Karnataka | బెంగళూరు : కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే.. కూతురి పట్ల కనికరం చూపించలేదు. రూ. 5 వేలకు ఆశపడి కుమార్తెను వ్యభిచార రొంపిలోకి దింపాడు. ఆ బాలిక నెలసరిలో ఉన్నప్పటికీ మానవ మృగాలు ఆమెపై విరుచుకుపడ్డారు. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని బీరూర్ పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.
కర్ణాటక చిక్కమగళూరు జిల్లాకు చెందిన ఓ బాలిక తల్లి రెండేండ్ల క్రితం చనిపోయింది. ఇక బాలిక తన అమ్మమ్మ వద్ద ఉండి 12వ తరగతి వరకు చదువుకుంది. ఆ తర్వాత తిరిగి తన తండ్రి వద్దకు చేరుకుంది. తల్లి లేకపోయినప్పటికీ తండ్రి ప్రేమగా చూసుకుంటాడని ఆమె భావించింది. కానీ తండ్రి ప్రేమ కురిపించలేదు. తనను వ్యభిచార రొంపిలోకి దింపేందుకు సిద్ధమయ్యాడు.
రూ. 5 వేలకు ఆశపడి..
గతేడాది డిసెంబర్ నెలలో బాలికను నానమ్మ ఇంటికి తీసుకొచ్చాడు. అక్కడ రెండు రోజుల పాటు బస చేశారు. ఆ తర్వాత నానమ్మ, తండ్రిని భరత్ శెట్టి అనే వ్యక్తి కలిసి డబ్బుల ఆశ చూపాడు. మీ కూతురి చేత వ్యభిచారం చేయిస్తే రోజుకు రూ. 5 వేలు ఇస్తానని చెప్పాడు. దీంతో పైసలకు ఆశపడ్డ తండ్రి, నానమ్మ కలిసి బాలికను భరత్ శెట్టికి అప్పజెప్పారు.
మంగళూరుకు తరలిస్తూ.. అత్యాచారం
బాలికను తీసుకొని తండ్రి, భరత్ శెట్టి ప్రత్యేక వాహనంలో మంగళూరుకు బయల్దేరారు. మార్గమధ్యలోనే ఆమెపై మానవ మృగాలు విరుచుకుపడ్డాయి. 20 నుంచి 45 ఏండ్ల వయసున్న ఓ నలుగురు వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేశారు. తనకు నెలసరి అవుతుంది అని చెప్పిన వినిపించుకోని వారు మృగాల మాదిరి.. బాధితురాలిపై విరుచుపడ్డారు. అలా రెండు రోజుల పాటు బాలికపై అత్యాచారం చేశారు.
పోలీసులకు ఫిర్యాదు.. 12 మంది అరెస్ట్
భరత్ శెట్టి నుంచి తప్పించుకున్న బాధితురాలి బీరూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. క్షణాల్లో స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తండ్రి, నానమ్మతో పాటు మరో 10 మందిని అరెస్టు చేశారు. అయితే దక్షిణ కన్నడ జిల్లాలో భరత్ శెట్టి వ్యభిచార దందా నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. మంగళూరు, ఉడుపి ప్రాంతాల్లో భరత్ శెట్టిపై ఇప్పటికే 8 కేసులు నమోదైనట్లు తేలింది.
