Elephants | ఇది విచిత్రమైన ఘటన.. మనషులు మాత్రమే మద్యం సేవించడం చూశాం. ఇటీవల ఓ కోతి కూడా బీర్ బాటిల్స్‌ను దొంగిలించి మద్యం తాగిన వార్తలు చదివాం. ఇప్పుడు కొత్తగా ఆ జాబితాలోకి ఏనుగులు వచ్చి చేరాయి. నీళ్లు అనుకొని నాటుసారాను తాగేశాయి ఓ 24 ఏనుగులు. ఆ తర్వాత గాఢ నిద్రలోకి జారుకున్నాయి ఆ గజరాజులు.
వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని కియోన్‌జార్ జిల్లాలోని శిలిపడా గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు సమీప అడవుల్లో నాటుసారాను తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల గ్రామస్తులు కొందరు అడవికి వెళ్లి కొన్ని రకాల పువ్వులను సేకరించి కుండల్లో పులియబెట్టారు. అయితే అటుగా వెళ్లిన ఏనుగులు.. ఆ ద్రావణం నీరు అనుకొని తాగేశాయి. ఇంకేముంది ఆ ఏనుగులకు మత్తెక్కింది. 24 ఏనుగులు ఒకే చోట గాఢ నిద్రలోకి జారుకున్నాయి.
మరుసటి రోజు తెల్లవారుజామున 6 గంటల సమయంలో గ్రామస్తులు అడవిలోకి వెళ్లారు. నాటుసారా తయారీలో భాగంగా పులియబెట్టిన పువ్వుల కుండలు పగిలిపోయి ఉన్నాయి. వీటికి కొద్ది దూరంలోనే ఏనుగుల గుంపు నిద్రలోకి జారుకున్న ఘటనను గమనించారు. ఏనుగులే ఈ ద్రావణాన్ని తాగి ఉంటాయని గ్రామస్తులు భావించారు. దీంతో వారు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. గాఢ నిద్రలోకి జారుకున్న ఏనుగులను అటవీ అధికారులు లేపి అక్కడ్నుంచి పంపించారు.