- ఆన్‌లైన్ పోర్టల్ ప్రారంభించిన ఎన్నికల సంఘం
విధాత: భారత ఎన్నికల సంఘం (ECI) రాజకీయ పార్టీల పనిని మరింత సులభతరం చేసింది. పార్టీలు తమ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఫైల్స్‌ను ఇకపై ఆన్‌లైన్‌లో సమర్పించడానికి ఎన్నికల సంఘం వెబ్ పోర్టల్‌ను ప్రారంభించింది.
ఇకపై పార్టీలు కంట్రిబ్యూషన్ రిపోర్ట్, వార్షిక ఆడిట్ నివేదిక, ఎన్నికల వ్యయ ప్రకటన నివేదిక ఇలా మూడు రకాల రిపోర్టులను ఆన్‌లైన్‌లో ఫైల్ చేయవచ్చని ఈసీఐ వెల్లడించింది.
ఢిల్లీలోని కార్యాలయానికి స్వయంగా వచ్చి ఆయా నివేదికలను రాజకీయ పార్టీలు సమర్పించాల్సిన అవసరం ఇకపై ఉండబోదని పేర్కొన్నది. సమయం, ఇతర ఇబ్బందులు అధికమించడానికి ఆన్‌లైన్ పోర్టల్ ఎంతో ఉపయోగపడుతుందని వెల్లడించింది.
సరైన, ప్రామాణికమైన ఫార్మాట్‌లో సకాలంలో నివేదికలను ఈసీఐకి సమర్పించడం కోసం ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించినట్టు ఎన్నికల సంఘం సోమవారం తెలిపింది