Komatireddy Venkat Reddy vs Punna Kailash : పుర పోరులో… మంత్రి కోమటిరెడ్డి వర్సెస్ పున్న కైలాష్
నల్లగొండ కాంగ్రెస్‌లో మంత్రి కోమటిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ మధ్య రాజకీయ ఆధిపత్య పోరు మున్సిపల్ ఎన్నికల ముందే ఘర్షణకెక్కింది.
విధాత : నల్లగొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న కైలాష్ నేతకు మధ్య రాజకీయ ఆధిపత్య పోరు కొనసాగుతుంది. తన అనుచరుడు గుమ్ముల మోహన్ రెడ్డికి రావాల్సిన డీసీసీ అధ్యక్ష పదవిని కైలాష్ ఎగరేసుకుపోవడాన్ని అవమానంగా భావించిన వెంకట్ రెడ్డి పార్టీ వ్యవహారాల్లో ఆయనను పక్కన పెడుతూ సొంత నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు.
డీసీసీ అధ్యక్షుడిగా పున్న కైలాష్ ను గుర్తించడానికి ఇష్టపడని వెంకట్ రెడ్డి తను హాజరయ్యే కార్యక్రమాలకు ఆయనను దూరం పెడుతున్నారు. గతంలో తనను, తన కుటుంబాన్ని అసభ్య పదజాలంతో దూషించిన పున్న కైలాష్ ను డీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి..మరొకరిని నియమించాలని, అతనిపై పోలీసు కేసు కూడా నమోదు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి వెంకట్ రెడ్డి లేఖ కూడా రాశారు. అయితే అధిష్టానం సూచనతో కైలాష్ నేత గతంలో వెంకట్ రెడ్డిపై చేసిన విమర్శల పట్ల బహిరంగ క్షమాపణలు చెప్పారు. అయినప్పటికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం పున్న కైలాష్ విషయంలో ఏ మాత్రం మెత్తబడకుండా కఠినంగా వ్యవహరిస్తున్నారు.
మరోవైపు డీసీసీ అధ్యక్షుడి నియామకంలో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించకపోవడమే కాకుండా.. బీసీ నేతను అవమానిస్తున్నారంటూ పార్టీలో వెంకట్ రెడ్డి వ్యతిరేక వర్గం ఆయనపై మండిపడుతుంది. జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో బలమైన ఆధిపత్య నేతగా కొనసాగుతున్న మంత్రి వెంకట్ రెడ్డిని ఢీకొని పార్టీలో తన ఉనికిని, డీసీసీ అధ్యక్షుడిగా తన అధికారాలను చాటడం కైలాష్ కు సవాల్ మారింది. తాజాగా మున్సిపల్ ఎన్నికల సందర్బంగా మరోసారి ఇరువురి మధ్య ఆధిపత్య రాజకీయాలు మరింత ముదిరాయి.
మున్సిపల్ ఎన్నికల్లో నేరుగా బీ ఫామ్ ల పంపిణీ
జిల్లాల్లో మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాల్టీలకు ఎన్నికలు జరుగుతున్న క్రమంలో మంత్రి వెంకట్ రెడ్డికి, డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ కు మధ్య విబేధాలు మరోసారి రచ్చకెక్కాయి. కార్పొరేషన్ ,మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేయనున్న కాంగ్రెస్ అభ్యర్థులుకు డీసీసీ అధ్యక్షుడి ద్వారా బీఫామ్ లు ఇవ్వాల్సి ఉంది. అయితే మంత్రి వెంకట్ రెడ్డి డీసీసీ అధ్యక్షుడు కైలాష్ ను కాదని మాజీ డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ద్వారా పార్టీ అభ్యర్థులకు బీ ఫామ్ లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీంతో డీసీసీ అధ్యక్షుడిగా పున్న కైలాష్ ను డమ్మీ చేసి నామమాత్రంగా చేస్తూ బీసీ నేతను అవమానిస్తున్నారంటూ కైలాష్ వర్గం మండిపడుతుంది. సీనియర్ నేతగా, మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ నిర్ణయాలను, నియమాలను గౌరవించకుండా డీసీసీ అధ్యక్షుడి అధికారాలను పట్టించుకోకపోవడం ఆయనకే మంచిది కాదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Economic Survey : ఆర్థిక సర్వే అంటే ఏంటి.. బడ్జెట్‌కు ముందు ఎందుకు ప్రవేశపెడతారు..?
Divya Bharathi | సోఫాపై అందాల దివ్య భారతి హాట్ షో.. ఆ లుక్స్‌కు ఎవరైనా పడిపోవాల్సిందే!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram