ఏపీలో ఉద్యోగుల అల్టిమేటమ్!..తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ !!

ఏపీలో పీఆర్సీ, ఐఆర్ ప్రకటనపై ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి అల్టిమేటమ్ ఇచ్చాయి. ఇదే సమయంలో తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఏపీలో ఉద్యోగుల అల్టిమేటమ్!..తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ !!

విధాత : ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు వేసవి ఎండల కంటే అధికంగా సమ్మెల సెగలు హీట్ పెంచుతున్నాయి. ఉగాది నాటికి పీఆర్సీ(PRC), ఐఆర్(IR)పై ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ.. ఏపీ ప్రభుత్వానికి ఏపీ గవర్నమెంట్ ఎంఫ్లాయిస్ ఫెడరేషణ్(APGEF) అల్టిమేటమ్ ఇవ్వడం కలకలం రేపింది. ఉద్యోగ సంఘాల డిమాండ్లను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇవ్వాల్సిన నాలుగు డీఏలు పెండింగ్ ఉన్నాయని, ఇన్ని డిఏలు ఏ రాష్ట్రంలో పెండింగ్ లో లేవని ఆందోళన వ్యక్తం చేసింది.

ఇప్పటికే చాలా నష్టపోయామని, చాలా భరించామని, వెంటనే పీఆర్సీ , ఐఆర్ లపై ప్రకటన చేయాలని, పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని కోరింది. లేదంటే అన్ని సంఘాలను కలుపుకొని పాతిక లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాలతో భారీ ఉద్యమం చేస్తామని హెచ్చరించింది.

తెలంగాణలో ఆర్టీసీలో సమ్మె సైరన్ ?

తెలంగాణలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీ ఆర్టీసీ) కార్మికులు సమ్మెకు సిద్దమైనట్లుగా సమాచారం. ఆర్టీసీ ఎండీకి సమ్మె నోటీస్ సైతం అందించినట్లుగా తెలుస్తుంది. సమ్మె చేపడితే తమ మద్దతు ఉంటుందని ఇప్పటికే ప్రతిపక్షాలు సైతం ప్రకటించడం గమనార్హం. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే సమ్మె తప్ప మరో మార్గం లేదని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్ రెడ్డిలు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నామని, కొత్త డిమాండ్లను పెట్టడం లేదని గుర్తు చేస్తున్నారు. అలాగే ఆర్టీసీ డిపోలు, స్థలాలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే విధానాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నామని తెలిపారు. మరి ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రకటన చేస్తుందా? లేక కార్మికులు సమ్మె బాటలో సాగిపోతారా ? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి :

కిమ్ మామా అలజడి: నార్త్ కొరియా బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగం
దారుణం..పెళ్లికి నిరాకరించిన యువతికి ఎయిడ్స్ ఇంజక్షన్!