HAM Roads | హ్యామ్ రోడ్ల టెండర్లలో రూ.18వేల కోట్ల కుంభకోణం : హరీశ్ రావు సంచలన ఆరోపణ
ఆర్అండ్ బీలో మొత్తం 24 టెండర్లు పిలువగా, అన్ని టెండర్లలో కాంట్రాక్టర్లు రింగ్ అయ్యేలా ప్రభుత్వం చొరవ తీసుకుందని హరీశ్ రావు ఆరోపించారు. మొత్తం 34 ప్యాకేజీలు కాగా, ఒక్కో ప్యాకేజీ విలువ రూ.450 కోట్లు అని చెప్పారు. ఇందులో 16 టెండర్లు ఆహ్వానించగా ఇద్దరంటే ఇద్దరే వేయడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు.
- ఐదు రాష్ట్రాల ఎన్నికలకు రూ.1,800 కోట్లు
- వెంటనే రోడ్ల టెండర్లు రద్దు చేయాలి
- బీఆర్ఎస్ ఎల్పీ ఉప నేత హరీశ్ రావు డిమాండ్
విధాత, హైదరాబాద్:
HAM Roads | తెలంగాణలో హ్యామ్ (హైబ్రిడ్ ఆన్యుటీ మోడల్) రోడ్ల నిర్మాణంలో రూ.18వేల కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ ఎల్పీ ఉప నేత టీ.హరీశ్ రావు ఆరోపించారు. ఆర్ అండ్ బీ లో రూ.12వేల కోట్లు, పంచాయాతీరాజ్‌లో రూ.6వేల కోట్లు పనులకు పదిశాతం (రూ.1,800 కోట్లు) మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లించారని ఆయన అన్నారు. ఈ మొబిలైజేషన్ అడ్వాన్సుల కోసం చెల్లించిన రూ.1,800 కోట్లు ఐదు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంపిస్తున్నారన్నారు. జలయజ్ఞాన్ని రేవంత్ రెడ్డి ధనయజ్ఞంగా మార్చారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
మంగళవారం అసెంబ్లీ ఆవరణలో హరీశ్ రావు మీడియాతో చిట్ చాట్ చేశారు. జాతీయ రహదారుల నిర్మాణం కోసం పిలిచే టెండర్లలో 20 నుంచి 30 శాతం తక్కువగా టెండర్లు వేస్తారని హరీశ్ అన్నారు. అదే రాష్ట్రంలో అయితే గతంలో తక్కువగా కోట్ చేసేవారని వివరించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి టెండర్లో 15 నుంచి 20 శాతం ఎక్కువగా కాంట్రాక్టర్లు కోట్ చేస్తున్నారని చెప్పారు. టెండర్ పిలిచే ముందు కమిషనర్ ఆఫ్ టెండర్స్ (సీఓటీ) కి పంపించాల్సి ఉండగా ఆ నిబంధనలను కాంగ్రెస్ సర్కార్ ఎత్తేసిందని మండిపడ్డారు. ఆర్ అండ్ బీ డిపార్ట్‌మెంట్ కమిటీ ఆమోదించేలా నిబంధనలు సవరించి, ఇలా పిలిచిన టెండర్లలో వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని హరీశ్ ఆరోపించారు. ఆర్ అండ్ బీలో పెండింగ్ బిల్లులు ఉన్నాయని, రోడ్ల నిర్వహణ గాలికి వదిలేశారని, కొనసాగుతున్న పనులు కూడా నిలిపివేశారన్నారు.
రింగ్ అయిన కాంట్రాక్టర్లు
ఆర్అండ్ బీలో మొత్తం 24 టెండర్లు పిలువగా, అన్ని టెండర్లలో కాంట్రాక్టర్లు రింగ్ అయ్యేలా ప్రభుత్వం చొరవ తీసుకుందని హరీశ్ రావు ఆరోపించారు. మొత్తం 34 ప్యాకేజీలు కాగా, ఒక్కో ప్యాకేజీ విలువ రూ.450 కోట్లు అని చెప్పారు. ఇందులో 16 టెండర్లు ఆహ్వానించగా ఇద్దరంటే ఇద్దరే వేయడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. సిబెట్ – సరళా, బృందా – బీవీఎస్సార్ కంపెనీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని టెండర్లు పంచుకున్నాయని ఆరోపించారు. ఈ సంస్థలకు చెందిన సాంకేతిక బిడ్లను తెరిచారని, ఇంకా ఆర్థిక బిడ్లును ఓపెన్ చేయలేదన్నారు. నల్గొండ –3 ప్యాకేజీని బృందా, సూర్యాపేట ప్యాకేజీని బీవీఎస్సార్ దక్కించుకుంటున్నాయన్నారు. ఈ కంపెనీలే కుమ్మక్కై టెండర్లు వేసాయన్నారు. పంచాయితీ రాజ్ శాఖలో మొత్తం 12 రోడ్లను రూ.6వేల కోట్లతో నిర్మాణం చేసేందుకు టెండర్లు పిలిచారన్నారు. కడపకు చెందిన సిబెట్ కు 7 పనులు, ఢిల్లీ జె ఇన్ ఫ్రా కు 3 పనులు, బీవీఎస్సార్, బృందాకు ఒక్కొక్కటి చొప్పున ఇస్తున్నారన్నారు.
అక్రమాలపై సీవీసీకి ఫిర్యాదు చేస్తాం
హ్యామ్ రోడ్ల నిర్మాణంలో పారదర్శకత ఉంటే టెండర్లు వెంటనే రద్దు చేసి, మళ్లీ పిలవాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. టెండర్ అవకతవకలపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ చేయించాలన్నారు. టెండర్ ధర కన్నా ఎక్కువగా ఐదు శాతం వేసేలా నిబంధనలు అమలు చేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. టెండర్లను రద్దు చేయకుంటే ఢిల్లీలోని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) కి ఆధారాలతో ఫిర్యాదు చేస్తామన్నారు. ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ బడ్జెట్ పద్దుల పై చర్చ జరిగే సమయంలో అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. హ్యామ్ రోడ్ల టెండర్లలో ఉన్నతాధికారులను బాధ్యులను చేస్తామని, ఈ విషయంలో ఒకసారి ఆలోచించుకుని ముందుకు వెళ్లాలని ఆయన కాంట్రాక్టర్లను కూడా హెచ్చరించారు. దండుపాళ్యం ముఠా లాగా కాంట్రాక్టులను, ప్రభుత్వ నిధులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం పంచుకు తింటున్నదని హరీశ్ రావు మండిపడ్డారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram