వామ్మో డేటా సెంటర్లు…భయపెడుతున్న వీడియో!

డేటా సెంటర్ల వల్ల నీటి కొరత, విద్యుత్ భారం, గాలి-శబ్ద కాలుష్యం పెరుగుతున్నాయని వైరల్ వీడియోలు ఆందోళన రేపుతున్నాయి. పర్యావరణంపై వాటి ప్రభావం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

వామ్మో డేటా సెంటర్లు…భయపెడుతున్న వీడియో!

డేటా సెంటర్లు అంటే అభివృద్ది కేంద్రాలుగా..సాంకేతిక అభివృద్దికి ప్రతీకలుగా భావిస్తుంటారు. దేశ ఆర్థిక వ్యవస్థ చోదక శక్తులుగా చూస్తున్నారు. అభివృద్ది చెందిన దేశాలైన అమెరికా వంటి దేశాలు డేటా సెంటర్లను దూరం పెడుతుంటే..భారత్ వంటి దేశాలు..ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు మా రాష్ట్రంలో డేటా సెంటర్లు పెట్టండంటూ పోటీలు పడి మరి రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. డేటా సెంటర్లు పెట్టే కంపెనీలకు భూములు, నీళ్లు, మౌలిక వసతులు మేమే కల్పిస్తాం..రాయితీలిస్తాం అంటూ ప్రోత్సాహాకాలు సైతం అందిస్తున్నాయి. ఇదంతా నాణానికి ఒక భాగమైతే..డేటా సెంటర్లకు అమెరికా వంటి అభివృద్ది చెందిన దేశాలు ఎందుకు దూరం పెడుతున్నాయన్న ప్రశ్న ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. ఇందుకు సమాధానం అన్నట్లుగా సోషల్ మీడియాలో ఓ వీడియో డేటా సెంటర్ల ఏర్పాటుతో కలిగే పర్యావరణ విపత్తులను వివరిస్తూ అందరిని ఆలోచింపచేస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పలు వీడియోలు డేటా సెంటర్ల దుష్ప్రభావం మనవాళిపై, ప్రకృతిపై ఎంత ఉంటుంది అనే అంశాలు ప్రపంచ దృష్టికి తీసుకువస్తున్నాయి. అమెరికాలో ఒక డేటా సెంటర్ సమీపంలో నివసిస్తున్న ప్రజలు నిరంతర శబ్ద కాలుష్యం, కంపనలు, విద్యుత్ వినియోగ ఒత్తిడి, నీటి సరఫరా సమస్యలను ఎదుర్కొంటున్నట్లు బాధితులు చెబుతున్నారు.

డేటా సెంటర్ ఏర్పాటు అనంతరం అమెరికాలోని జార్జియాలో భూగర్భ జలాలకు పట్టిన దుస్థితి సదరు వీడియోలో కనిపిస్తుంది. డేటా సెంటర్ల ఏర్పాటు తర్వాత అక్కడి భూగర్భ జలాలు ఎలా కలుషితమైపోయాయి..ఎంతగా కాలుష్యం బారిన పడి తాగడానికి ఉపయోగంలో లేకుండా పోయాయన్నదానిపై జార్జియా ప్రజాప్రతినిధులు వీడియోలో వివరించారు. ఈ వీడియో చూస్తే..అభివృద్ధి చెందిన దేశాలను కాదని.. మన దేశంలో పోటీ పడి మరీ డేటా సెంటర్లు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో? అర్ధం అవుతుందని నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు.

అమెరికాలో డేటా సెంటర్లతో అభివృద్ది..ఆందోళనలు

డేటా సెంటర్ల పెరుగుదల అనివార్యమైపోగా…పెట్టుబడులను, ఉద్యోగాలను రెండింటినీ తీసుకొస్తున్నాయి. అదే సమయంలో వాతావరణ సమస్యలను సృష్టిస్తూ పరిసర ప్రాంతాల ప్రజల మనుగడను సవాల్ చేస్తుండటం ఆందోళకరం. 2026 ప్రారంభం నాటికి యునైటెడ్ స్టేట్స్ వ్యాప్తంగా 3,900 కు పైగా డేటా సెంటర్లు ఉన్నాయి. ఇది ప్రపంచంలోని మొత్తం డేటా సెంటర్లలో దాదాపు 37 శాతానికి సమానం. ఈ ప్రాంతాలు క్లౌడ్, ఏఐ మౌలిక సదుపాయాలకు జాతీయ కేంద్రాలుగా పనిచేస్తూ, వాటి పరిమాణంతో పోలిస్తే అసమానమైన వాటాలో భారీ స్థాయి సౌకర్యాలను కలిగి ఉన్నాయి. “ ప్రపంచ డేటా సెంటర్ రాజధాని ” గా వర్ణించబడే వర్జీనియాలో అత్యధిక సంఖ్యలో డేటా కేంద్రాలు ఉన్నాయి. దాని తర్వాత టెక్సాస్, కాలిఫోర్నియా ఉన్నాయి. ఈ మొదటి 10 రాష్ట్రాలు కలిసి దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం డేటా సెంటర్లలో సుమారు 60% వాటాను కలిగి ఉన్నాయి.

అసలు డేటా సెంటర్లతో లాభ నష్టాలు ఎంత?

డేటా సెంటర్లు (Data Centers) క్లౌడ్ స్టోరేజ్, సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి సాంకేతికతలకు మూలస్తంభాలు. అయితే, ఇవి నిరంతరం పనిచేయడానికి భారీ స్థాయిలో విద్యుత్, నీరు అవసరమవుతాయి. దీనివల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. AI డేటా సెంటర్ల వలన కలగబోయే భారీ విపత్తులపై యూరప్, అమెరికా దేశాల్లో ఆందోళనలు ఉదృతం అవుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ దారులు వెతుక్కోవడంలో భాగంగా.. పేద దేశాలు లేదా టెక్ రంగంలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతూ కార్పొరేట్ కంపెనీలకు రెడ్ కార్పెట్ పరిచే భారత్ వంటి దేశాలకు డేటా సెంటర్లు వస్తున్నాయి. కృత్రిమ మేధాతో అభివృద్ది శిఖరాలను అందుకోవాలనే ఆశతో పర్యావరణ విధ్వంసానికి భారత్ వంటి దేశాలు దారులు తెరుస్తున్నాయన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

డేటా సెంటర్ల ద్వారా ఉత్పన్నమయ్యే ప్రధాన సమస్యలు

గాలి కాలుష్యం: నిరంతర విద్యుత్ సరఫరా కోసం డీజిల్ జనరేటర్లను వాడటం వల్ల నైట్రోజన్ ఆక్సైడ్లు, సూక్ష్మ కాలుష్య కారకాలు విడుదలవుతాయి. ఇది శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుంది.

నీటి కొరత: సర్వర్లను చల్లబరచడానికి (Cooling) రోజుకు లక్షల గ్యాలన్ల నీరు అవసరమవుతుంది. కరువు ప్రాంతాలలో ఈ నీటిని వాడటం వల్ల స్థానికులకు తాగునీటి సమస్య ఏర్పడుతుంది.

శబ్ద కాలుష్యం: డేటా సెంటర్లలోని భారీ హై-స్పీడ్ ఫ్యాన్లు, శీతలీకరణ వ్యవస్థల వల్ల నిరంతర హోరు శబ్దం వస్తుంది. దీనివల్ల స్థానికులకు నిద్రలేమి, రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.

విద్యుత్ భారం: ఒక్కో డేటా సెంటర్ ఒక చిన్న నగరానికి సరిపడా విద్యుత్‌ను వినియోగిస్తుంది. ఈ విద్యుత్ ఉత్పత్తి కోసం బొగ్గు, గ్యాస్ వాడకం పెరిగి, కార్బన్ ఉద్గారాలు అధికమవుతున్నాయి.

వేడి ఉద్గారాలు (Heat Islands):  డేటా సెంటర్ల నుంచి బయటకు వచ్చే వేడి గాలి వల్ల స్థానిక ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.

వనరులు వినియోగం..పర్యావరణ సమస్యలు రెండూ అధికమే

సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ, కంప్యూటింగ్ డిమాండ్ పెరుగుతున్న కొద్దీ, డేటా సెంటర్లు అధికంగా ఇంధన శక్తిని వినియోగిస్తున్నాయి. ఒకే ఒక ఆధునిక AI డేటా సెంటర్ 100,000 ఇళ్లకు సరిపడా విద్యుత్తును ఉపయోగించగలదు. ప్రస్తుతం నిర్మిస్తున్న అనేక పెద్ద సెంటర్లు దీనికి 20రెట్ల వరకు విద్యుత్తును వినియోగిస్తాయని అంచనా.

డేటా సెంటర్ల నుండి భవిష్యత్తులో అవసరమయ్యే మొత్తం విద్యుత్ డిమాండ్‌పై అంచనాలు గణనీయంగా మారుతూ ఉంటాయి . లారెన్స్ బర్కిలీ నేషనల్ లాబొరేటరీ చేసిన ఒక అధ్యయనం ప్రకారం, 2028 నాటికి అమెరికా మొత్తం విద్యుత్ వినియోగంలో డేటా సెంటర్ల వాటా 12% వరకు ఉండవచ్చని తేలింది. గ్రిడ్ స్ట్రాటజీస్ చేసిన మరో విశ్లేషణ ప్రకారం, 2030 నాటికి 90 గిగావాట్ల (GW) విలువైన డేటా సెంటర్లు అందుబాటులోకి రావచ్చు. అంటే, ఐదేళ్లలోపు న్యూయార్క్ నగరపు వేసవికాలపు గరిష్ట డిమాండ్‌కు దాదాపు 9 రెట్లు ఎక్కువ డేటా సెంటర్లు గ్రిడ్‌లో కలవబోతున్నాయి.

ఇది యునైటెడ్ స్టేట్స్ అంతటా పెరుగుతున్న విద్యుత్ బిల్లుల గురించిన ఆందోళనలను మరింత పెంచుతోంది. 2025లో దేశవ్యాప్తంగా 60 బిలియన్ డాలర్లకు పైగా ధరల పెరుగుదల కనిపించింది, దీనితో 2024తో పోలిస్తే అమెరికన్లు సగటున విద్యుత్ కోసం దాదాపు 10% ఎక్కువ చెల్లిస్తున్నారు. ఈ ధరల పెంపునకు గల కారణాలు సంక్లిష్టమైనవిగానూ..మారుతూ ఉంటాయి . అయితే, డేటా సెంటర్ల కోసం కొత్త ఇంధన మౌలిక సదుపాయాలను సేకరించి, నిర్మించాల్సిన అవసరం కనీసం ఒక ప్రాంతంలో (మిడ్-అట్లాంటిక్) ధరల పెరుగుదలకు దోహదపడిందనడానికి ఆధారాలు ఉన్నాయి. తగిన రక్షణ చర్యలు తీసుకోకపోతే ఇతర ప్రాంతాలలో కూడా ఇదే పరిస్థితి తలెత్తవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

స్థానిక నీటి వనరులపై ప్రభావం

సర్వర్‌లను పనిచేయడానికి తగినంత చల్లగా ఉంచడానికి డేటా సెంటర్లకు భారీ మొత్తంలో నీరు అవసరం. మధ్యస్థాయి డేటా సెంటర్లు రోజుకు 300,000 గ్యాలన్ల వరకు నీటిని ఉపయోగించగలవు, అయితే పెద్ద సెంటర్లు రోజుకు 5 మిలియన్ గ్యాలన్ల వరకు వినియోగించగలవు. ఇది ఒక చిన్న పట్టణం ఉపయోగించే నీటితో సమానం. ఇటీవలి అంచనాల ప్రకారం, 2028 నాటికి, అమెరికాలోని AI-సంబంధిత డేటా సెంటర్లకు ఏటా 32 బిలియన్ గ్యాలన్ల వరకు నీరు అవసరం కావచ్చు. ఇది సుమారు 3,60,000 గృహాల ఇంటి లోపలి నీటి వినియోగానికి సరిపోతుంది.

ఈ భారీ డిమాండ్, ఇప్పటికే కరువు లేదా తరిగిపోతున్న నీటి సరఫరాను ఎదుర్కొంటున్న కమ్యూనిటీలకు ఒక తీవ్రమైన సమస్యగా మారింది. 2022 నుండి నిర్మించిన లేదా నిర్మాణంలో ఉన్న మొత్తం డేటా సెంటర్లలో మూడింట రెండు వంతులు దక్షిణ అరిజోనా, కొలరాడో నదీ పరీవాహక ప్రాంతం, టెక్సాస్ వంటి నీటి కొరత ఉన్న ప్రాంతాలలో ఉన్నాయి. దీనివల్ల కొన్ని ప్రాంతాలలో ప్రజలలో ఆందోళనలు. ప్రభుత్వాల పరిష్కార చర్యలు మొదలయ్యాయి.

వాయు కాలుష్యంతో వాతావరణ సమస్యలు

డేటా సెంటర్లకు స్థిరమైన, నమ్మకమైన విద్యుత్ సరఫరా అవసరం. అనేక కేంద్రాలు సాధారణ కార్యకలాపాల కోసం గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తిపై, అత్యవసర బ్యాకప్ కోసం డీజిల్ జనరేటర్లపై ఆధారపడతాయి.ఈ రెండింటితోనూ వాతావరణ,ఆరోగ్యపరమైన ప్రమాదాలు ఉన్నాయి. కొన్ని డేటా సెంటర్లు రోజువారీ కార్యకలాపాల కోసం తమ ప్రాంగణంలోనే గ్యాస్ విద్యుత్‌ను ఏర్పాటు చేసుకుంటున్నాయి. దీనివల్ల నిరంతర వాయు కాలుష్యం, గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు వెలువడుతున్నాయి. టెన్నెస్సీలోని మెంఫిస్‌లో xAI వారి కొత్త కొలోసస్ డేటా సెంటర్‌లో, రోజువారీ ఉపయోగం కోసం ఉద్దేశించిన 30కి పైగా సహజ వాయువు టర్బైన్‌లను ఏర్పాటు చేశారు. దీంతో ఈ నగర వాసులు అధిక ఆస్తమా రేట్లు, దీర్ఘకాలంగా ఉన్న పర్యావరణ ఆరోగ్య అసమానతలను ఎదుర్కొంటున్నారు. ప్రమాదకరంగా ఉన్న గాలి నాణ్యతను మరింత దిగజార్చవద్దవంటూ స్థానికులు న్యాయపోరాటానికి దిగారు.

డీజిల్ ఇంధనంతో నడిచే బ్యాకప్ జనరేటర్లు కూడా సూక్ష్మ కణ పదార్థం (PM2.5), నైట్రోజన్ ఆక్సైడ్లు (NOx) వంటి హానికరమైన వాయు కాలుష్య కారకాలను విడుదల చేస్తాయి. ఇవి శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు, ఆస్తమా , ఇతర తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈ జనరేటర్లను కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించినప్పటికీ, అవి సహజ వాయువు ప్లాంట్ల కంటే 200 నుండి 600 రెట్లు ఎక్కువ నైట్రోజన్ ఆక్సైడ్లను విడుదల చేస్తూ, అసాధారణమైన ఆరోగ్య ప్రభావాలను కలిగిస్తాయి . వర్జీనియాలో జరిపిన ఒక విశ్లేషణ ప్రకారం, పరిమిత బ్యాకప్ జనరేటర్ల వాడకం కూడా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో దాదాపు $300 మిలియన్ల వార్షిక ప్రజారోగ్య ఖర్చులకు, 14,000 ఆస్తమా సంబంధిత ఆరోగ్య ప్రభావాలకు దారితీయవచ్చని అంచనా వేయబడింది. దీంతో కొన్ని సంస్థలు తమ ప్రాంగణంలోనే స్వచ్ఛమైన విద్యుత్ ప్రత్యామ్నాయాలను అవలంబించడం ప్రారంభిస్తున్నాయి.

శబ్ధ కాలుష్య సమస్యలు అధికమే

డేటా సెంటర్ నిర్మాణం,పైకప్పు శీతలీకరణ వ్యవస్థలు, బ్యాకప్ జనరేటర్లు తీవ్రమైన శబ్దంతో కూడి ఉంటాయి. చిన్న డీజిల్ జనరేటర్లు 85 డెసిబెల్స్ వరకు శబ్దాన్ని చేస్తాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ స్థాయి వినికిడికి హాని కలిగించగలదు. పెద్ద పారిశ్రామిక యూనిట్లు 100 డెసిబెల్స్ వరకు శబ్దాన్ని చేయగలవు. ఇది ఒక మోటార్ సైకిల్ లేదా జాక్‌హామర్ శబ్దానికి సమానం. ఈ శబ్దం ఒకేసారి గంటల తరబడి లేదా రోజుల తరబడి కొనసాగవచ్చు. వర్జీనియాలోని లౌడన్ కౌంటీ నివాసితులు సమీపంలోని డేటా సెంటర్ కారణంగా నిద్రకు భంగం, తలనొప్పులు, జీవన నాణ్యత కూడా తగ్గడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు నివేదించారు. ఇటీవల జరిగిన కాంగ్రెస్ రౌండ్‌టేబుల్ సమావేశంలో కూడా ఇలాంటి అనుభవాలే వ్యక్తమవ్వడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో డేటా సెంటర్లు శబ్ధ నివారణ ప్రణాళికల అమలు ప్రయత్నాలు ప్రారంభించాయి.

భారీగా భూమి వినియోగం..

భారీ డేటా సెంటర్ల ఏర్పాటకు వందలు, వేల ఎకరాల భూములు అవసరమవుతుండటంతో ఆ ప్రాంతాల్లో భూ సమస్యలను రేకెత్తిస్తున్నాయి. 2024లో సగటు డేటా సెంటర్ స్థలం సుమారు 224 ఎకరాలు లేదా 0.35 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉండేది. ఇది దాదాపు 450 ఫుట్‌బాల్ మైదానాల పరిమాణానికి సమానం. ఇప్పుడు భూ సేకరణ అవసరాలలో 144% పెరుగుదలను సూచిస్తుంది. దశలవారీ నిర్మాణం,భవిష్యత్ విస్తరణకు వీలు కల్పించే బహుళ-భవనాల క్యాంపస్‌ల కోసం డెవలపర్లు ఎక్కువగా పెద్ద స్థలాలను కోరుకుంటున్నారు. విస్కాన్సిన్ ఫార్మ్ బ్యూరో యొక్క ఇటీవలి నివేదిక ప్రకారం అతిపెద్ద క్యాంపస్‌లు 1,000 ఎకరాలు లేదా సుమారు 1.6 చదరపు మైళ్లను మించి ఉంటున్నాయి. దీంతో డేటా సెంటర్ల కోసం సారవంతమైన వ్యవసాయ భూమి సేకరణ ప్రక్రియ కాస్తా హాయో, ఇండియానా,వర్జీనియాలోని గ్రామీణ ప్రాంతాలలో ఆందోళనకు సైతం దారితీసి ఉద్రిక్తతలను రేపింది.

పర్యావరణ, ఆర్థిక సవాళ్లు మరింత జఠిలం

కొత్తగా వెలువడుతున్న విశ్లేషణల ప్రకారం, కొన్ని డేటా సెంటర్ల ఏర్పాటు విధానాలు దీర్ఘకాలంగా ఉన్న పర్యావరణ, ఆర్థిక సవాళ్లను మరింత తీవ్రతరం చేయవచ్చని తెలుస్తోంది. అమెరికా దేశవ్యాప్తంగా సుమారు 700 డేటా సెంటర్లపై జరిపిన ఒక జాతీయ సమీక్షలో, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వారి ఎన్విరాన్‌మెంటల్ జస్టిస్ ఇండెక్స్ ప్రకారం వాయు కాలుష్యం, పార్కుల లభ్యత, నీటి కాలుష్యం వంటి పర్యావరణ భారాలు సగటు కంటే ఎక్కువగా ఉన్న జనాభా గణన ప్రాంతాలలో వాటిలో దాదాపు సగం ఉన్నాయని తేలింది. కాలిఫోర్నియాలో ఇప్పటికే ఉన్న ప్రణాళికలో ఉన్న డేటా సెంటర్లు అధిక వాయు కాలుష్యం ఉన్న ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తున్నాయని నివేదికలు వెల్లడించాయి.

ఇవి కూడా చదవండి :

లోన్ రికవరీ వేధింపులకు చెక్..ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు ఇవే
పెద్దపులి దాడిలో..నలుగురు మహిళల మృతి