Meta Layoffs : ఏఐ ఎఫెక్ట్.. మెటాలో 16వేల మంది ఉద్యోగాల తొలగింపు ?

ఏఐ పెట్టుబడులు పెంచుతున్న నేపథ్యంలో మెటా సంస్థ దాదాపు 16 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు టెక్ రంగంలో ఆందోళన కలిగిస్తున్నాయి.

Meta Layoffs : ఏఐ ఎఫెక్ట్.. మెటాలో 16వేల మంది ఉద్యోగాల తొలగింపు ?

విధాత : ఏఐ(AI) రాకతో టెక్ రంగంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా మానవ వనరుల వినియోగం స్థానంలో ఏఐ సాంకేతికత వినియోగంతో భారీగా ఉద్యోగాలకు కోత పడుతుంది. ఏఐతో ఉద్యోగాలు పోతాయనే ఆందోళనలు ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రముఖ కంపెనీలు ఉద్యోగాలలో కోతలు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా భారీ ఎత్తున లేఆఫ్‌లకు సిద్ధమైనట్లు సమాచారం.

దాదాపు 16 వేల మంది ఉద్యోగుల తొలగింపుకు మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని మెటా సిద్దమైనట్లుగా వెలువడుతున్న వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. దాదాపు 20 శాతం మందిని తొలగించాలని మెటా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫేస్‌బుక్ మెటాలో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య 79 వేలుగా ఉంది. దాదాపు 16వేల మందికి లేఆఫ్‌లు ఇవ్వాలని కంపెనీ టాప్‌ ఎగ్జిక్యూటివ్స్‌ నిర్ణయించినట్లుగా సమాచారం.

ఈ నిర్ణయం అమలు చేసినట్లయితే 2022-2023 తర్వాత మెటా కంపెనీ చేపట్టబోయే అతిపెద్ద తొలగింపులు ఇవే కానుండటం విశేషం. అయితే ఈ తొలగింపులకు ఖచ్చితమైన తేదీలు, తొలగింపు సంఖ్య మాత్రం అధికారికంగా వెలువడలేదు. గతంలో.. నవంబర్ 2022లో మెటా 11 వేల మంది ఉద్యోగులను తొలగించింది. తర్వాత నాలుగు నెలల తర్వాత మరో 10 వేల మంది ఉద్యోగులను తగ్గించామని ప్రకటించింది.

మెటా ప్రస్తుతం ఏఐ రంగంలో విస్తృతంగా పెట్టుబడులు పెడుతోంది. ఇందులో భాగంగానే 2028 నాటికి డేటా సెంటర్ల ఏర్పాటు కోసం 600 బిలియన్‌ డాలర్లు వెచ్చించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కంపెనీ ఇటీవల వెల్లడించింది. ఈ మేరకు ఉద్యోగాల సంఖ్య పెరుగాల్సింది పోయి…ఉద్యోగాల తొలగింపులకు మెటా నిర్ణయించడానికి ఏఐ సాంకేతికత కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

ప్రతి జిల్లాకు అయిల్ ఫామ్ ఫ్యాక్టరీలు విస్తరించాలి: పొన్నం
హైదరాబాద్ ‘రీజినల్ రింగ్ రైల్’ కు కేంద్ర రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్