Eatala Rajender |
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఎమ్మెల్సీ పదవిచ్చి బీఆర్ఎస్ పార్టీ ఓ సైకోను తనమీద ప్రయోగించిందని ఆయనను తక్షణమే భర్తరఫ్ చేయాలని బిజెపి నాయకుడు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ, శాసనమండలి విప్ పాడి కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు. బుధవారం హనుమకొండకు వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈటల రాజేందర్ పై సుపారి హత్యకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణల నేపథ్యంలో బుధవారం ఆయన మరోసారి స్పందించారు.
ఓ పద్ధతి పాడు లేకుండా ఇష్టానుసారం వ్యవహరించే సైకోకు ఎమ్మెల్సీ లాంటి పదవులు ఇచ్చి ఉసికొలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతి భవన్ నుంచి ఆదేశాలు జారీ చేస్తూ ఇలాంటి సైకోను ఉపయోగించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై కక్ష కట్టి, తాను లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ప్రయోగించిన వ్యక్తి తన నియోజకవర్గంలో సమస్యలు సృష్టిస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో రకరకాల గొడవలు, ఇబ్బందులకు గురి చేస్తున్నారని వివరించారు. ఈ పద్ధతులు సరైనవికావని అయితే ఇలాంటి తాటాకు చప్పుల్లకు తాను భయపడేది లేదంటూ ఈటెల స్పష్టం చేశారు.
తనను హత్య చేసేందుకు సుపారి ఇచ్చినట్లు అందిన సమాచారం మేరకు సెంట్రల్ ఇంటలిజెన్సీ బ్యూరో నివేదిక మేరకు కేంద్రం తన భద్రత విషయమై స్పందించి ఉంటుందని వివరించారు. అందుకే వై కేటగిరి భద్రత కల్పిస్తామని ప్రకటించినట్లు చూశానని చెప్పారు. ఎవరు ఏ భద్రత కల్పించినా తనలాంటి ప్రజా నాయకుడికి ప్రజలు, కార్యకర్తలే రక్షణగా నిలుస్తారని ఈటల విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు ప్రేమేందర్ రెడ్డి ధర్మారావు రావు పద్మ కుసుమ సతీష్ రాకేష్ రెడ్డి
స్పందించిన మంత్రి కేటీఆర్
ఈటెల రాజేందర్‌తో పాటు ఆయన భార్య జమున మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రాజేందర్‌ను హత్య చేసేందుకు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి రూ.20 కోట్ల సుఫారీ ఇచ్చారని సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఈటలకు వై కేటగిరి భద్రత కల్పించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప్రతిస్పందించారు. ఈటెల భద్రతకు సంబంధించి రివ్యూ చేసి తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే భద్రత పెంచాలంటూ డిజిపి అంజనీ కుమార్‌ను కోరారు. ఈ నేపథ్యంలో డీసీపీ సందీప్ రావు షామీర్పేటలోని ఈటల రాజేందర్ ఇంటిని సందర్శించి భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఈటెల రాజేందర్‌తో కూడా మాట్లాడినట్లు చెబుతున్నారు.