Aroori Ramesh | బీఆర్​ ఎస్ లోకి అ​రూరి పునరాగమనంలో ఆంతర్యం!?

వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, తాజా మాజీ బీజేపీ నాయకుడు అరూరి రమేష్ తిరిగి బీఆర్ఎస్ లో చేరడం వెనుక అంతర్యమేమిటనేది ఆసక్తికరంగా మారింది. లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసిన అరూరి రమేష్ రెండేళ్ళ తర్వాత ఆకస్మికంగా ‘తన ఇంటి పార్టీ’ అంటూ బీఆర్ ఎస్ లో చేరేందుకు సిద్ధం కావడం వెనుక

  • By: Tech |    telangana |    Published on : Jan 27, 2026 10:14 PM IST
Aroori Ramesh | బీఆర్​ ఎస్ లోకి అ​రూరి పునరాగమనంలో ఆంతర్యం!?
  • బీఆర్​ ఎస్ లోకి అ​రూరి పునరాగమనంలో ఆంతర్యం!?
  • స్టేషన్ ఘన్ పూర్ ఉప ఎన్నికలొస్తే అవకాశం
  • అరూరి పై రాజకీయపక్షాల అనేక ఆరోపణలు
  • తాటికొండకు మరోసారి నో ఛాన్స్ ?
  • రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ

విధాత, ప్రత్యేక ప్రతినిధి: వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, తాజా మాజీ బీజేపీ నాయకుడు అరూరి రమేష్ తిరిగి బీఆర్ఎస్ లో చేరడం వెనుక అంతర్యమేమిటనేది ఆసక్తికరంగా మారింది. లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసిన అరూరి రమేష్ రెండేళ్ళ తర్వాత ఆకస్మికంగా ‘తన ఇంటి పార్టీ’ అంటూ బీఆర్ ఎస్ లో చేరేందుకు సిద్ధం కావడం వెనుక ఏదో మతలబు ఉందంటున్నారు. మరోవైపు ఆయన బీజేపీలో ఇమడలేకపోయారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా బీఆర్ఎస్ అధిష్టానం ఆహ్వానం మేరకే తాను తిరిగి ఆ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించడం విశేషం.

స్థానికేతరుడు అయినప్పటికీ, అప్పటి టీఆర్ఎస్ వర్ధన్నపేట నియోజకవర్గ ఇంచార్జ్, పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన ఉద్యమకారుడు పసునూరి దయాకర్ ను కాదని అరూరి రమేష్ కు ఎస్సీ రిజర్వుడు ఈ స్థానంలో అప్పటి టీఆర్ఎస్ అవకాశం కల్పించింది. పైగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత వచ్చిన తొలి ఎన్నికల్లో ఈ ఛాన్స్ కల్పించారు. దీంతో అరూరి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించారు. అక్కడి నుంచే రెండవ పర్యాయం కూడా పెద్ద మెజార్టీతో గెలుపొందారు. మూడవసారి కూడా పార్టీ పోటీకి అవకాశం ఇస్తే అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ నాగరాజు చేతిలో ఓడిపోయారు. ఈ మధ్యకాలంలో అరూరి పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. నియోజకవర్గంలో అనేక భూములు కబ్జా చేశారని విపక్షాలతోపాటు వివిధ ప్రసార మాధ్యమాల్లో విపరీత ప్రచారం సాగింది. వీటితో పాటు కొన్ని నైతికపరమైన అంశాలపై కూడా జోరుగా ఆరోపణలు వచ్చాయి. కారణాలేవైనా ఆయన ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత వచ్చిన లోక్ సభ ఎన్నికల్లో వరంగల్ ఎంపీ అభ్యర్ధిత్వాన్ని అరూరి ఆశించారు. బీఆర్ఎస్ అధిష్టానం సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ తో పాటు అరూరి రమేష్ కు టికెట్ ఇవ్వకుండా కడియం శ్రీహరి కుమార్తె డాక్టర్ కావ్యను బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించారు. దీంతో అరూరి బీజేపీలో చేరిపోయారు. అయితే రాజకీయ పరిణామాల నేపథ్యంలో కడియం కాంగ్రెస్ లో చేరడం, కావ్య టికెట్ నిరాకరించడంతో మరొకరికి అవకాశం లభించింది. లోక్ సభ ఎన్నికల సందర్భంగా కడియం పై అరూరి తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా రెండేళ్ళ తర్వాత అరూరి తిరిగి బీఆర్ఎస్ లో చేరడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా కొద్ది రోజుల క్రితమే బీజేపీకి చెందిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వరంగల్ పర్యటన సందర్భంగా కూడా రమేష్ హడావిడి చేశారు. ఈ కొద్ది కాలంలోనే ఆయన తిరిగి బీఆర్ఎస్ లో చేరేందుకు నిర్ణయించుకోవడం, ఈ మధ్యలో జరిగిన మార్పులేమిటని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. త్వరలో మునిసిపల్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆయన తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరాలని నిర్ణయించుకోవడం గమనార్హం.

అరూరి ఆగమనంలో అంతర్యం?

ఆరూరి రమేష్ బీఆర్ఎస్ కు రాజీనామా చేసినప్పటి నుంచి ఆ పార్టీ వర్ధన్నపేటనియోజకవర్గానికి ఎవరిని నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించలేదు. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైన వర్ధన్నపేట ఇన్చార్జి బాధ్యతలను ఆరూరి రాజీనామా చేసినప్పటి నుంచి మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిర్వహిస్తున్నారు. తాజాగా ఆరూరి తిరిగి బీఆర్ఎస్ లో చేరడంతో వర్ధన్నపేట ఇన్చార్జి బాధ్యతలు తిరిగి ఆయనకు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు.

ఉప ఎన్నికలొస్తే ఆయనే అభ్యర్ధా?

స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ పరిధిలోని ఉప్పుగల్లు ఆరూరి సొంత ఊరు. కాంట్రాక్టరుగా, టిడిపి నాయకునిగా ఆ ప్రాంతంలో కడియం అనుచరుడిగా పనిచేశారు. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల్లో టిడిపికి రాజీనామా చేసి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. స్టేషన్ ఘన్ పూర్ నుంచి పీఆర్పీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమిపాలైన గత చరిత్ర కూడా ఆరూరికి ఉంది. తాజాగా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. కడియం పార్టీ మారిన అంశం ప్రస్తుతం శాసనసభ స్పీకర్ పరిధిలో ఉంది. కడియం పై అనర్హత వేటువేయకముందే ఆయన రాజీనామా చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ఒక చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో అనూహ్య పరిణామాల నేపథ్యంలో కడియం ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ స్థానం నుంచి ఆరూరికి ఏమైనా బీఆర్ఎస్ అవకాశం కలిపిస్తుందా? అనే చర్చ అప్పుడే ప్రారంభమైంది. ఈ స్థానం కూడా ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కావడం గమనార్హం. ఉప ఎన్నిక వస్తే ఈ స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు కేటాయిస్తారా లేదా అని అనుమానాలు ఆ పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న రాజయ్యను కాదని కడియం శ్రీహరికి అవకాశం ఇచ్చిన విషయం గమనార్హం. కడియానికి ధీటైన అభ్యర్ధిగా, ఆర్ధికంగా బలంగా ఉన్న అరూరి అయితే బాగుంటుందనే ముందస్తు ప్రణాళికలో భాగంగా అరూరికి ఒక ఛాన్స్ ఇచ్చే ఛాన్స్ లేకపోలేదు అంటున్నారు. ఈ కారణంగానే అరూరిని బీఆర్ ఎస్ లో చేర్చుకునేందుకు సిద్ధమైనట్లు ఒక చర్చ సాగుతోంది. ఇదే జరిగితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానంలో టికెట్ దక్కని రాజయ్య పరిస్థితి దయనీయంగా మారే అవకాశం ఉందంటున్నారు. స్టేషన్ ఉప ఎన్నిక వస్తోందనీ, తానే పోటీ చేసి గెలుస్తనని రాజయ్య గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ స్థితిలో అరూరి చేరిక రాజయ్యకు చెక్ పెట్టేందుకేననే ఒక చర్చ సాగుతోంది. ఇప్పటికే కడియం కూడా రాజయ్యకు గతంలోనే బీఆర్ఎస్ అధిష్టానం మొండిచెయ్యి ఇచ్చారని, ఈ సారి కూడా అదే జరుగుతోందని ప్రచారం చేస్తున్నారు. ఈ స్థితిలో అరూరి రాకతో అనుమానాలు పెరుగుతున్నాయి. ఇదిలా ఉండగా అరూరి పై గతంలో అనేక ఆరోపణలు రాగా, మరోసారి ఈ సందర్భంగా తెరపైకి వచ్చే అవకాశం ఉందనీ, మూడు పార్టీలు మారిన ఆయన బీఆర్ఎస్ ను ఇంటిపార్టీగా పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని ఆయనంటే గిట్టని వారు వ్యాఖ్యానిస్తున్నారు

 

ఇవి కూడా చదవండి :

kavitha : సీఎం రేవంత్‌రెడ్డికి సంతోష్ రావు గూఢచారి

Komatireddy Venkat Reddy : నేను విద్యాశాఖ మంత్రినైతే కార్పొరేట్‌ స్కూళ్లను బంద్ చేస్తా

Mother of All Deals | భారత్–ఈయూ వాణిజ్య ఒప్పందం: ’మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా చరిత్రలో నిలిచిపోయే ఘట్టం