కోకాపేటకు మించి హయత్ నగర్ వైపు అభివృద్ది : మంత్రి వెంకట్ రెడ్డి

హయత్ నగర్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం ప్రాంతాలు రానున్న రోజుల్లో కోకాపేట కంటే ఎక్కువ డిమాండ్ ఉన్న ప్రాంతాలుగా మారుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

కోకాపేటకు మించి హయత్ నగర్ వైపు అభివృద్ది : మంత్రి వెంకట్ రెడ్డి

విధాత, హైదరాబాద్ : రానున్న రోజుల్లో విజయవాడ హైవే మార్గం వెంట హయత్ నగర్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం ప్రాంతాలు కోకాపేటకు మించి డిమాండ్ ఉన్న ప్రాంతాలుగా మారుతాయని తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం హయత్ నగర్ సాయిబాబా ఆలయం (తొర్రూర్ ఎక్స్ రోడ్) నుంచి జీ(ZEE) స్కూల్ వరకు సుమారు రూ.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 2-లేన్ నుంచి 4-లేన్ రహదారి విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ రేడియో స్టేషన్ వరకు 6 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. రూ. 940 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ. 200 కోట్లు కేటాయించిందని తెలిపారు. ఈ కారిడార్‌లో పైన మెట్రో రైలు, మధ్యలో నేషనల్ హైవే, కింద స్థానిక వాహనాల కోసం వెహికిల్ అండర్ పాస్ లు రాబోతున్నాయని పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్ – విజయవాడ 10-లేన్ల రహదారి పనులను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, ముంబై-పూణే నగరాలను కలుపుతూ మూడు హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ఈ ప్రాంతం నుంచే రాబోతున్నాయని మంత్రి తెలిపారు. పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా, ప్రజా అవసరాల మేరకు రాజధానిలో పలు కీలక రహదారుల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు.

తెల్ల రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. మూసీ ప్రక్షాళనపై ప్రతిపక్షాల విమర్శలను ఈ సందర్బంగా వెంకట్ రెడ్డి కొట్టిపారేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు మూసీ కాలుష్యం, ఫ్లోరైడ్ వంటి సమస్యతో సతమతమవుతున్నారని, ఇక్కడి ప్రజల గోసను మానవత్వంతో అర్థం చేసుకుని మూసీ ప్రక్షాళనకు అంతా సహకరించాలని కోరారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు భవిష్యత్తు తరాలకు మేలు చేస్తుందని స్పష్టం చేశారు. నిర్వాసితులకు ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్, పలువురు కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

ఏపీలో ఉద్యోగుల అల్టిమేటమ్!..తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ !!

Hyderabad | హైద‌రాబాద్ న‌గ‌రంలో మ‌రో భారీ అగ్నిప్ర‌మాదం..