingh | బీజేపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా

MLA Rajasingh | తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నిక సీనియర్ నాయకుడు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాకు దారితీసింది. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన రాజాసింగ్ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు మద్దతుదారులతో వచ్చారు. నామినేషన్ వేసేందుకు అవసరమైన 10మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల మద్దతుదారులతో రాజాసింగ్ కు కార్యాలయానికి వెళ్లారు. అక్కడున్న వారు రాజాసింగ్ మద్దతుదారులను బెదిరించడంతో వారు వెనక్కి తగ్గారు. దీంతో ఆగ్రహించిన రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా సంచలన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడూతూ తనను నామినేషన్ వేయకుండా అడ్డుకున్నందుకు నిరసనగా పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. 10మంది మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల మద్దతు సంతకాలు కావాల్సి ఉండగా..బెదిరింపుల కారణంగా ముగ్గరు మాత్రమే సంతకాలు చేశారని తెలిపారు. నిరసనగా పార్టీకి నా రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డికి అందించానని తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పదవికి ఎవరికి ఇవ్వాలో ముందే డిసైడ్ చేశారన్నారు. రామచందర్ రావుకు అధ్యక్ష పదవి ఇవ్వడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ అధిష్టానం ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, నడ్డాలు దీనిపై పునారాలోచన చేయాలని కోరారు. రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని..పార్టీలో ఎమ్మెల్యేలు, ఎంపీలలో అధ్యక్ష పదవికి సమర్ధులైన వారు ఉన్నారన్నారని గుర్తు చేశారు.

కిషన్ రెడ్డికి ఇచ్చిన లేఖలో.. తాను పార్టీ సింబల్ మీద గెలిచానని..తాను ఇప్పుడు బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కానందునా నా సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్ కు ఈ లేఖను పంపించాలని కోరడం జరిగిందని రాజాసింగ్ తెలిపారు. మీకో దండం.. మీ పార్టీ కో దండం అంటూ లవ్ లేటర్ ఇచ్చానని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. నేను బీజేపీలో చేరినప్పటి 2014నుంచి నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని..టెర్రరిస్టులకు నేను, నా కుటుంబం టార్గెట్ గా మారామన్నారు. అయినా పార్టీ నుంచి నాకు సహకారం కరువైందని వాపోయారు. పార్టీ కోసం సర్వం ధారపోశానని.. ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. కొందరు నేతలు వ్యక్తిగత ప్రయోజనాలతో పార్టీకి నష్టం చేస్తున్నారన్నారు. తెలంగాణలో బీజేపీ రావాలని మేం పోరాడుతుంటే..రాకుండా ఉండేందుకు పార్టీలోని పెద్ద నాయకులు అడ్డుపడుతున్నారన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావద్దని కోరుకునే వారే పార్టీలో ఎక్కువయ్యారన్నారు. లక్షలాది మంది కార్యకర్తల బాధను ప్రతిబింబించే రాజానామా ఇది అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. బీజేపీ రాజీనామా చేసినా తాను భవిష్యత్తులో హిందుత్వం, సనాతన ధర్మం, గో రక్షణకు పోరాటాలు కొనసాగిస్తానన్నారు. గోషా మహాల్ ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు.