Congress Internal Politics | పీసీసీ చీఫ్ బాధ్యతగా మాట్లాడాలి.. జీవన్‌రెడ్డి ఎపిసోడ్‌పై మంత్రి దుద్దిళ్ల సంచలన వ్యాఖ్యలు…
మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కష్టకాలంలో ఉండగా ముందుండి నడిపించారని పరిశ్రమల శాఖ మంత్రి డీ.శ్రీధర్ బాబు అన్నారు. తాను పార్టీ మారే ఆలోచన చేస్తున్నానని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించిన నేపథ్యంలో శ్రీధర్‌బాబు స్పందిస్తూ.. మొన్నే ఆయనతో మాట్లాడానని, మళ్లీ మాట్లాడుతానని తెలిపారు.
విధాత, హైదరాబాద్:
Congress internal politics | మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కష్టకాలంలో ఉండగా ముందుండి నడిపించారని పరిశ్రమల శాఖ మంత్రి డీ.శ్రీధర్ బాబు అన్నారు. తాను పార్టీ మారే ఆలోచన చేస్తున్నానని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించిన నేపథ్యంలో శ్రీధర్‌బాబు స్పందిస్తూ.. మొన్నే ఆయనతో మాట్లాడానని, మళ్లీ మాట్లాడుతానని తెలిపారు. జీవన్‌రెడ్డి.. తన తండ్రి శ్రీపాదరావుతో కలిసి పనిచేశారని, ఆయన ముందు తాను రాజకీయాల్లో జూనియర్ అని తెలిపారు. జీవన్‌రెడ్డి విషయంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక్ చొరవ తీసుకుంటే బాగుంటుందన్నారు. జీవన్ రెడ్డి విషయంలో పీసీసీ అధ్యక్షుడు బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మంగళవారం అసెంబ్లీ లాబీలో మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో చిట్ చాట్ చేశారు.
కాంగ్రెస్ నుంచి బయటికి పోతా అని జీవన్ రెడ్డి చెప్పలేదని, నియోజకవర్గంలో కాంగ్రెస్ క్యాడర్ పడుతున్న ఇబ్బందులు ఎప్పటికప్పుడు పార్టీ దృష్టికి తీసుకొచ్చారని శ్రీధర్‌బాబు అన్నారు. ఆయన లేవనెత్తిన అంశాలను పరిష్కరించడంలో కొంత జాప్యం జరిగిందని మంత్రి అంగీకరించారు. పార్టీ నాయకత్వం ఆయనకు మద్ధతుగా ఉందన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనేది ఏఐసీసీ పెద్దలు నిర్ణయిస్తారన్నారు. రాష్ట్రంలో నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తలకే నామినేటెడ్ చైర్మన్, డైరెక్టర్ పదవులు ఇచ్చారని, అందరూ పార్టీ కోసం పనిచేసేవాళ్లే ఉన్నారని శ్రీధర్‌బాబు తెలిపారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు తగ్గుతాయని, అయితే.. యువత నష్టపోకుండా.. ప్రత్యామ్నాయంగా కొత్త ఉద్యోగాల సృష్టిపై దృష్టి పెడుతున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో సింగరేణి కాలరీస్‌కు, కార్మికులకు నష్టం జరగకుండా ఉంటే కేంద్ర గనుల శాఖ మంత్రి జీ.కిషన్ రెడ్డి ప్రతిపాదనలపై ఆలోచన చేస్తామన్నారు. ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు సింగరేణికి చెల్లించి సంస్థను బలోపేతం చేస్తామన్నారు.
అసెంబ్లీ కమిటీలపై కసరత్తు జరుగుతోందని, 2 రోజుల్లో నియమిస్తామన్నారు. రాష్ట్ర గవర్నర్ కోటాలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ పదవి లభిస్తుందన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ బ్రహ్మణ పురోహితులపై చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని, ఆ కులం వారి నుంచి వ్యతిరేకత రావడంతో వెంటనే సరిదిద్దుకుని క్షమాపణ కూడా చెప్పారన్నారు. బీజేపీ నాయకులు, కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్ అనవసరంగా గొడవ చేస్తున్నారని అన్నారు. ఆయన ఇంటిపై బీజేపీ నాయకులు కోడిగుడ్లతో దాడి చేయడానికి ఎవరని ప్రశ్నించారు.
ఇరాన్ దేశం పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు చేస్తున్న యుద్ధం మూలంగా ప్రపంచ దేశాల్లో అల్లకల్లోలంగా పరిస్థితులు ఉన్నాయని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఈ యుద్ధం ప్రభావం రాష్ట్రంలో పరిశ్రమలపై ప్రభావం అధికంగా ఉందని చెప్పారు. భారతదేశానికి వస్తున్న క్రూడ్, గ్యాస్ ట్యాంకర్లను హర్మూజ్ జల సంధి వద్ద ఆపటం లేదన్నారు.
రాష్ట్రంలో వసూలు అయిన మొత్తాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోని కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీకి పంపిస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వెయ్యి కోట్ల రూపాయలు కేటీఆర్ పంపుతున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. సోషల్ మీడియాను నమ్ముకుని కేటీఆర్ ఊహా లోకంలో విహరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో మంచి జరుగుతున్నా, చెడు జరుగుతుందనే విధంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏదో జరుగుతుందంటూ 70 ఎంఎం సినిమా స్థాయిలో చూపాలని నానా తంటాలు పడుతున్నారని, ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు. ప్రభుత్వంలో ఏమైనా పొరపాట్లు ఉంటే తప్పకుండా సరిచేసుకుంటామని శ్రీధర్ బాబు వెల్లడించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram