రాజాసింగ్ రాజీనామాకు బీజేపీ హైకమాండ్ ఆమోదం

రాజాసింగ్ రాజీనామాకు బీజేపీ హైకమాండ్ ఆమోదం

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంపై సస్పెన్స్

విధాత, హైదరాబాద్ : బీజేపీ సీనియర్ నేత, గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి ఇటీవల చేసిన రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ. నడ్డా ఆమోదించారు. ఇటీవల పార్టీ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడిగా రామచందర్ రావు ఎన్నికను వ్యతిరేకిస్తూ రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. రాజీనామా లేఖను అప్పటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అందించారు. ఆయన రాజాసింగ్ రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడికి పంపించారు. రాజాసింగ్ రాజీనామాలను జేపీ నడ్డా ఆమోదించారు. ప్రస్తుతం రాజాసింగ్ అమర్ నాథ్ యాత్రలో ఉన్నారు.

తన రాజీనామాను బీజేపీ అధిష్టానం అమోదించిన నేపథ్యంలో రాజాసింగ్ స్పందన ఏమిటన్నది తెలియరాలేదు. అయితే ఆయన గోషామహల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా లేదా అన్నదానిపై ఆయన స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఒకవేళ గోషామహల్ ఎమ్మెల్యే పదవికి రాజాసింగ్ రాజీనామా చేస్తే జూబ్లీహిల్స్ ఉపఎన్నికతో పాటు ఆ స్థానాకిని కూడా ఉప ఎన్నిక వచ్చే అవకాశం లేకపోలేదు.

రాజాసింగ్:  చివరి శ్వాస వరకు హిందుత్వం కోసం పనిచేస్తా 

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కష్టపడ్డ లక్షలాదిమంది బీజేపీ కార్యకర్తల బాధను నా రాజీనామా ద్వారా ఢిల్లీకి తెలియజేయలేకపోయానని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. అమర్ నాధ్ యాత్రలో ఉన్న రాజాసింగ్ బీజేపీ హైకమాండ్ తన రాజీనామాను ఆమోదించడంపై స్పందించారు. చివరి శ్వాస వరకు హిందుత్వం కోసం పనిచేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. పదవి, అధికారం కోసం రాజీనామా నిర్ణయం తీసుకోలేదన్నారు. 11ఏండ్ల క్రితం నేను బీజేపీలో చేరాను..ప్రజలకు సేవ చేసేందుకు, హిందుత్వాన్ని రక్షించేందుకే బీజేపీలో చేరానని స్పష్టం చేశారు. బీజపీ నాయకత్వం నన్ను నమ్మి మూడుసార్లు గోషామహల్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందన్నారు. నాపై నమ్మకం ఉంచిన బీజేపీ నేతలు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.