సిరిసిల్ల ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ ఎఫెక్ట్‌.. కేసీఆర్‌కు ఈసీ నోటీసులు..

కాంగ్రెస్‌ పార్టీపై ఒక మీడియా సమావేశంలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుపై భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నోటీసులు జారీ చేసింది.

  • Publish Date - April 17, 2024 / 03:30 PM IST

18వ తేదీకల్లా స్పందించాలని ఆదేశం
లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని వెల్లడి

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీపై ఒక మీడియా సమావేశంలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుపై భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్‌ 5, 2024న సిరిసిల్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్‌ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ కాంగ్రెస్‌ నేత జీ నిరంజన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కమిషన్‌ ఈ నోటీసులు పంపింది. గతంలో కూడా ఉపన్యాసాలకు సంబంధించి కేసీఆర్‌కు కమిషన్‌ పలు సందర్భాల్లో సలహాలు, సూచనలు చేసిన విషయాన్ని ఆ నోటీసులలో ప్రస్తావించారు.

‘సిరిసిల్లలో కాంగ్రెస్‌ పార్టీపై అసభ్య, అభ్యంతరకర, అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ ఏప్రిల్‌ 6వ తేదీన కాంగ్రెస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జీ నిరంజన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు’ అని తెలిపారు. ఏప్రిల్‌ 18వ తేదీ ఉదయం 11 గంటలకల్లా ఈ నోటీసులపై తన వైఖరి వివరించాలని ఎన్నికల సంఘం కేసీఆర్‌ను ఆదేశించింది. నిర్దేశిత సమయంలోగా కేసీఆర్‌ నుంచి స్పందన రానిపక్షంలో కమిషన్‌ తగిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. లోక్‌సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన మార్చి 16, 2024 నుంచి ఇప్పటి వరకూ ఉల్లంఘనలపై తీసుకున్న చర్యల వివరాలను కమిషన్‌ వెల్లడించింది. బీజేపీ నుంచి 51 ఫిర్యాదులు అందగా, అందులో 38 కేసులలో చర్యలు తీసుకున్నట్టు తెలిపింది. కాంగ్రెస్‌ నుంచి 59 ఫిర్యాదులకు గాను 51 కేసులలో చర్యలు తీసుకున్నామని పేర్కొన్నది. ఇతర పార్టీల నుంచి 90 ఫిర్యాదులు అందాయని, అందులో 80 కేసులలో చర్యలు తీసుకున్నామని వెల్లడించింది.

Latest News