నగదు రహిత చికిత్సలకు ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలి : లచ్చిరెడ్డి
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు, వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కోరారు. ఐపీ, ఓపీ చికిత్సలకు ప్రభుత్వం నుంచే కాకుండా ఉద్యోగి కాంట్రిబూషన్ కూడా ప్రతి నెల సమానంగా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని గుర్తు చేశారు.
- సీఎస్‌కు విజ్ఙప్తి చేసిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ వి లచ్చిరెడ్డి
విధాత, హైదరాబాద్: రాష్ట్రంలోని ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు, వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో అన్ని రకాల జబ్బులకు అపరిమిత, నగదు రహిత వైద్య సేవలను అందేలా చూడాలన్నారు. ఐపీ, ఓపీ చికిత్సలకు ప్రభుత్వం నుంచే కాకుండా ఉద్యోగి కాంట్రిబూషన్ కూడా ప్రతి నెల సమానంగా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును మంగళవారం తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి నేతృత్వంలో జేఏసీ ప్రతినిధులు కలిసి ఉద్యోగుల ఆరోగ్య పథకం(ఈహెచ్ఎస్) అమలు గురించి వినతిపత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా లచ్చిరెడ్డి, ఇతర జేఏసీ ప్రతినిధులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పలు విషయాలను వివరించారు. ఈహెచ్ఎస్ అమలుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయవలసిందిగా కోరారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి ఆధారిత కుటుంబ సభ్యులకు ఎంపానెల్ చేసిన ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యం అందించేందుకు ఉద్యోగుల వేతన స్థాయిని కాంట్రీబూషన్‌గా ఈహెచ్ఎస్‌కు చెల్లించేందుకు రూపొందించడం జరిగిందని లచ్చిరెడ్డి గుర్తు చేశారు. కానీ, కొన్ని అనివార్య కారణాల వలన ఇది అమలు చేయకపోవడంతో వైద్య ఖర్చుల రీయింబర్స్‌మెంట్ విధానమే కొనసాగుతున్నదని వివరించారు.
ఉద్యోగులు, పెన్షనర్లకు ఇన్–పేషెంట్.. అవుట్–పేషెంట్ నగదు రహిత చికిత్స కోసం మార్గదర్శకాలు జారీ చేయబడినప్పటికీ అమలులో అనేక అవాంతరాలు ఏర్పడుతున్నాయని లచ్చిరెడ్డి తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులు హెల్త్ కార్డులను అంగీకరించకపోవడం, ఆసుపత్రి బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర ఆలస్యం ఉండటం వల్ల ఈహెచ్ఎస్ లక్ష్యం నెరవేరడం లేదని లచ్చిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram