న్యూఢిల్లీ: ప్రధానిపై ఈగవాలినా సహించలేని పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నట్టు కనిపిస్తున్నది. పనౌటి (అపశకునం), జేబ్‌కాట్రా (జేబులు కొట్టేవాడు) వంటి పదాలను ప్రధానిని ఉద్దేశించి వాడినందుకు వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీకి ఎన్నికల సంఘం గురువారం నోటీసు జారీ చేసింది. నవంబర్ 25నాటికి తన స్పందనలు తెలియజేయాలని అందులో పేర్కొన్నది. ఈ ఆరోపణలకు సంబంధించి వివరణ ఇవ్వాలని ఈసీ రాహుల్‌ను కోరింది.
ప్రధానిని జేబులు కొట్టేవాడని, అపశకునం అని వ్యాఖ్యానించడం ఒక సీనియర్ రాజకీయ నాయకుడికి తగదని ఈసీ పేర్కొన్నది. 14 లక్షల కోట్ల రూపాయల రుణాలను గత తొమ్మదిదేళ్లలో బీజేపీ మాఫీ చేయించిందనేది కూడా వాస్తవాలకు దూరంగా ఉన్నదని పేర్కొన్నది. రాజస్థాన్‌లో ఇటీవల ఒక ఎన్నికల ప్రచారసభలో మాట్లాడిన రాహుల్.. ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్‌లో భారతదేశం ఓడిపోవడానికి అపశకునం కారణమని వ్యాఖ్యానించారు.
మరో సభలో మాట్లాడుతూ.. ‘జేబులు కొట్టేవాడు ఒంటరిగా రాడు. అక్కడ మొత్తం ముగ్గురు ఉంటారు. ఒకడు ముందు నుంచి వస్తాడు. మరొకడు వెనుక నుంచి వస్తాడు. పక్కనే మరొకడు కనిపిస్తాడు. ప్రధాని నరేంద్రమోదీ పనేంటంటే.. మీ దృష్టిని మళ్లించడం. ఆయన టీవీలో ఆయన ఎదురుగా తారసపడతారు. హిందూ-ముస్లిం, నోట్ల రద్దు, జీఎస్టీ వంటి విషయాల నుంచి మీ దృష్టిని మళ్లిస్తాడు. మరోవైపు అదానీ వెనుక నుంచి వ్చి, మీ డబ్బులు కొట్టేస్తాడు. మూడో వ్యక్తి అమిత్‌షా. ఆయన పనేంటంటే.. మొత్తం పర్యవేక్షించడం. ఏం జరుగుతున్నదో ఎవరికీ అర్థం కాకుండా చూస్తారు’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.