Komatireddy Venkat Reddy : నేను విద్యాశాఖ మంత్రినైతే కార్పొరేట్‌ స్కూళ్లను బంద్ చేస్తా

విద్యాశాఖ మంత్రినైతే కార్పోరేట్ స్కూళ్లను బంద్ చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Komatireddy Venkat Reddy : నేను విద్యాశాఖ మంత్రినైతే కార్పొరేట్‌ స్కూళ్లను బంద్ చేస్తా

విధాత: నేను విద్యాశాఖ మంత్రినైతే మాత్రం కార్పొరేట్‌ స్కూళ్లను బంద్ చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తన దివంగత కుమారుడు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన “ప్రతీక్” ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10కోట్ల వ్యయంతో ఆధునాతన వసతులతో నిర్మించిన నల్లగొండ “బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలను” మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్ లు, లైబ్రరీ, ఆడిటోరియం, ఇండోర్ స్టేడియంలతో 3 అంతస్తుల్లో నిర్మించిన పాఠశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దేశానికే ఆదర్శంగా ప్రతీక్ ఫౌండేషన్ ప్రభుత్వ స్కూల్ ను తీర్చిదిద్దుతానన్నారు.బొట్టు గూడా పాఠశాలలో ఇండోర్ గేమ్స్, కంప్యూటర్ ల్యాబ్స్ ,యోగా సెంటర్ ఏర్పాటు చేశామని, ప్రతి తరగతి గదిలో ఏసి ఉందని, 45కంప్యూటర్లు ఉన్నాయని, అన్ని రకాల పోటీలు ఎదుర్కొనేలా విద్యార్థులను తీర్చిదిద్దుతాం అని, ఆణిముత్యాల లాంటి విద్యార్థులను, ఐఏఎస్, ఐపీఎస్, సైంటిస్టులు తయారు చేస్తాం అన్నారు. అవసరమైతే అదనపు భవనాలను కట్టిస్తానని, నల్లగొండ అభివృద్ది కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నాను..విద్యా,మంచి వైద్యం నా మొదటి ప్రాధాన్యత అని తెలిపారు. నా గుండె కాయ లాంటి ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి చేసి ఈ ప్రాంత రైతులకు తాగు,సాగునీరు అందిస్తాం అన్నారు.

దోపిడీ కేంద్రాలుగా మారిన కార్పొరేట్‌ విద్యాసంస్ధలు

నారాయణ, చైతన్య వంటి కాలేజీలలో కంటే కూడా ప్రభుత్వ విద్యాసంస్థలలోనే నాణ్యమైన, ఉన్నత విద్యావంతులైన ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఉన్నారన్నారు. విద్యా వ్యాపారం కాదు అని, కార్పోరేట్ విద్యా సంస్థలు పేదలను దోచుకుంటున్నాయన్నారు. మేం ఫోన్ చేస్తే ఫీజు ఎక్కువ చేప్పి..తక్కువ చేసినట్లుగా మాటలు చెప్పి మమ్మల్ని, తల్లిదండ్రులను, విద్యార్థులను అందరినీ మోసం చేస్తున్నారన్నారు.

ఆరోగ్యం సహకరిస్తేనే వచ్చే ఎన్నికల్లో పోటీ

తాను నీతి నిజాయితీతో బతికానని, ఆరోగ్యం సహకరిస్తే వచ్చే ఎన్నికల్లో నల్లగొండ నుండే పోటీచేస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన విద్య అందించాలని నిర్ణయం తీసుకుందని, అభివృద్ధి కోసం తాను ఏది అడిగినా సీఎం రేవంత్ రెడ్డి కాదనరని తెలిపారు. నల్లగొండ మున్సిపాలిటీనీ అభివృద్ధి చేసేందుకే కార్పొరేషన్ గా మార్చినట్లుగా తెలిపారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి నల్లగొండ కార్పొరేషన్ ను అభివృద్ధి చేస్తానని, నల్లగొండ పట్టణంలో.. 6 నెలల్లో 24 గంటలు తాగునీరు అందిస్తానని, కొడంగల్ కు ఎన్ని నిధులు ఇస్తే.. నా నియోజకవర్గానికి అన్ని నిధులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్లుగా వెంకట్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ ,ఎమ్మెల్సీ శంకర్ నాయక్, లైబ్రరీ చైర్మన్ ఆఫీజ్ ఖాన్,అదనపు కలెక్టర్లు జె. శ్రీనివాస్ ,అశోక్ రెడ్డిలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

Komatireddy Venkat Reddy : కొడుకు పేరుతో హైటెక్ స్కూల్ ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి

Telangana Municipal Election Schedule : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల